ఎల్ఐసీ ఐపీఓలపై ప్రభుత్వ కీలకనిర్ణయం..

by  |
ఎల్ఐసీ ఐపీఓలపై ప్రభుత్వ కీలకనిర్ణయం..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బీమా రంగ సంస్థ ఎల్ఐసీ ఐపీఓకు సంబంధించి ఈ నెలలో కీలక చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఎల్ఐసీ ఐపీఓ కోసం జులైలో మర్చెండ్ బ్యాంకర్లను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం బిడ్‌లను ఆహ్వానించనుంది. దీనిద్వారా వచ్చే ఏడాది జనవరి నాటికి ఎల్ఐసీ సంస్థను ఐపీఓకు తీసుకురావాలనే ప్రణాళికను ప్రభుత్వం కలిగి ఉంది. ఇదివరకే దీనికోసం పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్) మదింపు ప్రక్రియ కోసం మిల్లిమేన్ అడ్వైజర్స్ ఎల్ఎల్‌పీ ఇండియాను నియమించింది. భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా ఎల్ఐసీ నిలుస్తుందని ఇప్పటికే మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

దీంతోపాటు ఎల్ఐసీ విక్రయం కోసం బడ్జెట్ సవరణలను కూడా ప్రభుత్వం నోటిఫై చేసింది. ‘రానున్న రెండు వారాల్లో మర్చెంట్ బ్యాంకర్ల నియామకం కోసం బిడ్‌లను ఆహ్వానిస్తాం, సంస్థాగత మదుపర్లతో చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. అలాగే నవంబర్ చివరి నాటికి రెగ్యులేటరీ అనుమతులు వస్తాయని అంచనా వేస్తున్నట్టు’ అధికారులు వెల్లడించారు. అలాగే, ఎల్ఐసీ ఐపీఓ కోసం సుమారు 10 శాటం వాటాలను పాలసీదార్ల కోసం రిజర్వ్ చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తీసుకున్న పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంలో ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్ చాలా కీలకం. ఈ ఏడాదిలో ప్రభుత్వ వాటాల విక్రయం నుంచి రూ. 1.75 లక్షల కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా ఉన్న సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed