- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్షరాల వర్ణతత్వం.. ఆరవ భూతం
Aarava Bhootham By Yanamadala Sridevi Book Review

వ్యావహారిక భాషా ఉద్యమం. ప్రజల భాషలో సాహిత్య సృజన జరగాలని సాగిన ఉద్యమం. దీనివలన సామాన్యుడి మాట తీరుకు సాహిత్య స్థాయి వచ్చింది. పలుకుబడులు, సామెతలు, మాట విరుపులు వెరసి ఇదివరకు ఛందస్సులో ఒదగని ఒక మట్టి వాసన కొత్త రచనా రూపంలో సహజాతి సహజంగా వర్ణాలకు ‘వర్ణo’ అద్ది ఒరిగిపోయింది. యనమదల శ్రీదేవిగారి ‘ఆరవ భూతం’ కవితా సంపుటి అక్షరాలకు ఆవేశం, ఆర్తి కలిపి ఆలోచించమని చెబుతుంది.
‘ప్రతీ మాటకీ శక్తి ఉంది పదును ఉంది.
ప్రతీ మాటకీ అర్థం ఉంది, ఔచిత్యం ఉంది’ అంటారు తిలక్. శ్రీదేవి గారి ‘ఆరవ భూతం’ సంపుటిలో ఐదు పదులకు మించి ఉన్న కవితలలో ప్రతీ అక్షరానికి ఓ ఔచిత్యం ఉందని వాస్తవం తెలుస్తుంది. కవి సామాజికులలో ఒకరుగానే ఉండాలి. కాని అసామాన్యమైన సృజనశీలిగా ఉండటం కవికి మాత్రమే ప్రత్యేకం. ఈ కవితాసంపుటికి ఓ సాహితీ సంస్థ వారు బహుమతిని కూడా ప్రకటించారంటే అర్థమవుతుంది ఈ కవిత్వానికున్న శక్తి. శ్రీదేవి తన కవితలలో అమ్మ, స్త్రీ, చేనేత, వాతావరణం ఇలా అన్ని సమస్యలను సృశియించారు. కవిత్వానికి తగిన ‘వస్తువు’ను ఎన్నుకోవటం, అందుకు తగిన భాషలో అలంకరించటం వంటివి గొప్పగా చేశారు. ఆమె ఎంతో నైపుణ్యంతో అలరించిన తీరు పాఠకులను ముగ్ధులను చేస్తుంది. ఉదాహరణకు – ‘అమ్మపల్లె’లో పల్లె జీవితాలను ఎంతో హృద్యంగా చిత్రించిన వైనం అబ్బురమనిపిస్తుంది.
చెమటకు ఆగ్రహం కలిగిస్తే..
‘అమాయకత్వం మూర్తీభవించిన జీవనం. ఏ పాండిత్యం ఎరుగని పవిత్ర.. జీవనం.’ అత్యంత తక్కువ పదాలతో, పదాలకు పదును, ప్రాకృతి అందం, పల్లెజనంలో ‘మనీషి’తనం ఎంతో సరళంగా శ్రీదేవి చిత్రించారు. ఇందులో మరో హెచ్చరిక చేశారు. ‘బొబ్బలెక్కిన పాదాలకు గతకుల ఆనవాళ్ళు సింహాసనాలకు సవాళ్ళు’ కవిత్వంతో అబ్ స్ట్రాక్ట్ అనేది గొప్ప అందాన్ని తెస్తుంది. ఆలోచనను దానికి జతచేస్తుంది. ఈ రెండింటి వెనుక సమాజరీతిలో వర్గ దోపిడీకి విసిగిన శ్రామిక వర్గం చెమటకు ఆగ్రహం కలిగిస్తే జరిగే ప్రపంచయుద్దాల రీతి దృశ్యమానమవుతుందని పై వాక్యాల వ్యాఖ్యానం ‘చేనేతకు చేయూత’ లేక నేతన్న బ్రతుకులో’ వర్ణం వెలిసిపోతుంటే చివరకు జరిగేదేమిటని ఆలోచించమని చెప్పే ‘నేతన్నకు చేయూత’లో ఆర్తిగా చెబుతారు.
గాంధీ మళ్ళీ పుట్టాలా?
‘ఆశల బావిలో జలాలెండిపోతుంటే అతడు నేసిన త్రివర్ణ పతాకం తనపరంగా వివర్ణ మౌతుంటే..’ ఎంత బాధాతప్త హృది స్పందన? ‘ఇంతి ఎవరిచేతి బంతికాదు..’ అనే కవితలో ఆమె అబల కాదు / సబలే. స్వాతంత్ర్య రథానికి తాను ఓ చక్రమయి తిరిగింది / స్వరాజ్యాని తెచ్చి పెట్టింది అని ‘ఆమె’ యొక్క ఉద్యమ స్పూర్తిని తెలుపుతారు శ్రీదేవి. ఇదే కవితలో మహిళ ఇంకా ‘తన స్థానం ఇంకా / ద్వితీయ శ్రేణిలోనే’ అని ఆక్రోశిస్తారు. తాను స్త్రీ మూర్తిగా తనయొక్క మనోభావాలను ఎంతో ప్రతిభావంతంగా ఈ కవితలో చిత్రించారు. స్త్రీకెలా సమానత్వం వస్తుందో, అడుగడుగున గాంధారి కొడుకులున్న వర్తమానంలో ‘స్త్రీకి స్వాతంత్ర్యం తెచ్చేందుకు గాంధీ / మళ్ళీ పుట్టాలని’ నినదిస్తారు. చట్టాలెన్ని చేసినా ‘మహిళ’కు న్యాయమేదని ప్రశ్నిస్తారు. ప్రశ్నల్లో వేదనాపూరిత ‘ఆమె’తత్వం అర్థమవుతుంది.
‘ఆరవభూతం’ గురించి ఎంతయినా చెప్పవచ్చు. కాని.. అంతా చెప్పేస్తే శ్రీదేవి గారి కవితావైభవం చదువరులకు మిగలదు. పుస్తకాన్ని చదవాలి. చదువుతున్న వేళ కలిగే ఆనందం, ఆలోచన, ఆవేదన జమిలీగా పిడికిలి బిగించేటట్టు చేయాలి. యనమదల శ్రీదేవిగారి ఆలోచన సహితం ఇదే అనుకోవచ్చు. కవిత సంపుటిలోని ప్రతి కవితా ఓ అగ్ని శకలం.
పుస్తకం: ఆరవభూతం
పేజీలు: 130
వెల: రూ. 200
ప్రచురణ.. తపస్వి మనోహరం
ప్రతులకు..రచయత్రి
సమీక్షకురాలు
యం. కె. లక్ష్మి
98484 34500






