స్వభావమే మనిషికి ముఖ్యం!

by Disha edit |
స్వభావమే మనిషికి ముఖ్యం!
X

మనిషి యొక్క ప్రవర్తన స్వభావాలు, వ్యక్తిత్వాలు దగ్గర చేస్తాయి. మల్ల మార్పులు జరిగితే దూరం కొడతాయి. బంధువుల మధ్యనైనా స్నేహితుల మధ్యనైనా ఇలాగే ఉంటుంది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నాయకుల విధానాలు అంటే ప్రజా జీవితంలో ఉండే వారి ప్రతి చర్యకు ప్రజల గమనింపు ఉంటది. ఒకప్పుడు ప్రేమించిన వారు ఆ అబ్సర్వేషన్‌తో మరింత దూరం కావచ్చు, దగ్గర కావచ్చు. ముఖ్యంగా నాయకత్వంలో ఉన్నవారికి కన్ను మిన్ను కాననితనం ఆవహించవచ్చు. కనుచూపులతోనే శాసించే అధికారం ఉండవచ్చు గానీ ఆ అహంకారం పెంచుకోవడమా తెంచుకోవడమా అన్నదాని మీదనే ప్రజల ప్రేమ ఉంటది. అహంకారపూరిత ప్రవర్తనలు వ్యక్తిగతంగానూ ఉండవచ్చు, వ్యవస్థ పరంగానూ ఉండవచ్చు ఇవన్నీ పలు సందర్భాల్లో ప్రజల మనసుల్లో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్టే అవుతాయి. తర్వాత ఎక్కడ మీట నొక్కాలనో అక్కడ నొక్కుతరు. దీనికి ప్రోద్బలం కానీ అవతలి వాల్ల మంచితనం కానీ కొలమానం కాదు. నిన్ను దించడమే తరవాయి అయితది. లెక్కలేని సంక్షేమ పథకాలు ఇవ్వవచ్చు, ఎండిన నేల మీద సాగునీరు ప్రవహించనీయవచ్చు కానీ ఎవరికైనా ఆత్మగౌరవమే ముఖ్యం కదా! ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరూ హననం కాకున్నా వ్యవస్థ మీద ఆ అసరు ఉంటది.

మనుషులను కలవాలి కదా!

ఎంత హిమాలయాలంత ఎదిగినా మనుషులను కలువడం, మాట్లాడటం, కరచాలనం చెయ్యడం ముఖ్యం కదా! ఎవరినీ కలవకపోతే ఎవరికీ కలిసే అవకాశం ఇవ్వకపోతే, మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఆ ప్రవర్తనా సంకేతాలు అందరికీ చేరుతాయి కదా. అసలు మనుషులలో మాట్లాడితేనే పరిపాలన పరిఢవిల్లుతది కదా ముందైతే వినాలి. మాటలు వినేందుకు చెవులు ఎదురుచూడాలి. విన్నవి అన్నీ చేయమని కాదు చేయాలని కాదు... కానీ వినడం కొరకు సమయం కేటాయించక దర్వాజలు ఎల్లవేళలా మూసివేస్తే ఎలా ఉంటుంది. అసలు ఆ చెవులకు తాళాలు వేయడం ఎందుకు అనేదే ప్రశ్న. ఆర్థికంగా ఎంత ఆదుకున్నా ఇంటింటికీ సంక్షేమ క్షేమాలు అందించినా కానీ వీల్లందరితో మాట్లాడం కలువడం కాకపోవచ్చు. ఇలాంటి వారికి కల్సుకునే అవసరం లేకపోవచ్చు కానీ కలువలని కోరుకున్న వారిని ఆ నీడలకే రాకుండా అడ్డుకుంటే ఎట్ల? కలువు.. ఏం బోతంది. విను ఏం బోతంది. వాల్లు చెప్పింది చెయ్యకు. ఏం బోతంది? కానీ కల్సుడే బంద్... కలువనిచ్చుడే బంద్ అంటే కనికరం లేనితనమే అయితది. ఇంతగా మారిపోయిన స్వభావ వ్యక్తిత్వాలపై గమనించే మనుషులందరు నొచ్చుకుంటారు. ఆ నొచ్చుకున్నతనమే ఆ నచ్చని తనమే గూడు కట్టుకుంటది. ఆ గూడు చీముగా మారి గడ్డ ఎప్పుడో పిన్నిసులు కుచ్చితే పగిలిపోతది.

అహం ఎవరికి వారికే అందంగానే ఉంటుంది. చూసేవారి ఆత్మగౌరవం కరిగిపోతది. ఆత్మగౌరవంతో పాటు అంతకుముందున్న ప్రేమ అభిమానంకు ఎక్కన్నో ముల్లు కుచ్చినట్టు నొప్పివేస్తది. ఐశ్వర్యం సంపాదన ఎవరున్నా నడిచే వ్యవహారమే కావచ్చు కానీ ప్రజాస్వామిక స్వేచ్ఛ అవసరం. భావ ప్రకటన స్వేచ్ఛ అవసరం. ఆత్మగౌరవం నినాదమే ఆసలైనది అదే తిరుగులేని నాయకున్ని చేసినప్పుడు అదే ఆలంబనగా నలిపేస్తది. ఇది మనుషులకు, నాయకులకు వ్యవస్థలకు అందరికీ అవసరమైనది. ఎప్పుడూ వినే చెవులను బందీ చేయరాదు. చూసే కనులను కలిసే కరచాలనాలను ఆహ్వానించాలె!

- అన్నవరం దేవేందర్

94407 63479

Next Story

Most Viewed