కథా-సంవేదన:కాల మహిమ

by Disha edit |
కథా-సంవేదన:కాల మహిమ
X

పట్టణానికి దూరంగా ఉండే గెస్ట్‌ హౌస్ పట్టణం మధ్యలోకి వచ్చేసింది. చుట్టూ పెద్ద కాంపౌండ్. ఇరవై దాకా వాహనాలు ఆగడానికి వీలుగా ఉన్న స్థలం. బాగా ఎత్తుగా పెరిగిన అశోక వృక్షాలు. పోర్టికో దగ్గర జనాల సందడి. అప్పుడే కారు నుంచి జిల్లా జడ్జి దిగి లోపలికి వెళ్లారు. ఆయన వెనకే అదనపు జిల్లా న్యాయమూర్తి కూడా వెళ్లారు. ఇద్దరూ అక్కడ ఉన్న ఒక సూట్‌లో కూర్చున్నారు. జిల్లా కోర్టులోని ఇతర న్యాయమూర్తులు ఐదుగురు వెయిటింగ్ హాల్‌లో కూర్చున్నారు. స్టాఫంతా అరేంజ్‌మెంట్స్ చూడటంలో నిమగ్నమై ఉన్నారు. ఆరోజు ఆ జిల్లా ఇన్‌చార్జ్ హైకోర్టు న్యాయమూర్తి జిల్లా కోర్టులను ఇన్‌స్పెక్షన్ చేయడానికి వస్తున్నారు. ఇన్స్‌పెక్ట్ చేసేది జిల్లా కోర్టు మాత్రమే. హెడ్ క్వార్టర్‌లో ఉన్న ఏ కోర్టుని అయినా ఆయన ఇన్స్‌పెక్ట్ చేయవచ్చు. ఆ తరువాత జిల్లాలో ఉన్న న్యాయమూర్తులతో సమావేశం. అందుకని అందరూ రెడీగా ఉన్నారు.

హైదరాబాద్ నుంచి ఆ జిల్లా హెడ్ క్వార్టర్‌కు రావడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. జడ్జిగారు ఉదయం ఏడు గంటలకి హైదరాబాదులో బయలుదేరారు. 9:30 ప్రాంతంలో గెస్ట్‌ హౌస్‌కు వచ్చే అవకాశం ఉంది. అందుకే అక్కడ బ్రేక్‌ఫాస్ట్ అరేంజ్ చేశారు. ఉదయం 9 అవుతుంది. అది మొబైల్ ఫోన్లు లేని కాలం. మరో 40 నిమిషాలలో హైకోర్టు జడ్జి వచ్చే అవకాశం ఉంది. అంతా హడావుడిగా వుంది. జిల్లా జడ్జి కూడా హడావుడిగా ఉన్నారు. అదనపు జిల్లా జడ్జితో, స్టాఫ్‌తో మాట్లాడుతూ కూర్చున్నారు. అందరూ ఇక్కడే రిసీవ్ చేసుకోవడం కన్నా ఓ న్యాయమూర్తి ఐదు కిలోమీటర్ల దూరం నుంచి రిసీవ్ చేసుకుంటే బాగుంటుందని ఎవరో జిల్లా జడ్జితో అన్నారు. ఆయనకి ఆ మాట బాగా నచ్చింది. ముందే ఆ సలహా ఇస్తే బాగుండేదనుకున్నారు. లోకల్ మేజిస్ట్రేట్‌ని పంపిస్తే బాగుంటుందనే ప్రస్తావన వచ్చింది.వెంటనే అటెండర్ ద్వారా లోకల్ మేజిస్ట్రేట్‌కి కబురు పెట్టారు జిల్లా జడ్జి. తనని ఎందుకు పిలిచారో ఆయనకు అర్థం కాలేదు. వెంటనే లేచి కోటు సవరించుకుంటూ జిల్లా జడ్జి కూర్చున్న గదిలోకి వెళ్లారు.

