సందేశాత్మక కథల సమాహారం.. మహబూబ్ నగర్ జిల్లా బడిపిల్లల కథలు

by Ravi |   (  Updated:2026-07-27 01:00:54  IST  )

మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రచించిన ‘బడిపిల్లల కథలు’ 86 కథలతో రూపొందింది. ఈ పుస్తకం నిజాయితీ, పర్యావరణ పరిరక్షణ, మానవీయ విలువలు, కష్టపడి సాధించాలనే తపన వంటి అంశాలను చిన్నారుల సహజమైన రచనా శైలిలో ఆవిష్కరిస్తుంది. జిల్లా విద్యాశాఖ చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నం విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించే ఆదర్శ కార్యక్రమంగా నిలిచింది.

సందేశాత్మక కథల సమాహారం.. మహబూబ్ నగర్ జిల్లా బడిపిల్లల కథలు
X

విద్యార్థుల్లో బాలసాహిత్య సృజనను పెంపొందించాలనే లక్ష్యంతో మహబూబ్‌నగర్ జిల్లా నుండి బడిపిల్లల కథలు బాలల కథా సంకలనం వెలువడింది. మహబూబ్ నగర్ జిల్లా విద్యాశాఖ నుంచి వెలువడిన మొట్టమొదటి కథల సంకలనం ఇదే కావడం విశేషం. ఇందులో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే రాసిన కథలు ఉన్నాయి..

ఈ పుస్తకంలో రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాసిన వందల కొద్దీ కథలను సేకరించి వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ కథల పుస్తకంలో మొత్తం 86 కథలు ఉన్నాయి. వేటికవే కథలు విభిన్నంగా ఉండీ అందరినీ ఆలోచింపజేస్తాయి. చిన్నారుల ఆలోచన విధానం నుండి పురుడుపోసుకున్న స్వచ్ఛమైన కథలు, సహజమైన వ్యక్తీకరణతో అలరించే కథలు. దేని విశిష్టత దానిదే అన్నట్లుగా ఒకరు చదువుకుంటే సాధించలేనిది ఏదీ లేదంటూ చదువు గొప్పతనాన్ని తెలిపితే, మరొకరు ఇతరులకు సహాయం చేస్తే తప్పకుండా మంచి జరుగుతుందని తెలిపారు.

ఒక్కో కథకు ఒక్కో కోణం..

ఇందులో నిజాయితీ విలువను తెలియజేస్తూ ఎం.పీ.పి.ఎస్ చౌదర్ పల్లి విద్యార్థి డి. లహరి రచించిన నిజాయితీగల చిన్నారి కథ. పాఠశాల పరిసర ప్రాంతాల పరిశుభ్రతను, పర్యావరణహితాన్ని, పోషక విలువల ఆవశ్యకతను తెలియజేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని జి.గాయత్రి తన కథలో సూచించింది. ఎంతటి ఆపదలో ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఆపదనుండి తప్పించుకోవచ్చనే సందేశాన్ని అందించే కథను ప్రాథమికోన్నత పాఠశాల జీనుగరాల విద్యార్థి జి. ఐశ్వర్య తెలిపింది. మద్యం, ధూమపానం వంటి చెడు వ్యసనాలు ఉన్న వ్యక్తుల వలన వారి కుటుంబమే చిన్నా భిన్నం అవుతుందనే విషయాన్ని ఎం.పి.పి,ఎస్ బాదేపల్లి,జడ్చర్ల విద్యార్థి ప్రవీణ్ కుమార్ తన కథలో తెలియజేశాడు. మోసంతో వ్యాపారం చేస్తే ఎప్పుడో ఒకప్పుడు పట్టుబడక తప్పదు, చేసిన నేరానికి శిక్ష తప్పదు అనే విషయాన్ని తెలియజేస్తూ జడ్పీ.హెచ్.ఎస్. బాలుర బాదేపల్లి జడ్చర్ల విద్యార్థి జి. ప్రణీత తన కథలో వ్యక్తం చేసింది. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని పెద్దలు చెప్పిన మాటలను ప్రేరణగా తీసుకుని కష్టపడి ప్రయత్నించి కలను నెరవేర్చుకున్న వ్యక్తిని గురించి ఎం.పి.పి.ఎస్ రామస్వామి గుట్ట తండా జడ్చర్ల విద్యార్థి పి నికిత రచించారు.

ఎవరినీ తక్కువగా చూడొద్దు...

