ఉక్రెయిన్ అధ్యక్షుడి ఇంటిని వేళం వేయనున్న రష్యా

by Disha Web Desk 1 |
ఉక్రెయిన్ అధ్యక్షుడి ఇంటిని వేళం వేయనున్న రష్యా
X

దిశ, వెబ్ డెస్క్ : ఉక్రెయిన్ పై రష్యా యుద్ధతంత్రాలతో విరుచుకుపడుతూనే ఉంది. దీంతో ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ నేపథ్యంలో ఆదేశంపై యుద్ధాన్ని వేగంవంతం చేసేందుకు మరోవైపు రష్యా విరాళాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌కు చెందిన వారి ఆస్తులు విక్రయించడం ప్రారంభించింది. వీటిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ నివాసం కూడా ఉండటం గమనార్హం.

ఉక్రెయిన్‌ అధీనంలో ఉన్న క్రిమియా ప్రాంతాన్ని 2014లోనే ఏకధాటిగా యుద్ధం చేసి రష్యా దళాలు ఆక్రమించుకున్నాయి. ప్రస్తుతం రష్యా విక్రయించాలని భావిస్తున్న జెలెన్‌స్కీ నివాసం ఆ ప్రాంతంలోనే ఉంది. అందుకే పుతిన్ ఈ సాహసానికి ఒడిగట్టాడు. క్రిమియాను ఆక్రమించుకున్న రష్యా.. ఆ ప్రాంతాన్ని పాలించేందుకు గాను అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ప్రతినిధిగా నియమించింది. ప్రస్తుతం ఆ క్రిమియా నేత విడుదల చేసిన వీడియోపై అంతర్జాతీయ మీడియా సంస్థ ఓ కథనాన్ని వెలువరించింది.

క్రిమియాలో ఉక్రెయిన్‌ ఆస్తులను జాతీయం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయించినట్లు ఆ కథనంలో పేర్కొంది. ఉక్రెయిన్‌ వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు చెందిన 57 ఆస్తులను జాతీయం చేయాలని స్థానిక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వీడియోలో వెల్లడించారు. క్రిమియాలో ఉన్న ఆస్తులన్నింటిపైనా స్థానిక ప్రభుత్వానికే హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. క్రిమియాలో రష్యా శత్రువులకు ఆస్తులు ఉండకూడదని పేర్కొన్నారు.

2013 లో క్రిమియాలోని తీరప్రాంతమైన లివాడియాలో జెలెన్‌స్కీ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. దాన్ని ఆయన భార్య ఒలెనా జెలెన్‌స్కా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో నివసించే జెలెన్‌స్కీ.. అప్పుడప్పుడూ విడిది కోసం క్రిమియాలోని ఇంటికి వెళ్లేవారు. క్రిమియాను రష్యా ఆక్రమించిన అనంతరం అక్కడికి వెళ్లడం సాధ్యం కాకపోవడంతో ఆ ఇల్లు ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది. ప్రస్తుతం దాని విలువ రూ. 6.5 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

జెలెన్‌స్కీ ఇంటితో పాటు దాదాపు 57 ఆస్తులను వేలం వేయనున్నారు. వాటి విక్రయం ద్వారా వచ్చిన నిధులను రష్యా ప్రారంభించిన ప్రత్యేక సైనిక చర్య కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు పరిహారంగా అందించనున్నట్లు క్రిమియా పార్లమెంట్ స్పీకర్ రష్యా మీడియాకు వెల్లడించారు. మరోవైపు క్రిమియాను 2014 లోనే రష్యా ఆక్రమించుకున్నప్పటికీ చాలా దేశాలు ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని అధికారికంగా ఉక్రెయిన్‌లోని భాగంగానే గుర్తిస్తుండటం గమనార్హం


Next Story

Most Viewed