బెగ్గింగ్ టు బిజినెస్.. సంకల్పంతో సాధించిన భిక్షగత్తె 

by Web Desk |
బెగ్గింగ్ టు బిజినెస్.. సంకల్పంతో సాధించిన భిక్షగత్తె 
X

దిశ, ఫీచర్స్ : 'పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు.. కానీ పేదవాడిగానే చనిపోవడం మాత్రం ముమ్మాటికీ నీ తప్పే'. నా కర్మ ఇంతే! అని ప్రస్తుత స్థితినే తలచుకుంటూ నిట్టూరిస్తే.. జీవితంలో ఎప్పటికీ ఎదగలేమన్నది సత్యం. కృషి, పట్టుదలతో శ్రమిస్తే తప్పక విజయం వరిస్తుందని ఎంతోమంది నిరూపించారు. అలాంటి కోవకు చెందిన అమ్మాయే జ్యోతి. చిన్నతనంలోనే బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లో వదిలివేయబడి, బాల్యమంతా భిక్షాటనతోనే గడిపింది. కానీ ఆమె కలలు అక్కడితోనే ఆగిపోలేదు. దృఢ సంకల్పంతో ఒక్కో మెట్టు ఎదిగిన జ్యోతి.. ప్రస్తుతం అదే నగరంలో ఓ కేఫ్ నడుపుతూ పలువురికి స్ఫూర్తినిస్తోంది.

పంతొమ్మిదేళ్ల జ్యోతికి ఇప్పటి వరకు అసలు తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు. రైల్వే స్టేషన్‌లో దొరికిన తనను బిచ్చగాళ్లైన దంపతులు చేరదీసారు. బాల్యంలో గడ్డు పరిస్థితులను అనుభవించినప్పటికీ చాలా మంది సమరిటన్ల సహాయంతో జీవితంలో ముందుకు సాగింది. బాల్యంలో తనను దత్తత తీసుకున్న బెగ్గర్ కపుల్స్‌తో కలిసి భిక్షాటన, చెత్త సేకరణ పనులకు వెళ్లేదాన్నని చెప్పింది. చదువుకోవాలనే కోరిక బలంగా ఉన్నప్పటికీ భిక్షాటనతోనే చైల్డ్‌హుడ్ గడిచిపోయింది. కానీ చదువుకోవాలనే కోరిక మాత్రం ఆమె స్ఫూర్తిని అడ్డుకోలేదు.

ఈ క్రమంలోనే పెంచిన తల్లిని కోల్పోయి, కష్టాలు ఎదురైనప్పటికీ జ్యోతి వెనకడుగు వేయలేదు. 'రాంబో ఫౌండేషన్' అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మెరుగైన జీవితాన్ని గడపడానికి పాట్నా జిల్లా యంత్రాంగం ఆమెకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఇదే ఫౌండేషన్‌ ద్వారా చదువు కొనసాగించిన జ్యోతి.. మెట్రిక్యులేషన్ పరీక్షలో అసాధారణ మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత ఉపేంద్ర మహారథి ఇనిస్టిట్యూట్‌ నుంచి మధుబని పెయింటింగ్స్‌లో శిక్షణ తీసుకుని చిత్రకళను కూడా నేర్చుకుంది. అయినా సంతృప్తి చెందని జ్యోతి.. ఇంకా ఏదో సాధించాలని తపిస్తోంది.

ఈ క్రమంలోనే పాట్నాలోని ఒక కేఫ్‌ను నిర్వహించే ఉద్యోగం వచ్చింది. దీంతో రోజంతా కేఫ్ నడుపుతూ ఖాళీ సమయాల్లో చదువుకుంటోంది. అంతేకాదు ప్రస్తుతం సొంత సంపాదనతో అద్దె ఇంట్లో నివసిస్తున్న జ్యోతి.. మార్కెటింగ్ రంగంలో కెరీర్‌ను మలచుకోవాలని కలలు కంటోంది. ఓపెన్ స్కూల్ లెర్నింగ్ ద్వారా చదువు కొనసాగిస్తోంది.


Next Story

Most Viewed