సమీక్ష :ఊరించే పకోడి పొట్లం

by Disha edit |
సమీక్ష :ఊరించే పకోడి పొట్లం
X

విందు భోజనం కన్నా నోరారా లాగించి తినే చిరు తిండి బాగుంటుంది. వాన పడుతున్నపుడో, చల్లటి వాతావరణం ఉన్న సాయంకాలమో వేడి వేడి పకోడీలు తింటే ఆ అనుభూతి చెప్పలేనిది. అలాంటి వేడి పకోడీ తిన్నట్టుగా 60 కార్డు కథలను 'పకోడీ పొట్లo' లో పొందుపరిచారు ఆర్‌సీ కృష్ణస్వామి రాజు. ఇవి చిన్న కథలు. 1982 నుండి వివిధ పత్రికలలో ప్రచురితమైనవి. అందుకే పాత వాసనతో కొత్త సొబగులు ఇందులో చూస్తాం. రాజుల కాలం నాటి కథలు ఈనాటి సామాజిక నేటివిటీనీ మనకు చూపుతాయి. నేటి రాజకీయాలు, పాలనను కూడా ఈ కథలు ప్రతిబింబిస్తాయని పాఠకులకు అనిపిస్తుంది.

ఏదైనా మితంగా చేయాలి. అతి చేయకూడదు. ఉత్సాహం ఉండాలి కానీ అత్యుత్సాహం పనికిరాదు. అతి వద్దు, మితం వద్దు అని చక్కటి నీతిని 'కోడికూత' కథలో అందించారు. ప్రయత్నలోపం ఉండకూడదని 'ప్రయత్నం' కథలో తెలియజేశారు. అవసరమైన మేరకు ఆలోచించి, చేయాల్సిన పనులు చేసుకుంటూ పోతే అంతకు మించిన సౌఖ్యం లేదు. ఇంకా ఏ ఆలోచన లేనివాడు ఆనందంగా ఉంటాడని 'వెతుకులాట' కథలో వివరించారు. పశుపక్ష్యాదులు నివసించే అడవులను నరికేసి పట్టణీకరణ వైపు నడుస్తున్నాం. నగరాలు నిర్మిస్తున్నాం. వాటికి ఆశ్రయం లేకుండా చేస్తున్నాం. మనం బతుకుతూ వాటిని బతికించాలి అనే చక్కటి సందేశాన్ని 'ఆవు ఆకలి' కథలో సూటిగా చెప్పారు. పర్యవేక్షణ లేకపోతే, ఎలాంటి ప్రణాళికలు లేకుంటే మట్టి కొట్టుకు పోవడం ఖాయమని 'యథారాజా తథా ప్రజ'లో వివరించారు.ఎవరైనా స్వధర్మం మానుకొని పర ధర్మo చేయలేరు కదా అనే విషయాన్ని 'రాజు-సేవకులు' కథలో స్పష్టం చేశారు. ఇలా కృష్ణస్వామి రాజు కథలు చదువుతుంటే వేడి వేడి పకోడీ తిన్నట్టుగానే ఉంటుంది. ఇలాంటి కథలు వారు మరెన్నో రాయాలని కోరుకుంటూ వారికి అభినందనలు.

ప్రతులకు:

ఆర్‌సీ కృష్ణస్వామి రాజు

22-4-71 బ్యాంక్ ఎంప్లాయీస్ కాలనీ

మంగళం రోడ్డు, తిరుపతి- 517501

93936 62821

పేజీలు 111, ధర రూ.120


సమీక్షకులు:

యాడవరం చంద్రకాంత్ గౌడ్

సిద్దిపేట, 94417 62105

Next Story