గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా?.. అయితే ఈ స్టోరీ మీరు తప్పక చదవాల్సిందే..!!

by Disha Web |
గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా?.. అయితే ఈ స్టోరీ మీరు తప్పక చదవాల్సిందే..!!
X

దిశ, ఫీచర్స్ : జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు నిరాశా, నిస్పృహలకు గురిచేస్తుంటాయి. కానీ వీటిని గుణపాఠంగా స్వీకరించగలిగితే విజయ తీరాలకు చేరవచ్చు అంటున్నారు మోటివేషనల్ నిపుణులు. గతంలో ఒక యువకుడు పోలీస్ ఇన్‌స్పెక్టర్ జాబ్ నోటిఫికేషన్ పడగానే అప్లయ్ చేశాడు. ఫిజికల్ టెస్టుల్లో రాణించగలననే నమ్మకం అయితే ఉంది కానీ రాత పరీక్షే అతనికి సవాలుగా మారింది. ఎగ్జామ్ రాసేందుకు బాగా ప్రిపేర్ కావాలనుకున్నాడు. కానీ పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ చదువుకుంటున్నాడు కాబట్టి తగిన సమయం దొరికేది కాదు. చివరికి పరీక్ష తేదీ దగ్గర పడింది. 30 రోజులే సమయం ఉంది. ఇప్పుడేం చేయాలి? ఇన్నాళ్లూ చదవనిది నెల రోజుల్లోనే చదవగలమా? చదివితే మాత్రం పాసవగలమా? అనే సందేహాలు తలెత్తుతాయి. ఇలాంటప్పుడే సరైన ఆలోచన అవసరం అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

ఇక ఏం చేసినా ప్రయోజనం ఉండదు అనే ప్రతికూల ఆలోచనలతో సతమతమైతే నిజంగానే అలా జరగవచ్చు. కాబట్టి దానిని దూరం పెట్టాలి. తక్కువ సమయంలో ప్రిపరేషన్ అనేది చాలా పెద్ద సవాలే అయినా దానిని స్వీకరించగలిగే ధైర్యం, ఆత్మవిశ్వాసం అలవర్చుకోవాలి. ఎందుకంటే ఏ వ్యక్తీ కావాలని తన సమయాన్ని దుర్వినియోగం చేసుకోడు. తప్పని పరిస్థితిలో సమయం అనుకూలించని ఫలితంగా కొన్నిసార్లు సవాళ్లు తప్పవు. అలాంటప్పుడు వాటిని సవాలుగా స్వీకరించి రాత్రింబవళ్లు చదివితే ర్యాంకు రాకపోవచ్చునేమో గానీ, పరీక్ష మాత్రం తప్పక క్వాలిఫై కావచ్చని కుటుంబ సభ్యులు భరోసా ఇచ్చారు. ప్రయత్నం అయితే చేయు ఫలితం గురించి ఆలోచించకు అని సూచించారు. ఇక అంతే.. ఆ మాటలు అతనిలో ధైర్యం, ఆత్మ విశ్వాసం నింపాయి. సవాలును స్వీకరించేలా చేశాయి. రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. జాబ్ కూడా సంపాదించాడు. తమిళనాడుకు చెందిన సెల్వరాజు అనే యువకుడి జీవితంలో సాధ్యమైన ఈ విజయం ఇతరులకు ఎందుకు సాధ్యం కాదు? తప్పక అవుతుంది. కావాల్సింది సమస్యను, సవాలును స్వీకరించే ధైర్యం.

అనుకూల పరిస్థితులున్నా కావాలని నిర్లక్ష్యం చేసి సవాళ్లను స్వీకరించాలనేది కరెక్ట్ కాదు. కానీ ఎవరికైనా తమ జీవితంలో తప్పనిసరి పరిస్థితుల్లో, లేదా అకస్మాత్తుగా ఎదురయ్యే సమస్యలు, సవాళ్లు కొన్నుంటాయి. వాటికి భయపడవద్దు అనేదే మానసిక నిపుణుల అభిప్రాయం. ఇక్కడ కావాల్సింది నిరాశను, నెగెటివ్ ఆలోచనను వదిలేయడం. ప్రయత్నిస్తే పాసవగలమనే సానుకూల ఆలోచనకు పదునుపెట్టడం. అప్పుడు తప్పక విజయం సాధిస్తారు. వ్యతిరేక లేదా ప్రతికూల ఆలోచనల్లోనే సగం ఓటమి ఉంటుందని, సానుకూల ఆలోచనలో సవాళ్లను, సమస్యలను స్వీకరించడంలోనే సగం విజయం దాగి ఉంటుందని పేర్కొన్నారు. అందుకే మీ ఆలోచనా తీరును ఒకసారి పరిశీలించుకోండి. మీ విజయానికి ఆటంకం కలిగించేది అయితే మార్చుకోండి. అగ్నిలో దహించబడనిదే లోహం అనేది దగదగా మెరిసే బంగారంగా మారదు. ఉలి దెబ్బలు భరించనిదే శిల శిల్పంగానూ మారదు. అలాగే సవాళ్లు స్వీకరించనిదే, సమస్యల సుడిగుండాలను దాటి సక్సెస్ సొంతం చేసుకోలేము.
Next Story