ఈఎస్ఐలో మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభం

by  |
ఈఎస్ఐలో మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభం
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన ‘మొబైల్ వైరాలజీ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్’ హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ప్రారంభమైంది. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ప్రారంభించారు. డీఆర్డీఓ, ఈఎస్ఐ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ల్యాబ్ కరోనా పరీక్షలతో పాటు వైరస్‌ కల్చర్‌, వ్యాక్సిన్‌ తయారీలపై పనిచేయనుంది. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ కొవిడ్-19 నియంత్రణలో భాగంగా డీఆర్డీఓ శాస్త్రవేత్తలు చాలా కృషి చేస్తున్నారని, నిర్మాణానికి దాదాపు ఆరు నెలలు పట్టే వైరాలజీ ల్యాబ్‌ని కేవలం 15 రోజుల్లోనే ఏర్పాటు చేసిన సంస్థలను ప్రత్యేకంగా అభినందించారు. దేశవ్యాప్తంగా 304 టెస్టింగ్ ల్యాబ్‌లను, 755కొవిడ్ ప్రత్యేక ఆస్పత్రులను సిద్ధం చేస్తామని కేంద్రమంత్రి వివరించారు. ఈ సదుపాయం హైదరాబాద్‌లో మొదటగా అందుబాటులోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కరోనాను ఎదుర్కొవడంలో టెస్టులు ఎంతో ఉపయోగపడతాయని, అంతర్జాతీయ ప్రమాణాలతో, అధునాతన సాంకేతికతతో రూపొందించిన బయోసేఫ్టీ లెవల్‌ (బీఎస్‌ఎల్‌)- 3 వైరాలజీ ల్యాబ్ ద్వారా వెయ్యి నుంచి రెండు వేల టెస్టుల వరకు చేయొచ్చు. ప్రస్తుతం లక్షా 86వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, వీటిలో 24వేల ఐసియు బెడ్స్ ఏర్పాటు చేశామని వివరించారు. దేశవ్యాప్తంగా 3 వేల క్వారంటైన్ సెంటర్స్ సేవలందిస్తున్నాయని, మేకిన్ ఇండియా కింద బీహెచ్ఈఎల్, డీఆర్డీఓ ఇతర ప్రైవేట్ సంస్థలతో కలిపి పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తయారు చేస్తున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని ఎదుర్కొవటం ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర కార్మికశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) సంతోష్‌ గాంగ్వార్‌, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు, డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

tags: Rajnath singh, kishan reddy, covid-19, Drdo, ESIC, Hyderabad

Next Story

Most Viewed