ప్రశ్నార్థకంగా స్టూడెంట్స్ ప్యూచర్.. పరేషాన్‌లో పిల్లల పేరెంట్స్

by  |
ప్రశ్నార్థకంగా స్టూడెంట్స్ ప్యూచర్.. పరేషాన్‌లో పిల్లల పేరెంట్స్
X

దిశ, భూపాలపల్లి : ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభించినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సక్రమంగా లేక విద్యార్థులు ఇబ్బంది పడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపు ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామంటూ ప్రకటనలు ఇస్తూనే, విద్యార్థుల సంఖ్యకు సరిపోయే ఉపాధ్యాయులను నియమించకపోవడంతో విద్యార్థులకు చదువు పట్ల సక్రమంగా అవగాహన కలగడం లేదని విమర్శలు వస్తున్నాయి.

భూపాలపల్లి జిల్లాలో ఉన్న 436 పాఠశాలల్లో 22,639 మంది విద్యార్థులు ఉండగా, 1959 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లాలో 1421 మంది ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలల్లో పని చేస్తున్నారు. జిల్లాలో 498 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో, ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అరకొర చదువులు చదవాల్సి వస్తున్నది. ఇందులో 228 SGT పోస్ట్‌లు, 221 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 49 PG HM పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఈ పోస్టులు ఖాళీగా ఉండటంతో జిల్లాలోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని ప్రభుత్వానికి ఎన్నోమార్లు విద్యార్థుల తల్లిదండ్రులు విన్నవించుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం భూపాలపల్లి జిల్లా పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు లేక పాఠశాలలు ఎలా నిర్వహిస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండటంతో సబ్జెక్ట్ టీచర్లు లేకపోవడంతో హైస్కూల్ విద్యార్థులు నానా తంటాలు పడాల్సి వస్తోంది.

హిందీ, ఇంగ్లీష్, తెలుగు, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్ట్‌లు చెప్పే టీచర్లు తక్కువగా ఉండడంతో, విద్యార్థులు కొన్ని సబ్జెక్టుల్లోనే చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఉపాధ్యాయులు లేకుండా చదువు ఎలా సాగుతాయి అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 18 నెలల తర్వాత పాఠశాలలు ప్రారంభించినప్పటికీ.. ప్రైవేట్ పాఠశాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం ఎక్కువగా ఉంది. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నారు.

దీంతో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశం రోజురోజుకు ఎక్కువవుతోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని ఆరోపణలున్నాయి. జిల్లాలోని భూపాలపల్లి, కాటారం, మహదేవ్‌పూర్, మహాముత్తారం, మల్హర్, మొగుళ్లపల్లి, టేకుమట్ల, ఘన్పూర్, మండలంలోని పాఠశాలల పరిస్థితి అధ్వానంగా తయారైంది.

పలిమెలలో పరిస్థితి దారుణం..

జిల్లాలోని పలిమెల మండలంలో పరిస్థితి దారుణంగా ఉంది. పలిమెల మండలంలో 43 మంది ఉపాధ్యాయులకు గాను కేవలం ఏడుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఆ మండలంలో పనిచేస్తున్నారు. దీంతో, ఆ మండలంలో పాఠశాలల పరిస్థితి, విద్యార్థుల చదువులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పాఠశాలలు మూతపడకుండా.. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అధికారులు నామమాత్రంగా కేజీవీబీ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను తాత్కాలికంగా నియమించినట్లు తెలిసింది. పూర్తిగా అటవీ ప్రాంతం, హరిజనులు, గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఈ మండలం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వెంటనే పలిమెల మండలంలో ఉపాధ్యాయులను నియమించాల్సిందిగా ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. ప్రస్తుతం పలిమెల మండలంలో కేజీబీవీ స్కూ్ల్స్‌లో పనిచేసే ఉపాధ్యాయులు సొంతంగా పాఠశాలలు నిర్వహిస్తున్నారు.

మహాముత్తారంలోనూ అదే పరిస్థితి..

జిల్లాలోని మహాముత్తారం మండలంలోనూ అదే పరిస్థితి ఏర్పడింది. మండలంలోని 10 పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకపోవడంతో వేరే పాఠశాల నుంచి ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపారు. పాఠశాల ప్రారంభం రోజు మండలంలోని 10 పాఠశాలలకు ఉపాధ్యాయులెవరూ వెళ్ళలేకపోవడంతో ఆ గ్రామ కమిటీలు మాత్రమే పాఠశాలలు నిర్వహించాయి. దీంతో, స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయగా స్పందించిన అధికారులు వేరే పాఠశాల నుంచి ఉపాధ్యాయులను అక్కడికి పంపించారు. కేజీబీవీలో పనిచేసే కొంతమంది ఉపాధ్యాయులను ఆయా పాఠశాలలకు పంపించడంతో సమస్య తీరిపోయింది. కేజీబీవీ పాఠశాలలు ప్రారంభమైతే ఆ పాఠశాల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఆరు మండలాలకు ఒక్కడే..

జిల్లాలోని ఆరు మండలాలకు ఒక్కడే విద్యాధికారి కావడంతో పర్యవేక్షణ కరువైంది. భూపాలపల్లి, కాటారం, మహాముత్తారం, మల్హర్, మహాదేవ్‌పూర్, పరిమళం మండలాలకు ఒక్కరే విద్యాధికారి పాఠశాలలను పర్యవేక్షిస్తున్నారు. ఆరు మండలాలకు సంబంధించిన పనులన్నీ ఒక్కరే చూడవలసి వస్తున్నది. దీంతో, ఆయనకు పని భారం తడిసి మోపెడు అయిపోతోంది. బోధన, బోధనేతర సిబ్బందితో పాటు సర్వశిక్ష అభియాన్‌లో పనిచేసే ఆరు మండలాల ఉద్యోగులను పర్యవేక్షించడం సాధ్యం కాదు. దీంతో మారుమూల గ్రామాల్లోని విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది.

విద్యా వాలంటీర్లు రీ ఎంగేజ్ చేయండి

గత సంవత్సరం జిల్లాలో 364 మంది విద్యా వాలంటీర్లను ఆయా పాఠశాలల్లో జిల్లా విద్యాశాఖాధికారి నియమించారు. పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ విద్యా వాలంటీర్ల స్థానాల్లో ఉపాధ్యాయులను నియమించలేదు. విద్యా వాలంటీర్లను సైతం నియమించలేదు. దీంతో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో విద్యార్థులకు విద్యాబోధన చేయడం ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా హై స్కూల్ విద్యార్థులకు సబ్జెక్ట్‌లు చెప్పే ఉపాధ్యాయులు లేక సబ్జెక్టులపై అవగాహన లేకుండా పోతోంది. ప్రభుత్వం వెంటనే విద్యా వాలంటీర్లను రీ ఎంగేజ్ చేయాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


Next Story

Most Viewed