కట్టెలు మోసిన చేత్తో.. ప్రపంచ ఛాంపియన్‌ గెలిచింది.!

by Daayi Srishailam |

ఆమె ఒకప్పుడు సాధారణ పేదింటి అమ్మాయి. కానీ ఇప్పుడు దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి

కట్టెలు మోసిన చేత్తో.. ప్రపంచ ఛాంపియన్‌ గెలిచింది.!
X

దిశ, ఫీచర్స్: పుట్టుకతోనే ఎవరూ ఛాంపియన్ కారు. దానికెంతో కఠోర శ్రమ చేయాలి. సవాళ్లను ఎదుర్కోవాలి. సాధించాలనే సంకల్పం.. సాధిస్తాననే తపన ఉంటేనే అది సాధ్యం. ఇండియన్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఈ తరహా విజయాన్నే సొంతం చేసుకుంది. ఆమె ఒకప్పుడు సాధారణ పేదింటి అమ్మాయి. కానీ ఇప్పుడు దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి.

వెండితో పునరాగమనం..

నార్వేలోని ఫోర్డేలో తాజాగా జరిగిన 2025 ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 48కేజీల విభాగంలో మీరాబాయి చాను వెండి పతకాన్ని సాధించింది. మొత్తం 199 కేజీల బరువెత్తి ఈ విజయాన్ని అందుకుంది. 2022 తర్వాత ఆమె సాధించిన మొదటి ప్రపంచ పతకం ఇదే. అంతేకాదు.. మూడేళ్లుగా భారత్‌కు ఈ ఛాంపియన్‌షిప్‌లో ఎలాంటి పతకాలు రావడంలేదు. ఆ లోటును కూడా భర్తీ చేసింది చాను. ఈ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు రాకుండా ఉన్న శూన్యతను తీర్చింది. ఈ పోటీలో మీరాబాయి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

కఠోర సాధన..

మీరాబాయి చాను గత కొన్నేళ్లుగా వెన్ను నొప్పి, భుజం, మణికట్టు గాయాలతో బాధపడుతోంది. దీనివల్ల 2023 ఆసియా ఛాంపియన్‌షిప్‌లకు దూరమైంది. మళ్లీ ఫాంలోకి వచ్చేందుకు పటియాలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో నెలల తరబడి చికిత్స తీసుకుంది. 2025 కామన్‌వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి గ్లాస్‌గో 2026కు నేరుగా అర్హత పొందింది. గాయాలు తన సంకల్పం ముందు ఓడిపోయాయి. ఆమె కుటుంబ నేపథ్యం అలాంటిది. ఇంపాల్ సమీపంలోని నాంగ్‌పోక్ కాక్చింగ్ అనే చిన్న గ్రామంలో పుట్టిన తాను కఠోర సాధనతో అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది.

కట్టెలు మోసిన చేతులతో..

మీరాబాయ్ వాళ్లది పేద కుటుంబం. ఇంట్లో అందరికంటే చిన్నది. వాళ్ల నాన్న సైఖోమ్ క్రితి మీటీ కన్‌స్ట్రక్షన్ వర్కర్‌గా పని చేసేవాడు. నెలకు కేవలం 2,000-3,000 రూపాయలు మాత్రమే సంపాదించేవాడు. తల్లి సైఖోమ్ టోంబి దేవి ఊర్లో చిన్న చాయ్ బండి నడిపేది. చిన్నప్పుడు మీరాబాయి వాళ్ల అక్కలతో కలిసి అడువుల్లోకి కట్టెలకు వెళ్లేది. తనకు 12 ఏళ్ల వయసు వచ్చేనాటికి తనకంటే పెద్దవాడు, శారీరక ధారుఢ్యంగల తన అన్న కూడా ఎత్తలేని బరువులను ఎత్తి అమాంతం నెత్తిమీద పెట్టుకొని ఐదారు కిలోమీటర్లు కొండలు, గుట్టల మీద నడుస్తూ వెళ్లేది.

వీల్ చెయిర్లో ఉన్నా..

వెయిట్‌లిఫ్టింగ్‌లో రాణించడానికి మీరాబాయి ఎన్నో కష్టాలు పడింది. గ్రామంలో ట్రైనింగ్ సదుపాయాలు లేకపోవడంతో రోజూ 20-40 కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి లంపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేసేది. అలా తన ప్రతిభను చూసిన కోచ్ అనిత బాంబూ స్టిక్స్‌తో ప్రాక్టీస్ చేయించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో స్నాచ్‌లో 82కేజీలు ఎత్తినా క్లీన్ అండ్ జెర్క్‌లో మూడు ప్రయత్నాలు విఫలమవడంతో ర్యాంక్ రాలేదు. మానసిక ఒత్తిడి కారణంగా 2023 ఆసియన్ గేమ్స్ తర్వాత వీల్‌చెయిర్ అవసరమైంది. అమెరికాలో రిహాబిలిటేషన్ చేసుకుని తిరిగి వచ్చి తాజాగా కాంస్యం సాధించింది.

Next Story