మలీషా ఖర్వా.. గుడిసెలో పుట్టిన రాకుమారి.!

by Daayi Srishailam |

ఫ్యాషన్ ప్రపంచ రన్‌వేల మీద తన సత్తా చూపిస్తోంది మలీషా ఖర్వా

మలీషా ఖర్వా.. గుడిసెలో పుట్టిన రాకుమారి.!
X

దిశ, ఫీచర్స్: టాలెంట్ ఎవడి సొత్తూ కాదు. అట్లనే అందం కూడా. శ్రీమంతుల ఇండ్లలో పుట్టినవారి కంటే గుడిసెలో పుట్టినవాళ్లెంతో మంది అందంతో మైమరిపింపజేస్తుంటారు. ప్రయాగ్ రాజ్‌లో పూసల దండలు అమ్ముకుంటూ కనిపించిన మోనాలిసాలా. సేమ్ అలాంటి నేపథ్యం నుంచే వచ్చి ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచ రన్‌వేల మీద తన సత్తా చూపిస్తోంది మలీషా ఖర్వా.

ఫ్యాషన్ ప్రపంచంలో..

ముంబై సముద్రతీరంలోని ఓ చిన్న గుడిసె. ఒకప్పుడు కరెంటు లేకుండా.. నీళ్లు లేకుండా జీవితం గడిపిన బాలిక. ఇవాళ ప్రపంచంలోని పెద్ద పెద్ద ఫ్యాషన్ మ్యాగజైన్స్ కవర్ల మీద నవ్వుతూ కనిపిస్తోంది. ఆ అమ్మాయి పేరు మలీషా ఖర్వా. అందరూ ప్రేమగా "గుడిసె రాకుమారి" అని పిలుస్తుంటారు. తన చుట్టూ ఉన్న పేదరికం.. ఇరుకు గల్లీలు తన కలలను ఆపలేకపోయాయి. ఆ కలలు ఇప్పుడు రంగు రంగుల రన్‌వేల మీద రెక్కలు తెరుచుకొని స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. పెద్ద ఇల్లు.. డబ్బు.. పేరు ఉంటేనే.. మన మీద మనకు నమ్మకం ఉంటే కష్టాల కడలిలో కూడా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలొచ్చు అని నిరూపిస్తోంది మలీషా.

పర్యాటకుడి ప్రోత్సాహం..

మలీషా తండ్రి పిల్లల బర్త్‌డే పార్టీల్లో జోకర్‌గా మారి.. ముఖంపై గీతలు గీసుకుని నవ్విస్తూ డబ్బు సంపాదించేవాడు. ఇంటికి రెండు పూటల భోజనం కూడా కష్టంగా ఉండేది. కానీ మలీషా మనసులో మాత్రం పెద్ద పెద్ద కలలు ఉన్నాయి. అవెలా తీరతాయో కూడా తనకు తెలియదు. తనవాళ్లు కూడా గుర్తించలేదు. కానీ ఒక విదేశీయుడు కనిపెట్టాడు. ముంబై గుడిసెల ప్రాంతానికి వచ్చిన పాశ్చాత్య పర్యాటకుడు మలీషాను చూశాడు. ఆమె కళ్లలో మెరుపు.. ముఖంలో అందం చూసి ఆశ్చర్యపోయాడు. "నీలో ఏదో ప్రత్యేకత ఉంది" అంటూ తనకు మోడలింగ్ అవకాశాల గురించి చెప్పాడు.

మ్యాగజైన్స్ కవర్ పేజీలకు..

మలీషా ప్రయాణం చిన్న చిన్న ప్రాజెక్టులతో స్టార్టయ్యింది. తర్వాత ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్స్ కోసం ర్యాంప్ మీదికి ఎక్కే ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. మలీషా ఖర్వా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు 4.8 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీ. ప్రపంచంలోని పెద్ద మ్యాగజైన్స్ కవర్ పేజీలకు ఆమె ఎక్కింది. డబ్బు వచ్చిన మొదటి రోజు ఆమె చేసింది ఏమిటో తెలుసా? తన కుటుంబానికి ఓ ఇంటిని కొన్నది. గుడిసె నుంచి ఓ సౌకర్యవంతమైన ఇల్లు కట్టే స్థాయికి ఫ్యాషన్ తనను తీసుకొచ్చింది. గుడిసెలో పుడితే.. గుడిసెలోనే ఉండిపోవద్దనేది తన లక్ష్యం. అందుకే ఎగతాళి చేసినొళ్లతోనే శభాష్ అనిపించుకుంటోంది.

Next Story