ఆడింది 16 మ్యాచ్‌లే.. కానీ, ఐసీసీ టాప్ ర్యాంకర్

by  |
ఆడింది 16 మ్యాచ్‌లే.. కానీ, ఐసీసీ టాప్ ర్యాంకర్
X

దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఆడింది 16 టీ20లే అయినా ఏకంగా ఐసీసీ టాప్ ర్యాంకును చేరుకొని రికార్డు సృష్టించాడు. అతడే ఇంగ్లాండ్ సంచలన బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలన్. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలవడంతో 877 రేటింగ్ పాయింట్లతో గతంలో కంటే నాలుగు స్థానాలు మెరుగుపరుచుకొని నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. మలన్ టాప్ ర్యాంకు సాధించడంతో రెండో స్థానంలో ఉన్న కేఎల్ రాహుల్ నాలుగో స్థానానికి పడిపోయాడు.

డేవిడ్ మలన్ ఇప్పటి వరకు కేవలం 16 టీ20 మ్యాచ్‌లే ఆడటం గమనార్హం. 2017 నుంచి అంతర్జాతీయ టీ20లు ఆడుతున్న మలన్.. మొత్తం కలిపి 16 మ్యాచ్‌లలో 682 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు ఏడు అర్థ సెంచరీలు ఉన్నాయి. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మలన్ తర్వాత ర్యాంకుల్లో బాబర్ ఆజమ్ (869), ఆరోన్ ఫించ్ (835), కేఎల్ రాహుల్ (824), కోలిన్ మున్రో (785) ఉన్నారు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తొమ్మిదో స్థానానికి పరిమితమయ్యాడు.

ఇక మూడో టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించడంతో టీమ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఇంగ్లాండ్ రెండో ర్యాంకులో, టీమ్ ఇండియా మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆఫ్గన్ సంచలనం రషీద్ ఖాన్ టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ , ఆస్టన్ అగర్ , తబ్రేజ్ షంసీ, ఆడమ్ జంపాలు టాప్-5లో ఉన్నారు.

Next Story

Most Viewed