జిల్లా జడ్జి ఎదురుగా నిల్చున్నారు. 'మేజిస్ట్రేట్‌గారూ, మీరు ఓ జీప్ తీసుకొని అయిదు కిలోమీటర్ల దూరంలో, అదే అక్కడ ఉన్న బ్రిడ్జి దగ్గర ఉండి హైకోర్టు జడ్జిగారిని రిసీవ్ చేసుకుని తీసుకుని రావాలి' అన్నారు జిల్లా జడ్జి. ఏం జవాబు చెప్పాలో ఆ మేజిస్ట్రేట్‌కి వెంటనే అర్థం కాలేదు. కొంచెం ఆలోచించి, ఆశ్చర్యం నుంచి తేరుకొని 'పోలీస్ ఎస్కార్ట్ ఉంది కదా సార్' అన్నాడు మెల్లిగా. మేజిస్ట్రేట్ తనకు జవాబు చెప్పడం జిల్లా జడ్జికి నచ్చలేదు. 'అది నాకు తెలియదా? నేను చెప్పినట్టుగా మీరు చెయ్యండి' అన్నాడు కాస్త కఠినంగా.

ఆ క్షణంలో ఆ మేజిస్ట్రేట్‌కి ఎన్నో సంగతులు గుర్తుకొచ్చాయి. తమ ఇండ్లలో జరిగే పెళ్లిళ్లు గుర్తుకొచ్చాయి. తన అక్క పెళ్లిలో బావని తీసుకుని రావడానికి వెళ్లిన తన మేనమామ గుర్తుకొచ్చాడు. గ్రామాలలో గతంలో ఉండే సుంకరి వ్యవస్థ కూడా గుర్తుకొచ్చింది. ఊరికి తహసీల్దార్ వస్తున్నాడంటే, దొరలు బండి ముందు పరిగెత్తడానికి సుంకరులని ఊరి బయటకు పంపించేవారు. సుంకరి గుర్తుకొచ్చాడు అతనికి.

ఆలోచనలో పడ్డారు మేజిస్ట్రేట్. 'సార్, నేను మేజిస్ట్రేట్‌ని. సుంకరిని కాదు. అలా రోడ్డు మీద నిల్చుని తీసుకొని రావడం బాగుండదు. అది నాకు నచ్చదు. మీ అందరితో పాటు జడ్జిగారిని ఈ గెస్ట్ హౌస్ దగ్గర రిసీవ్ చేసుకుంటాను' అన్నాడు. అతని జవాబు మెల్లిగానే ఉంది. కానీ స్థిరంగా ఉంది.

ఆ జవాబుతో జిల్లా జడ్జి షాక్కు గురయ్యారు. అదనపు జిల్లా జడ్జికి ఏం మాట్లాడాలో తోచలేదు. జిల్లా కోర్టు అధికారి నిరుత్తరుడయ్యారు. ఏం మాట్లాడితే ఏం జవాబు వస్తుందోనని ఆలోచనలో పడ్డారు జిల్లా జడ్జి. గతంలో ఎవరూ ఇలా జవాబు చెప్పలేదు. ఎవరూ ఇలాంటి జవాబుని ఊహించలేదు. ఆ జవాబు జిల్లా జడ్జికి నచ్చలేదు. మరీ ముఖ్యంగా అందరి ముందు జవాబు చెప్పడంతో అతని అహం దెబ్బతిన్నది. ముఖ కవళికలు మారిపోయాయి. ఇవన్నీ గమనించిన అదనపు జిల్లా జడ్జి 'మీరు బయట ఉండండి' అన్నారు మేజిస్ట్రేట్‌తో. ఆయన ఏమీ మాట్లాడకుండా బయటకు వచ్చి హాల్‌లో కూర్చున్నారు. తను చేసింది సరైందేనా అని ఆలోచించారు. తన జవాబులో తప్పేమీ లేదని మనస్సాక్షి చెప్పింది. నిజమే! తాను సుంకరిని కాదు కదా? అనుకున్నారు. ఐదు నిమిషాల తర్వాత మేజిస్ట్రేట్‌కి జిల్లా జడ్జి నుంచి పిలుపు వచ్చింది.

@@@@

25 సంవత్సరాలు గడిచిపోయాయి. కాలం మారిపోయింది. పెద్దపెద్దవాళ్లు వస్తున్నారు. ఎయిర్‌పోర్టులో ఎదుర్కోళ్లు జరుగుతూనే ఉన్నాయి. రెండు, మూడు రాష్ట్రాల నుంచి ఎదుర్కోళ్లు జరుగుతున్నాయి .

ప్రేమ ప్రవహిస్తున్నది. ఇది కాలమహిమా? ఏమో!?


మంగారి రాజేందర్ జింబో

94404 83001


Next Story

Most Viewed