హేళన చేసిన వారి చేతనే ప్రశంసలు అందుకునే స్థాయికి ఎదిగిన ఎవరిని తక్కువగా చూడొద్దు అనే కథను జడ్పీ.హెచ్.ఎస్. ఆలూరు మండలం జడ్చర్ల విద్యార్థి ఎస్.కారుణ్య రచించింది. నిజాలాపూర్ విద్యార్థిని పి. భవిత రాసిన కథలో చెరువుల ఆవశ్యకత, పర్యావరణ పరిరక్షణను తెలియజేస్తుంది. పెద్దవాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళవద్దు అనే విషయాన్ని తెలియజేస్తూ అడవిలో జరిగిన అనుభవం కథను పి.ఎస్ కొండేడు మండలం జడ్చర్ల విద్యార్థి శ్రీకాంత్ రచించాడు. చెరువు కలుషితం చేయవద్దు, ఊరిని పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత అందరిదనే విషయాన్ని తెలియజేస్తూ యు.పి.ఎస్. అమిస్తాపూర్ మండలం భూత్పూర్ విద్యార్థి పి.భవ్యశ్రీ మంచి ప్రయత్నం అనే కథలో తెలియజేస్తుంది. మొక్కై వంగనిది మ్రానై వంగునా అంటూ ఎం.దామిని శ్రీ ఎం.పి.పి.ఎస్. ఎనుగొండ విద్యార్థి, నీతి నిజాయితీ మహిమను తెలుపుతూ పి. సౌమ్య జడ్పీ.హెచ్.ఎస్. టి.డి గుట్ట, మంచిపని చేస్తే కలిగే ఆనందాన్ని గురించి కె నవ్యశ్రీ ఎం.పి.పి.ఎస్. చౌడూరు నవాబుపేట, ఐకమత్యమే బలమని మినీ గురుకులం జడ్చర్ల విద్యార్థి పి.లక్ష్మి, పట్టుదల నమ్మకం ఉంటే సాధించలేనిది లేదంటూ యాస్మిన్ బేగం ఎం.పి.పి.ఎస్ దేవరకద్ర విద్యార్థి రచించారు.

చిన్న వయసులోనే చక్కటి కథలు..

స్నేహబంధాన్ని, నీతి నిజాయితీలను నైతిక విలువలను తెలిపే కథలు, కుటుంబం, భూత దయ, ఆరోగ్యానికి సంబంధించినవి, పర్యావరణం మొదలైన నైతిక, మానవీయ విలువలను తెలిపే కథలను తమ కథా వస్తువులుగా తీసుకొని తమ సొంత అనుభవాలను, జోడించి రాయడం విశేషం. ప్రతి కథలో చక్కని సందేశాన్ని అందిస్తూ తమదైన శైలిలో అద్భుతంగా కథలను రచించారు. ఇంత చిన్నవయసులో ఇంత చక్కటి కథలు రాశారంటే ఆశ్చర్యపోతాం. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న అనేకమంది చిన్నారులు కూడా అద్భుతమైన కథలను రాయడం విశేషం. ఇందులో ఐదు ఆంగ్ల కథలను కూడా చిన్నారులు రాయడం మరో విశేషం.

రాబోయే తరానికి మార్గదర్శక కథలు..

చిన్నారుల ఊహ ప్రపంచం నుండి జాలువారిన కథలు రాబోయే తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. పాఠశాలలో చదువుకునే వయసులోనే చక్కటి సందేశాన్ని అందించే కథలు రాసిన చిన్నారులకు శుభాశీస్సులు. బడి పిల్లల చేత కథలను రాయిస్తున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు శుభాభినందనలు. ఈ పుస్తకాన్ని మహబూబ్ నగర్ జిల్లా విద్యాశాఖ ప్రచురించగా, ఈ కథలు పుస్తక రూపంలోకి తీసుకురావడానికి పాలమూరు ఎన్.ఆర్.ఐ ఫోరం ఆర్థిక సహకారం అందించింది. ఇంత చక్కటి కథల పుస్తకాన్ని వెలువరించిన జిల్లా విద్యా శాఖకు అభినందనలు.

పుస్తకం: మహబూబ్ నగర్ జిల్లా బడిపిల్లల కథలు

సంపాదకులు: డా. భీంపల్లి శ్రీకాంత్

ప్రచురణ: జిల్లా విద్యాశాఖ, మహబూబ్ నగర్

పేజీలు 105; వెల: అమూల్యం

ప్రతులకు: జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం,

సమీక్షకురాలు

- పులి జమున

85001 69682

Next Story