సమీక్ష:సామాజిక సింధువులో ఎగిసిన సముద్ర కెరటం

by Disha edit |
సమీక్ష:సామాజిక సింధువులో ఎగిసిన సముద్ర కెరటం
X

విత్వం స్వానుభవ, సామాజిక భావనల కలబోతగా సాగటం సర్వసాధారణం, ఏ కవి అయినా తను చూసిన, అనుభవించిన, ఊహించిన విషయ బాధల సమ్మేళనాన్ని జీర్ణించుకుని తద్వారా తనలో కలిగిన భావావేశ మేఘాలను కవితవానగ వర్షించడం కవన నేపథ్యం. అయితే భావావేశాల స్థాయి భావాలను బట్టి అది చిరుజల్లులు కావచ్చు, భారీ వానల తుఫాను అయిపోవచ్చు. అది ఆయా కవి మానసిక హృదయావిష్కరణ బట్టి ఉంటుంది. అచ్చంగా అలాంటి నేపథ్యంతో వెలువడిందే వర్థమాన కవి 'సముద్రాల కుమారస్వామి' లేఖిని నుంచి వెలువడిన తొలి వచన కవితా సంపుటి 'సముద్ర కెరటం' సౌమ్యుడు మధుర భాషణాపరుడు అయిన కుమారస్వామి తన భావావేశాల మేలుకలయికను చక్కని శైలిలో తీర్చిదిద్దారు. 'వెలుగు భాష' నుంచి మొదలుపెట్టి 'అనురాగాల తొవ్వ' వరకు మొత్తం 38 తంతెల మీదుగా సాగిన ఈ 'సముద్ర కెరటం' ప్రస్థానంలో ప్రతి కవితా కవి జీవిత తత్వానికి అద్దం పడుతుంది.

భాషకు తగినట్టుగా

కుమారస్వామి మాతృభాష, వృత్తి భాష, కూడా తెలుగే. అందుకే, తన కవిత్వంలో 'వెలుగు భాష' అంటూ కవితా సంపుటి శ్రీకారం చుట్టుకున్నారు. విద్యాలయాలను, గ్రంథాలయాలను, దేవాలయాలతో పోల్చడం ద్వారా ఈ అధ్యాపక కవి ఆదర్శం ఎంతటిదో అర్థమవుతుంది. మనిషి చదువు అనే జ్ఞాననేత్రం ద్వారా త్రినేత్రుడై విశ్వవ్యాప్తం కావాలి కానీ, కుటిల 'కులం గుంపులు'తో కునారిల్లడం దేనికంటూ ధర్మాగ్రహం ప్రదర్శించారు. 'మేధావులంతా యమునా తీరే / నయా మేధావులంతా/ కొత్త గుంపులు కడుతుంటే, మరో పక్క కులమతాల కాలుష్యంతో / నవ సమాజ నిర్మాణానికి ఆయువు/అంతం చేస్తున్నారు/విశ్వ చదువులు చదివిన ఓమనిషి!?/నీ చూపు నేల వైపు కాదు/ఆకాశమంత విశాల వైపు' అంటారు కవి.

రైతుకు పొలానికి గల సాన్నిహిత్యాన్ని తల్లీబిడ్డల సంబంధంగా చెబుతూ కర్షక శ్రామికులు గత కాలం నుంచి నేటి కాలానికి ఎలా మారిపోయారో కళ్లకు కట్టారు. అక్కడ కష్టాలు మాట్లాడుకుంటున్నాయి / బాధల బరువులను / ఎద నుంచి దింపుకుంటున్నాయి / గాయపడిన గుండెలు / గగ్గోలు పెడుతున్నాయి. వ్యదార్థ జీవితాన్ని / వెనక్కి తిరిగేసుకుంటే /తన బతుకంతా పొలమే / సాగరం ఆవరించినట్టు ఎవరూ దయచూపని మనిషిలా / అనాధలా.. అనామకంగా / ఒంటరిగా పడి ఉంది పొలం' అంటూ కష్టాలను ఆవిష్కరించారు. మగువలపై జరుగుతున్న దాడులపై కూడా తన కవనాంకుశం ప్రయోగించారు. పల్లెసీమల అందాలు, అపురూప బాల్యపు తాలూకు సొగసులు, ఐస్ క్రీమ్ బండి ముచ్చట్లు, ఎంచక్కా కవిత్వీకరించారు. ఈ కవితా సంపుటిని తన తండ్రి స్వర్గీయ ఓదెలుకు అంకితమిచ్చారు. కవితా సంపుటికి డా. అనుమాండ్ల భూమయ్య, డా. బన్న అయిలయ్య, అంపశయ్య నవీన్‌తోపాటు కవి సహ విద్యార్థి డా. పసునూరి రవీందర్ అందించిన ఆప్త వాక్యాలు దీని విలువను మరింత పెంచాయి. ఈ కమ్మని కవితా సంపుటి వర్ధమాన కవులకు చక్కని ఆదర్శంగా నిలుస్తుంది.

ప్రతులకు:

సముద్రాల కుమారస్వామి

97054 76138

పేజీలు: 105, ధర. రూ.100

సమీక్షకులు:

డా: అమ్మిన శ్రీనివాస రాజు

77298 83223

Next Story

Most Viewed