విద్యుత్ అవసరం లేని ఏసీ! ఆరుబయట కూడా పెట్టుకునే అవకాశం!

by Disha Web Desk 7 |
విద్యుత్ అవసరం లేని ఏసీ! ఆరుబయట కూడా పెట్టుకునే అవకాశం!
X

దిశ, ఫీచర్స్ : వేసవి వచ్చిందంటే.. పట్ణణ ప్రజలైనా, పల్లెవాసులైనా ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు. కానీ ఏసీ వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడటంతో పాటు బోలెడంత కరెంట్ బిల్లు కూడా వస్తుంది. ఈ ఇబ్బందులున్నప్పుడు ఎక్కడపడితే అక్కడ పెట్టుకునే వీలుందా అంటే అదీ లేదు. కేవలం క్లోజ్‌డ్ సర్ఫేస్‌లో.. గదిలో మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా విద్యుత్ అవసరమే లేకుండా, ఎంచక్కా ఆరుబయట ఏసీ పెట్టుకుని కూల్ కూల్‌గా గడిపేందుకు ఇజ్రాయెల్‌ కంపెనీ 'గ్రీన్ కినోకో'.. 'కెన్షో' పేరుతో వినూత్న ఏసీని డెవలప్ చేసింది. ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తిగా మార్కెట్లోకి రాబోతున్న ఈ ఏసీ విశేషాలు మీకోసం!


లిక్విడ్ నైట్రోజన్ ఆధారంగా పనిచేసే ఏసీలోని ప్రామాణిక ట్యాంకులు ద్రవ నత్రజనిని -196 °C (-321 °F) వద్ద ఫ్రీజ్ చేసి, ఏసీని ఆన్ చేయగానే ద్రవం నెమ్మదిగా కూలర్‌లలోకి లోడ్ అవుతుంది. అప్పుడది వాయువుగా మారిన క్షణంలో దాదాపు 700 రెట్లు వేగంగా విస్తరిస్తుంది. కూలర్లు ఆ ద్రవపరిమాణాన్ని -10 °C (14 °F) ఉష్ణోగ్రతతో బయటకు పంపడంతో ఆ పరిసర ప్రాంతం చల్లబడుతుంది. ఇక దీనివల్ల ఎలాంటి గ్రీన్ హౌజ్ ఉద్గారాలు వెలవడకపోగా.. క్లీన్ అవుట్‌డోర్ కూలింగ్ సిస్టమ్‌గా కూడా పనిచేస్తోంది. ఔట్‌డోర్ హీటర్‌తో సమానమైన మోడల్‌లో పనిచేసే AC యూనిట్‌లకు ప్రత్యామ్నాయంగా వీటిని రూపొందించగా.. బయట ఉన్న వేడి, పరిసరాల ఆధారంగా లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకులను ప్రతీ 7-10 రోజులకు మార్చవలసి ఉంటుంది.

సాధారణంగా, నైట్రోజన్ ట్యాంక్‌ ధర దాదాపు రూ. 4000 (€50-60) ఉంటుంది. ఏసీని టెస్ట్ చేసేందుకు గ్రీన్ కినోకో వచ్చే నెల రెండో వారంలో టెల్ అవీవ్‌లోని అతిపెద్ద కేఫ్‌లలో పైలట్‌ ప్రాజెక్ట్ అమలు చేయబోతోంది. ట్రయల్ రన్ తర్వాత ఫలితాలను వెల్లడిస్తానని కంపెనీ పేర్కొంది. ఇక ఇది పర్యావరణహితమే అయినా.. లిక్విడ్ నైట్రోజన్‌లోని విపరీతమైన చల్లదనం వల్ల శరీరానికి గాయాలయ్యే అవకాశం లేకపోలేదు. దీన్ని సరిగ్గా నిర్వహించకపోతే ఊపిరాడకుండా చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా రన్ చేయాల్సి ఉంటుంది.

మేము విద్యుత్ అవసరం లేని బయటి ఎయిర్ కండీషనర్‌ను కనుగొన్నాము. ఇది దాని సొంత శక్తిని సృష్టిస్తుంది. ద్రవ నత్రజని అనేక పరిశ్రమలలో శీతలకరణిగా విస్తృతంగా ఉపయోగించబడుతుంది, అయితే మా బృందం బయటి గాలిని చల్లబరచేందుకు కొత్త సాంకేతికతో వచ్చింది. ద్రవ నత్రజని, గ్యాస్ నైట్రోజన్ మధ్య ఏర్పడే పీడనం నుంచి మేము శక్తిని సృష్టిస్తాం. ఈ మేరకు మేము మైనస్ 196 డిగ్రీల వద్ద ద్రవ నైట్రోజన్‌ని ఉపయోగిస్తాం. అప్పుడది వాయువుగా మారినప్పుడు చాలా బలమైన ఒత్తిడిని సృష్టిస్తుంది. దీంతో మెకానికల్ ఇంజిన్‌ను యాక్టివ్ చేసేందుకు మేము ఆ ఒత్తిడిని ఉపయోగిస్తాము. ఈ ఏసీని అభివృద్ధి చేసేందుకు రెండేళ్లు పట్టింది. కాగా పైలట్ ట్రయల్స్‌ కోసం కంపెనీ 12 నమూనా యూనిట్లను నిర్మించింది. ఇప్పటికే 40 దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. కానీ 2023 చివరి వరకు మార్కెట్‌‌లోకి విడుదల చేస్తాం. మా ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు పెట్టుబడి కోసం చూస్తున్నాము

- మోరన్ గోల్డ్‌బెర్గ్, గ్రీన్ కినోకో సీఈవో

Next Story

Most Viewed