పార్ట్‌నర్స్ చీటింగ్.. అవమానం ఎవరికి?

by Disha Web Desk 22 |
పార్ట్‌నర్స్ చీటింగ్.. అవమానం ఎవరికి?
X

దిశ, ఫీచర్స్ : స్త్రీ పురుషులు ఎవరైనా గానీ తమ భాగస్వామిని మోసం చేయడం సమర్థనీయం కాదు. ఇది రిలేషన్‌షిప్‌లో నమ్మకాన్ని, అవగాహనను తుడిచిపెట్టి ప్రేమ తాలూకూ వెచ్చదనాన్ని దూరం చేస్తుంది. అపార్థాలతో జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది. అయితే సమాజంలో భాగస్వాముల మధ్య మోసాలకు సంబంధించిన పరిణామాలు జెండర్ ఆధారంగా మారుతుంటాయి. సాధారణంగా ఒక పురుషుడు మోసం చేస్తే.. క్షమించబడతాడు. గతాన్ని మరిచి ముందుకు సాగాలని కోరతాడు. కానీ ఒక స్త్రీ తన భాగస్వామిని మోసం చేస్తే ఆమె పతితగా అవమానాన్ని ఎదుర్కొని బహిష్కరణను భరించాల్సి ఉంటుంది. అంటే మహిళలు మోసపోయినపుడు పట్టనట్లు వ్యవహరించే సమాజం.. మోసగించినపుడు నైతిక సమస్యగా చిత్రీకరించడం సమంజసమా? మగాళ్ల తప్పును పాక్షిక శిక్షతో కడిగేసే సొసైటీ.. ఆడవాళ్లను మాత్రం మానసిక క్షోభకు గురిచేయడం కరెక్టేనా?

అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళలపై బంధువులు, కొన్నిసార్లు గ్రామస్తులు సైతం విచక్షణారహితంగా దాడిచేసిన సంఘటనలు అనేకమున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు వైరల్ అయినపుడు సదరు మహిళ యొక్క భర్త, అత్తమామలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ చర్యలు.. ఆ మహిళ భరించిన అవమానం, బాధను భర్తీ చేస్తాయా? స్త్రీకి నిజంగానే అక్రమ సంబంధం ఉంటే ఆమె భర్త చట్టపరమైన చర్యలు తీసుకుని ఎందుకు జీవితాన్ని కొనసాగించడు? అతనితో పాటు తన కుటుంబం ఆమెను ఎందుకు అవమానించాలి? అనే ఆధునిక స్త్రీవాదులు ప్రశ్నిస్తున్నారు.

మ్యారేజ్ లైఫ్‌లో చీటింగ్ :

స్త్రీలు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే అది వారి క్యారెక్టర్‌తో పాటు కుటుంబ పరువుకు సంబంధించిన అంశం అవుతుంది. వైవాహిక భాగస్వామి కాకుండా మరొకరితో లైంగిక సంబంధం కలిగి ఉండటాన్ని పురుష లక్షణంగా పరిగణించే సమాజ మూసపద్ధతులే ఇందుకు కారణం. అదే మహిళల విషయానికొస్తే.. విధేయత, విశ్వసనీయతలే ప్రమాణాలుగా వారి క్యారెక్టర్‌ను నిర్వచిస్తారు. కాబట్టి సెక్స్ అనేది స్త్రీలు తమ భర్తలను సంతోషపెట్టేందుకు తప్పనిసరిగా చేయవలసిన డ్యూటీగా మారిపోతుంది. నిజానికి సెక్స్ స్వీయ-ఆనందాన్ని ఇచ్చేది అయినా వివాహానికి ముందు లేదా వివాహ జీవితంలో సెక్స్‌ను మహిళలు ఆస్వాదించడాన్ని ఈ సమాజం తప్పుబడుతుంది. ఒక స్త్రీ ఆనందం కోసం సెక్స్‌ను ఉపయోగిస్తే.. ఆమె సంస్కారి కానందుకు, సమాజ నిబంధనలను ఉల్లంఘించినందుకు సిగ్గుపడాల్సిన పరిస్థితినే క్రియేట్ చేస్తుంది.

వాడంటే మగాడు..

పురుషులు తమ భాగస్వాములను మోసం చేసినప్పుడు.. 'పురుషులు అలాగే ఉంటారు(Men will be Men)' అనే భావనే ఈ విషయంలో వారికి ఫ్రీడమ్ కల్పిస్తుంది. పురుషులు తమ లైంగిక కోరికలను ఎప్పటికీ నియంత్రించుకోలేరనే వాదన ప్రకారం 'మగతనం' అనేది లైంగిక కోరికలు, వాటిని నెరవేర్చుకునే సంకల్పం ద్వారా నిర్వచించబడుతుంది. ఇక వివాహేతర సంబంధాలు కూడా అపరిపక్వతకు సంకేతంగా పరిగణించబడుతున్నాయి. సమాజం దీనిని పురుషుల్లో కామన్ బిహేవియర్‌గా విడదీస్తుంది. అయితే మహిళలు పరిపక్వత కలిగిఉండటం వల్లే వారు వివాహ బంధాన్ని కొనసాగించడం పట్ల బాధ్యతను కలిగి ఉంటారు. అంటే తమ వైవాహిక ప్రమాణాల నుంచి వారు ఎప్పటికీ తప్పుకోకూడదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మోసం చేసిన భర్తలను కూడా క్షమిస్తున్నారు. దీనికి తోడు మహిళల విషయంలో 'వాడంటే మగాడు.. నీ బుద్ది ఏమైంది' అనే మాటలు కూడా ప్రభావం చూపిస్తున్నాయి.

సెన్సిటివ్‌గా పరిష్కరించాలి..

2018లో సుప్రీం కోర్టు 'వ్యభిచారం' నేరంకాదని ప్రకటించింది. కాబట్టి ఇలాంటి కేసుల్లో పురుషులకు లేదా స్త్రీలకు ఎలాంటి శిక్ష విధించినా సమర్థనీయం కాదు. మోసం చెడ్డదైనా లేదా క్షమించదగినదైనా అది ఇద్దరికీ వర్తిస్తుంది. నిజానికి వ్యభిచారం అనేది ఏకభార్యత్వానికి సంబంధించి ఒక వికారమైన అంశం. ఈ విషయంలో తరచూ జెండర్ ఆధారంగా భారీ జరిమానా విధించబడుతోంది. కానీ వాస్తవానికి ఈ సమస్యను సున్నితత్వంతో చర్చించాలి. మోసపోయిన భాగస్వామి వైద్యంపై దృష్టి సారించాలి. వివాహేతర సంబంధం కారణంగా వారి వైవాహిక జీవితం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నదా? లేదా రెండు వైపులా సయోధ్యకు అవకాశాలు ఉన్నాయా? పరిశీలించాలి.


Next Story

Most Viewed