సున్నపు రాయి గ ‘లీజు’ దోపిడీ

by  |
సున్నపు రాయి గ ‘లీజు’ దోపిడీ
X

దిశ, రంగారెడ్డి: తెలంగాణలో తాండూరు పప్పు ఎంత ఫేమస్సో సున్నపు రాయి కూడా అంతే. సిమెంట్ తయారీలో ఉపయోగించే ఈ సున్నపురాయి నిక్షేపాలు తెలుగురాష్ట్రాల్లో దొరకడం చాలా అరుదు. అలాంటి సున్నపురాయి రంగారెడ్డి జిల్లా తాండూరులో లభ్యం అవుతుంది. దాదాపు 3 వేల ఎకరాల్లో విస్తరించిన సున్నపురాయిని అధికారుల అండతో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన లీజు గడువు ఎప్పుడో ముగిసినా కొందరు యథేచ్ఛగా ఏళ్లుగా దందా సాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి.

భవన నిర్మాణాల్లో ఎక్కువగా వాడే సిమెంట్ తయారీలో ముడి సరుకుగా సున్నపురాయి కీలకం. ఇది తాండూరు, బషీరాబాద్ మండలాల్లో అధికంగా విస్తరించి ఉండటంతో మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నారు. తాండూర్ మండలంలోని ఓగిపూర్, కరణ్కోట, మల్కాపూర్, సంగెం కలాన్, కటబాసుపల్లి, గుంత బానుపల్లి, మిట్టబానుపల్లి, సరిగిరి పేట, జనుగుర్తితో పాటు బషీరాబాద్ మండలంలోని ఎక్కాయి, నవల్గా, జీవన్గి, కార్విచెడ్, మాసన్‌పల్లి గ్రామాల పరిధిలో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎర్రమట్టి, సుద్ద గనుల తవ్వకాల పైనే ఎక్కువ దృష్టి పెట్టి మిగిలిన నిక్షేపాలపై మైనింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం వికారాబాద్ జిల్లాలో మైనింగ్‌కు సంబంధించి 100 లీజులే ఉన్నాయని, 6నెలల క్రితమే 55లీజులు ఇచ్చామని చెబుతున్నారు. పర్యావరణ అనుమతి లేనిది లీజులు ఇవ్వడం లేదని, ఇంకా 300లకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారు.

రాయల్టీలు లేకుండానే రవాణా.. ?

కొంతమంది సమయం ముగిసినా లీజులను కొనసాగిస్తూ రాయల్టీలు లేకుండానే రవాణా చేయడం అలవాటుగా మారిపోయింది. తాండూర్, బషీరాబాద్ మండలాలల పరిధిలోని మైనింగ్ యజమానులే కాకుండా కర్ణాటక సరిహద్దులోని మైనింగ్ వ్యాపారులు అలాగే కొనసాగిస్తుండటంతో సుమారుగా ఏడాదికి రూ.30కోట్లకు పైగా ఆదాయానికి గండీ పడుతుంది. మైనింగ్ వ్యాపారులు ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కు కావడంతోనే అక్రమంగా గనులు తవ్వకాలు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

లక్ష్యం దాటడం లేదు..

తాండూర్ మైనింగ్ శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ నిర్ధేశించింది. 2018-19లో రూ.94.95 కోట్ల ఆదాయం టార్గెట్ ఇస్తే రూ.83.57 కోట్లు మాత్రమే సాధించారు. 2019 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ.65 కోట్లు సాధించినట్లు అధికారులు చెబుతున్నారు. అక్రమాలు అరికడితే ఏటా రూ.115 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. అంటే ప్రతి ఏడాది సుమారుగా రూ.25కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.

Tags: Limestone, Rangareddy, Tandoor, Basheerabad, Telangana



Next Story