ఒక జ్ఞాపిక

by  |

హేమాంగినీ!
మొక్కలకు నువ్వు
నీళ్లు పోస్తున్నప్పుడు
శకుంతలలా కనిపించేదానివి
అంతర్జాల పాఠాలు
అవలీలగా బోధిస్తున్నప్పుడు
అమ్మ సావిత్రిబాయి పూలేలా అనిపించేదానివి
ఎవరైనా నిస్సహాయులు
నీ దగ్గరికి వచ్చినప్పుడు
నిలువెత్తు ఆసరాగా నిలిచే దానివి
నీ నవ్వు ముఖంలో
ఎప్పుడో తప్ప
విచార చారిక కనిపించలేదు
చెల్లెళ్ళ పిల్లలంతా
పెద్దీ పెద్దీ అంటూ
నీ పొట్ట మీద ఆడుకుంటున్నప్పుడు
అమ్మలగన్న అమ్మలా ఉండే దానివి
కూతుర్లని కుందనపు బొమ్మల్లా
గాల్లో ఎగరేసి ఆడిస్తున్నప్పుడు
రెండు చందమామలు
నీ నిండు కళ్ళల్లో
తళతళామెరుస్తూండేవి
నీ స్వప్న లోకమంతా
ధారణ యంత్రం చుట్టూ
విహంగంలా విహరిస్తూవుoటే
ఈ విశ్వమంతా విస్తుపోయి
నీ పరిజ్ఞానం ముందు
ప్రణమిల్లుతున్నట్లుoడేది
ఇంకొంత కాలం
నీ ఊపిరితిత్తులకు
అమృతాయువు లభించి వుంటే
ఈ ప్రపంచానికి
నిరక్షర స్త్రీ లోకానికి
మరింత బలం చేకూరేది
కంప్యూటర్ ఫలం దక్కేది
ఉత్తమోపాధ్యాయినీ
ఓ అంతర్జాల కళాలోచనీ
నువ్వు బతికిన క్షణాలు
చరిత్రలో చిరస్మరణీయ దినాలు

-ఎండ్లూరి సుధాకర్
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం
8500192771

Next Story