బైకర్ దాదీలు భలే భలే.. వృద్ధాప్యంలోనూ హుషారుగా..

by Javid Pasha |

తల్లిదండ్రులు సమాజసేవలో భాగమవడంతో మందాకిని చిన్నవయసు నుంచే కుటుంబ బాధ్యతలు తీసుకుంది. 16 ఏళ్లకే ఉపాధ్యాయురాలిగా కెరీర్ మొదలు పెట్టింది.

బైకర్ దాదీలు భలే భలే.. వృద్ధాప్యంలోనూ హుషారుగా..
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఉన్నది ఇద్దరు బామ్మలు. ఒకరి వయసు 87 ఏండ్లు.. ఇంకొకరిది 84. షోలే సినిమాలో జై.. వీర్ సైడ్‌కార్ స్కూటర్లో ‘యే దోస్తీ హమ్ నహీ చోడేంగే’ అని పాడుతూ వెళ్తుంటారు కదా? సేమ్ వారిలాగే ఈ బామ్మలు అహ్మదాబాద్ రోడ్లపై చక్కర్లు కొడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.

సెలబ్రిటీలుగా..

సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న ఈ బామ్మలే మందాకిని షా.. ఉషాబెన్. మందాకిని అక్క. ఉషాబెన్ చెల్లెలు. చీరకట్టు.. పొడవాటి జుట్టు.. కళ్లకు స్టయిల్ అద్దాలు పెట్టుకొని ట్రాఫిక్‌లో రయ్‌మని వెళ్తుంటారు. మందాకిని స్కూటర్ నడిపిస్తుంటే.. ఉషా సైడ్‌కార్‌లో కూర్చుంటుంది. ఈ వీడియోలు వైరల్ కావడంతో అందరూ వీళ్లను ‘బైకర్ దాదీలు’ అనే ముద్దుపేరుతో పిలుస్తున్నారు. వీళ్లు అచ్చం షోలే సినిమాలోని జై.. వీరు లాగే ఉంటారని నెటిజన్లు పోలుస్తున్నారు. దీంతో ఈ అక్కాచెళ్లెళ్లు సెలబ్రిటీలుగా మారిపోయారు.

62 ఏళ్లకు డ్రైవింగ్..

ఆరుగురు అక్కాచెళ్లెళ్లలో మందాకిని అందరికంటే పెద్ద. వాళ్ల నాన్న స్వాతంత్య్ర సమరయోధుడు. తల్లిదండ్రులు సమాజసేవలో భాగమవడంతో మందాకిని చిన్నవయసు నుంచే కుటుంబ బాధ్యతలు తీసుకుంది. 16 ఏళ్లకే ఉపాధ్యాయురాలిగా కెరీర్ మొదలు పెట్టింది. తర్వాత తను కూడా తల్లిదండ్రుల బాటలో నడుస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది. రాముడికి తోడుగా లక్ష్మణుడు ఉన్నట్టే.. చిన్నప్పటి నుంచీ మందాకినికి తోడుగా ఉండేది ఉష. అలా వీళ్లది విడదీయరాని బంధంగా మారిపోయింది. 62 ఏళ్ల వయసులో మందాకిని బైక్.. జీప్ నడపడం నేర్చుకుంటున్నప్పుడు కూడా అక్కకు మద్దతిచ్చింది ఉష. ఈ అక్కా చెళ్లెళ్ల రైడింగ్ వీడియోలు వైరల్ కావడంతో మందాకిని ఎక్కడికెళ్లినా గుర్తుపడుతున్నారు జనాలు. సెల్ఫీలకోసం ఎగబడతారు. మందాకిని.. ఉషది రోడ్డుమీద స్కూటర్ రైడ్స్ మాత్రమే కాదు. స్వేచ్ఛ.. ఆనందం.. స్వయం నిర్భరతకు చిహ్నం.

Next Story