ప‌లు దేశాల్లో నీటి క‌రువు.. మ‌ద్యంతో మొక్క‌లు పెంచ‌మంటున్న శాస్త్ర‌వేత్త‌లు!

by Disha Web Desk 20 |
ప‌లు దేశాల్లో నీటి క‌రువు.. మ‌ద్యంతో మొక్క‌లు పెంచ‌మంటున్న శాస్త్ర‌వేత్త‌లు!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః భూమిపైన పర్యావ‌ర‌ణ మార్పుతో తీవ్ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాలుష్యం వ‌ల్ల‌ భూతాపం, వేడి పెరిగి, మంచు ప‌ర్వ‌తాలు కరిగిపోతున్నాయి. మ‌రో వైపు అకాల వ‌ర్షాలు, వ‌ర‌దల‌తో భారీ న‌ష్టం వాటిల్లుతోంది. అంత‌కుమించి, ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు దేశాలు భారీగా నీటి ఎద్ద‌డిని ఎదుర్కుంటున్నాయి. ఆయా దేశాల్లో వేడి గాలులు పెరిగిపోవ‌డంతో న‌దులు ఎండిపోతున్నాయి. ఇలా, ఒక నిర్దిష్ట ప్రాంతం తీవ్ర కరువుతో సతమతమవుతున్నప్పుడు, మ‌ళ్లీ పర్యావరణ వ్యవస్థ ప్రభావితమవుతుంది. సరస్సులు, నదులు, ఇతర నీటి వనరులు ఎండిపోతాయి, ఎండిపోయిన పరిస్థితుల్లో వృక్షసంపదకు ముప్పు ఏర్పడుతుంది. నీటి కొరత వ‌ల్ల‌ వ్యవసాయానికి తీవ్రమైన ముప్పు. పంట దిగుబడి, ఉత్పత్తి, నాణ్యతకు గణనీయమైన నష్టం ఏర్ప‌డుతుంది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితులే ఏర్ప‌డితే, పంట‌లు పండించ‌డానికి మ‌నుషుల ద‌గ్గ‌రున్న దారెంటీ?!

ఓ కొత్త పీర్-రివ్యూడ్ అధ్యయనం కరువు సమయాల్లో, మొక్కలు మనుగడకు సహాయపడటానికి ఇథనాల్ (ఆల్కహాల్) ఉపయోగించొచ్చ‌ని సూచిస్తుంది. జపాన్‌లోని RIKEN సెంటర్ ఫర్ సస్టైనబుల్ రిసోర్స్ సైన్స్‌లో నిర్వహించిన ఈ అధ్యయనం ఆగస్టు 25న‌ ప్రచురించారు. మోటోఆకీ సెకీ ఈ అధ్యయనానికి నాయకత్వం వహించ‌గా, అధ్యయ‌నాన్ని ప్లాంట్ అండ్ సెల్ ఫిజియాలజీ జర్నల్‌లో ప్రచురించారు. దీని ప్రకారం, ఇథనాల్ వాడ‌టం వ‌ల్ల‌ మొక్కలు నీరు లేకుండా రెండు వారాల పాటు జీవించ గ‌ల‌వు. మొక్కలు బ‌త‌క‌డానికి నీరు లేనప్పుడు వాటి నుండి సహజంగానే ఇథనాల్ ఉత్పత్తి అవుతుందని అధ్య‌య‌నంలో పేర్కొన్నారు.

సెకీ CNNతో మాట్లాడుతూ, "నీటి య‌ద్ద‌డిని తట్టుకునే మొక్కలను తయారు చేసే సమ్మేళనాల కోసం ప‌రిశోధించే ప్రక్రియలో ఈ విష‌యం ఆవిష్కృత‌మ‌య్యింది" అని తెలిపారు. ఇక‌, ఇథనాల్ సురక్షితమైనది, చౌకైనది, విస్తృతంగా లభ్యమవుతుంది క‌నుక‌ నీటి కొరత సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తిని పెంచడానికి ఇది ఒక ఆచరణాత్మక మార్గాన్ని అందించగలదని అధ్యయనం పేర్కొంది. జన్యుపరంగా మార్పు చెందిన వివాదాస్పద ఉత్పత్తిని వ‌దిలించుకోడానికి ఈ అభ్యాసం సహాయపడుతుంద‌ని వెల్ల‌డించారు. కరువు, నీటి కొరత, విపరీతమైన వేడి, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పులకు స్పష్టమైన సంకేతాలని, త‌గిన త‌క్ష‌ణ‌ చర్యలు తీసుకోక‌పోతే ఆహార కొరత త‌ప్ప‌ద‌ని అధ్య‌యం హెచ్చ‌రించింది.

Next Story

Most Viewed