ఇలా చేస్తే స్కూలుకెళ్లే పిల్ల‌ల్లో క‌రోనా త‌గ్గించొచ్చు!!

by Disha Web Desk 20 |
ఇలా చేస్తే స్కూలుకెళ్లే పిల్ల‌ల్లో క‌రోనా త‌గ్గించొచ్చు!!
X

దిశ, వెబ్‌డెస్క్ః మూడేళ్లుగా ప్ర‌పంచాన్ని ప‌ట్టిపీడుస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి పీడ ఎప్పుడు పోతుందో ఎవ్వ‌రికీ అర్థం కావ‌ట్లేదు. ఒక‌టి పోతే రెండు, అది పోతే మూడు.. ఇప్పుడు నాలుగో వేవ్ అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు, విద్యార్థులకు అందాల్సిన స‌రైన చ‌దువు అంద‌క తీవ్ర ఇబ్బందుల‌కు లోన‌వుతున్న ప‌రిస్థితి. త‌ల్లిదండ్రులు, ప్ర‌భుత్వాలు తీవ్ర ఆందోళ‌న చెందుతున్న వైనం. ఇలాంటి ప‌రిస్థితుల్లో పిల్ల‌ల్ని పాఠ‌శాల‌ల‌కు పంపాలా వ‌ద్దా అనే సందిగ్థంలో చాలా మంది ఉన్నారు. అయితే, తాజాగా చేప‌ట్టి ఓ అధ్య‌య‌నం దీనికి మంచి ప‌రిష్కారాన్ని సూచిస్తోంది. విద్యాల‌యాల్లో వెంటిలేషన్ వ్యవస్థలను మెరుగుపరచడం విద్యార్థుల్లో కోవిడ్ -19 కేసులు తగ్గించ‌డానికి సహాయపడుతుందని తాజాగా విడుద‌లైన‌ ఇటాలియన్ అధ్యయనం సూచించింది.

ఇటాలియన్ థింక్ ట్యాంక్ అయిన హ్యూమ్ ఫౌండేషన్ ఈ అధ్య‌య‌నాన్ని నిర్వ‌హించారు. సెంట్రల్ ఇటలీలోని మార్షేలో 10,441 తరగతి గదులు ఉన్నాయి. వీటిలో 316 తరగతి గదులు మెకానికల్ వెంటిలేషన్ సిస్టమ్‌లతో ఉండగా మిగిలిన 10,125 వాటికి ఆ సౌక‌ర్యం లేదు. కాగా, మెకానికల్ వెంటిలేషన్ సిస్టమ్‌లతో కూడిన 316 తరగతి గదులలో కోవిడ్ కేసులు చాలా తక్కువగా ఉన్న‌ట్లు గుర్తించారు. ఇక‌, పాఠశాల వెంటిలేషన్ సిస్టమ్ నాణ్యతను బ‌ట్టి దశలవారీగా ఇన్‌ఫెక్షన్ల సంఖ్య తగ్గిందని అధ్యయనం నివేదించింది. వెంటిలేషన్ వ్యవస్థలు స‌రిగా లేని తరగతి గదులతో పోలిస్తే, ప్రతి 25 నిమిషాలకు తరగతి గది గాలిని పూర్తిగా మార్చినప్పుడు కోవిడ్ కేసులు 40 శాతం తగ్గిన‌ట్లు తెలిసింది. అలాగే, ప్రతి 15 నిమిషాలకు గాలి పూర్తిగా భర్తీ చేస్తే కేసులు తక్కువగా ఉంటాయనీ, ప్రతి 10 నిమిషాలకు గాలిని మార్చే సందర్భాలలో కోవిడ్ కేసులు ఇంకా చాలా తక్కువగా ఉన్నాయని అధ్యయనం తెలిపింది.

స్థానిక నివేదికల ప్రకారం ఇటలీలోని చాలా పాఠశాలల్లో మెకానికల్ వెంటిలేషన్ వ్యవస్థలు లేవు. కాబ‌ట్టి, ఇటలీ కోవిడ్ భద్రతా నియమాల ప్రకారం సాధ్యమైనప్పుడు ఉపాధ్యాయులు తరగతి గది కిటికీలను తెరవాల్సిందిగా ఆదేశాలు ఉన్నాయి. సెప్టెంబరు 2021, జనవరి 2022 మధ్య నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం, సమర్థవంతమైన వెంటిలేషన్ వ్యవస్థలను స్థాపించడం ద్వారా పాఠశాలల్లో కేసులు 100,000 మంది విద్యార్థులకు 250 నుండి 100,000 మంది విద్యార్థులకు 50కి తగ్గొచ్చని అధ్య‌య‌నం అభిప్రాయ‌ప‌డింది.



Next Story

Most Viewed