ముఖ్యమంత్రుల దావత్‌లో లేని పంచాయతీ ఇప్పడెందుకు..?

by  |
CPI Venkat reddy
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు చర్చలతో పరిష్కరించుకోవాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఓ రెస్టారెంట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాల వినియోగంపై రెండు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య జల జగడం తీవ్రతరమవుతుందన్నారు.

ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ కుడికాలువ నిర్మాణాలతో తెలంగాణలోని కృష్ణా బేసిన్‌ ప్రాంతాలైన ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు, హైదరాబాదుకు తాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ నిర్మాణాలను వెంటనే నిలుపుదల చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. పాలమూరు- రంగారెడ్డి, డిండి, నెట్టెంపాడు, కల్వకుర్తి విస్తరణ ప్రాజెక్టులను ఎలాంటి అనుమతి లేకుండానే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వాదిస్తోందని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య చోటు చేసుకుంటున్న వాగ్వాదాలు జల వివాదాన్ని మరింతగా జఠిలం చేసుకోకుండా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని సూచించారు.

కృష్ణా జలాల వినియోగంలో కేంద్ర పాలకులపై ఒత్తిడి తీసుకురాలేకపోవటం, సకాలంలో నిధులను కేటాయించి పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయకపోవటంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఖండించారు. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కేసీఆర్ వ్యవహారం తయారైందని విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్లు తెరచి కృష్ణా జలాల ఆధారిత జిల్లాలకు తాగునీరు, సాగునీరు కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని లేకపోతే చరిత్ర క్షమించదని వెంకట్ రెడ్డి హెచ్చరించారు.

మా నీళ్లు మా నిధులు మా ఉద్యోగాలు అనే నినాదం పై తెలంగాణ తెచ్చుకొని ఇప్పుడు జల జగడానికి నాంది పలుకుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జల జగడాల ద్వారా ఇరు రాష్ట్రాలు సాధించేది ఏమీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరు దోస్తులని, కలిసి దావతులు కూడా చేసుకున్నారని, జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ కూడా వెళ్లారని గుర్తు చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి భేషజాలాలు లేవని, విభేదాలు అస్సలు లేవని చెప్పారని కానీ, ఇప్పుడు జగడాలు ఎందుకు మొదలయ్యాయని ప్రశ్నించారు. రాబోయే కాలంలో కృష్ణా జలాలపై ప్రాజెక్టు నిర్మించకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమాన్ని లేవనెత్తుతామని హెచ్చరించారు.

కృష్ణా జలాల్లో కనీసం 299 టీఎంసీలు కేటాయించినా ఏనాడు 260 టీఎంసీల నీళ్లు వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని విమర్శలు చేశారు. కేంద్రం తెలంగాణ విభజన చట్టంలో ఉన్న చట్టాలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఆంధ్ర, తెలంగాణ కొట్లాడితే కేంద్రానికి లాభం అన్నట్లు వ్యవహరిస్తోందని అన్నారు. కేంద్రం ప్రేక్షకపాత్ర వెనుక రాజకీయం ఉందని ఆయన ఆరోపించారు. ఇద్దరు కొట్లాడితే మూడో వాడికి లాభం అన్నట్టు కేంద్రం వ్యవహరించడం తగదని హితవు పలికారు. రెండు తెలుగు రాష్ట్రాలు నీటి వివాదం విషయంలో భావోద్వేగాలు రెచ్చకొట్టకూడదని కేంద్రానికి సూచించారు.

మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల దత్తత విషయంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మోసం చేశారని విమర్శించారు. ఆనాడు చంద్రబాబు నాయుడు, వైయస్ రెడ్డి, కేసీఆర్ పాలమూరు జిల్లాను మోసం చేశారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు టంగుటూరి నరసింహారెడ్డి బుద్దుల జంగయ్య, స్థానిక కార్యదర్శి శ్రీను, పవన్, చంద్రబాబు, లింగం తదితరులు పాల్గొన్నారు.


Next Story