ఉక్కు సంకల్పం..విషపూరిత ఉక్కు వ్యర్థాలతో బయో ఫెర్టిలైజర్లు.!

by Daayi Srishailam |

ఏదో ఒకటి చేయకపోతే పెను ప్రమాదం పొంచివుందని గ్రహించింది

ఉక్కు సంకల్పం..విషపూరిత ఉక్కు వ్యర్థాలతో బయో ఫెర్టిలైజర్లు.!
X

దిశ, ఫీచర్స్: రూర్కెలాలో ఎత్తయిన లిన్జ్-డోనావిట్జ్ (ఎల్‌డీ) ఉక్కు స్లాగ్ కుప్పలు ఊరి శివార్లలో భూతకొండల్లా నిలిచి ఉన్నాయి. అందరికీ ఇవి కేవలం వ్యర్థ భూములుగా కనిపిస్తాయి. కానీ డాక్టర్ శితారాశ్మి సాహుకు ఈ కుప్పలు ప్రజారోగ్యానికి హానికరమైనవిగా కనిపించాయి. వీటిని ఏదో ఒకటి చేయకపోతే పెను ప్రమాదం పొంచివుందని గ్రహించింది.

స్లాగ్ కుప్పల గురించే..

విషపూరిత వ్యర్థాలతో నిండిన భూములు.. చుట్టుపక్కల జీవవైవిధ్యాన్ని ధూళి, విష ఉప ఉత్పత్తుల కింద ఉక్కిరిబిక్కిరి చేస్తాయని తన పరిశోధనలో తెలుసుకుంది శితారాశ్మి. ఒక బయోటెక్నాలజిస్ట్‌గా ఆమె ఎప్పుడూ ఈ స్లాగ్ కుప్పల గురించి ఆలోచించేది. ఈ వ్యర్థాలను పర్యావరణ హితమైన ఎరువులుగా మార్చగల అవకాశాన్ని ఆమె కనుగొన్నది. ఎన్నో సంవత్సరాల పరిశోధన తర్వాత స్లాగ్‌లోని ఖనిజాలను ఉపయోగించుకుంటూ విషపూరిత లోహాలను నియంత్రించే బయో-ఫెర్టిలైజర్‌ను రూపొందించింది. ఈ ఆవిష్కరణ వ్యర్థాల సమస్యను తగ్గించడమే కాక నేలకు సారాన్ని.. పంట దిగుబడిని మెరుగుపరిచే వరంగా మారింది.

విజన్‌కు శ్రీకారం..

మజ్ఘిఘరియాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) నుంచి గ్రాడ్యుయేట్ చేసిన డాక్టర్ సాహు.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), రూర్కెలాలో డాక్టరేట్ పూర్తి చేసింది. అంతపెద్ద ఉన్నత స్థాయి పరిశోధనా విద్యను అభ్యసించినా తన మనసెప్పుడూ అకాడమీలో నిలవలేదు. దిగుబడి తగ్గుతున్న.. మట్టి క్షీణిస్తున్న రైతుల పొలాల్లోనే తన మనసంతా ఉండేది. నేటి రైతులు రసాయన ఎరువులపై ఆధారపడటం చూసిన ఆమె మార్పు అవసరమని గ్రహించింది. కృషి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు నెలల శిక్షణ కార్యక్రమంలో తన విజన్‌కు శ్రీకారం చుట్టింది.

వ్యర్థాన్ని సంపదగా..

వ్యాపార నేపథ్యం లేకపోవడంతో సవాళ్లు ఎదురయ్యాయి. కానీ స్లాగ్ కుప్పల చిత్రాలు.. రైతుల బాధలు తన సంకల్పాన్ని బలపరిచాయి. మూడేళ్ల పరిశోధన తర్వాత 2020లో బయోటెజ్ అగ్రినోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించింది. ఎల్‌‌‌‌‌‌‌డీ స్లాగ్‌ను బయో-ఫెర్టిలైజర్లుగా మార్చి వ్యర్థాన్ని సంపదగా మార్చడం ఈ కంపెనీ లక్ష్యం. ఐదు దశల ప్రాసెసింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసి.. విషపూరిత లోహాలను నియంత్రిస్తూ స్లాగ్‌లోని సహజ వనరులను సమృద్ధిగా చేసింది. ఈ ఫార్ములా పోషకాల శోషణను.. సూక్ష్మజీవుల పెరుగుదలను మెరుగుపరుస్తుంది.

సేంద్రియ ఉద్యమం..

ఈ ఎరువు హెక్టారుకు 1.5 టన్నుల వరకు వాడితే 20% దిగుబడి పెరుగుదల కనిపించింది. ఒడిశాలో 500 మంది రైతులతో భాగస్వామ్యం చేసిన డాక్టర్ సాహు వారి జీవితాల్లో వెలుగులు నింపింది. బయోటెజ్ ఎన్ఐటీ-రూర్కెలాలోని ఫౌండేషన్ ఫర్ టెక్నాలజీ & బిజినెస్ ఇన్‌క్యుబేషన్ (ఎఫ్టీబీఐ) వద్ద ఇన్‌క్యుబేట్ అవుతోంది. ప్రభుత్వ సహకారం.. ఫండింగ్ సపోర్ట్‌తో ఈ వెంచర్ పేటెంట్ ప్రక్రియలో ఉంది. ఈ ఆవిష్కరణ కేవలం మట్టి ఆరోగ్యం.. పంట దిగుబడి మెరుగుదల గురించి మాత్రమే కాదు. ఇది జీవనాన్ని పోషించే సేంద్రియ ఉద్యమం.

Next Story