Mental health : ప్రతికూల ఆలోచనలు వేధిస్తున్నాయా? .. ఈ మూడ్ చేంజింగ్ టెక్నిక్స్ పాటిస్తే చాలు !

by Dishafeatures2 |
Mental health : ప్రతికూల ఆలోచనలు వేధిస్తున్నాయా? .. ఈ మూడ్ చేంజింగ్ టెక్నిక్స్ పాటిస్తే చాలు !
X

దిశ, ఫీచర్స్ : రోజూ వ్యాయామం చేయడం, హెల్తీ ఫుడ్ తీసుకోవడం వంటివి మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. కానీ జీవితంలో ఎక్కవ భాగం మీ మూడ్ బాగుండాలంటే, ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉండాలంటే కేవలం ఇవి మాత్రమే సరిపోవు. మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉండటానికి రోజువారి జీవితంలో పాటించాల్సిన ఇతర అంశాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేమిటో చూద్దాం.

ఆలోచలను పేపర్‌పై రాయండి

రోజువారి జీవితంలో అలసిపోతుంటారు. ఒక్కోసారి మూడ్ బాగోలేక ఏ పనీ చేయాలని పించదు. కానీ మైండ్‌లో ఏవేవో ఆలోచనలు మెదులుతుంటాయి. ఇలాంటప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రతి కూల ఆలోచనలను డైవర్ట్ చేయడానికి ఒక చక్కటి మార్గం ఉంది. ఏంటంటే.. వ్యతిరేక ఆలోచనలు పోవాలంటే, మిమ్మల్ని ఉత్సాహపరిచే ఆలోచనలేవో గుర్తించి ఒక పేపర్‌పై రాస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో కొద్ది క్షణాల్లోనే ప్రతికూల ఆలోచనలు తగ్గి, సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. వ్యాధి రోధక శక్తి, జ్ఞాపశక్తి పెరుగుతాయి.

సెల్ ఫోన్‌ను దూరం పెట్టండి

అవసరం అయినప్పుడు వాడక తప్పదు. కానీ అవసరంతో నిమిత్తం లేకుండా ప్రతీ క్షణం స్మార్ట్‌ఫోన్‌లో మునిగిపోవడంవల్ల మానసిక స్థితిపై, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ అలవాటు మీ నిద్రను, ప్రొడక్టివిటీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మీరు సంతోషంగా ఉండాలంటే మితంగా వాడండి. చాలా వరకు దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి. రోజూ ఒక గంటసేపు మాత్రమే స్మార్ట్ ఫోన్ వాడేవారు తక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారని జర్మనీలో జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.

ఇంటిలో మొక్కలు ఉంచుకోండి

ఇంటిలో పెంచుకొనే మొక్కలు కూడా మానసిక స్థితిని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అవి అదంగా కనిపించడమే కాకుండా ఎయిర్ క్వాలిటీని పెంచుతాయి. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, అనుభూతిని క్రియేట్ చేస్తాయి. ఆ సందర్భంలో సంతోషంగా ఫీలవడం కారణంగా మెదడులోని నరాలు ప్రేరేపితమై జ్ఞాపక శక్తి పెరుగుదలకు దోహదపడతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆఫీసు పరిసరాల్లోని మొక్కలు తొలగించినప్పుడు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్‌లో స్ట్రెస్ లెవల్స్ పెరిగాయని, వర్క్‌పై శ్రద్ధ తగ్గినట్లు గత అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీనిని బట్టి మొక్కలు ఎంత మేలు చేస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు.

పాటలు లేదా మ్యూజిక్ వినడం

స్నానం చేస్తూ పాటలు పాడటం, జర్నీలో ఇష్టమైన సాంగ్స్ వినడం వంటివి మీకు సంతోషాన్ని కలిగించే అంశాలైతే.. అవి కూడా మీలో మానసిక స్థితిని మెరుగు పరుస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ సందర్భంలో మెదడు, శరీరం నుంచి విడుదలయ్యే రసాయనాలు మీలో ఉత్సాహాన్ని నింపేలా ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు పాటలు విన్నప్పుడో, పాడినప్పుడో రిలీజ్ అయ్యే ఎండార్ఫిన్, డొపమైన్, సెరటోనిన్, ఆక్సిటోసిన్ వంటివి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి.

కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి

మనసు బాగోలేనప్పుడు ఏ పనిచేసినా మరింత మానసిక ఒత్తిడికి గురవుతారు. కాబట్టి ముందు మీలోని ప్రతికూల మానసిక స్థితిని పోగొట్టుకోవాలి. ఏదో ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించడంవల్ల కూడా ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న కొత్త అంశాన్ని నేర్చుకోవడంపై మనసు కేంద్రీకరించడంవల్ల మెదడు సానుకూల ఆలోచనలను మాత్రమే ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తుంది. ప్రతికూల ఆలోచనలను దూరం అయి, హ్యాపీనెస్ పెరుగుతుంది. అంతేకాకుండా ఇతరులకు సాయం చేయడం, కృతజ్ఞతా భావంతో మెలగడం, థ్యాంక్స్ చెప్పడం, ఆత్మీయులు, స్నేహితులతో సరదాగా మాట్లాడటం ఇలా ఆనందాన్ని కలిగించే ఏ పనైనా మీ మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది.


Next Story

Most Viewed