నగరంలో మరింత నిఘా..నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్న సీపీ!

by  |
నగరంలో మరింత నిఘా..నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్న సీపీ!
X

దిశ, విజయవాడ: విజయవాడలో ఇద్దరి వల్లనే ఎక్కువ కేసులు నమోదయ్యాయని సీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. కృష్ణలంక ప్రాంతాల్లో కలెక్టర్ ఇంతియాజ్, సీపీ ద్వారకా తిరుమలరావు ఆదివారం పర్యటించారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులతో మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇంతియాజ్ అభ్యర్థించారు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రజలు దానికి సహకరించాలని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

మీడియా సమావేశంలో కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ..కృష్ణలంక, ఖుద్దూస్ నగర్, కార్మిక నగర్ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో అవగాహన లేక సాముహిక సమావేశాలు పెట్టడమే కారణమని, కేవలం ఒక్క వ్యక్తి వల్ల 20 మందికి వైరస్ సోకినట్టు విచారణలో తేలిందని సీపీ వివరించారు. జిల్లాలో ఇప్పటివరకూ 7,500 వరకూ కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపామని, ఇందులో 170 వరకూ పాజిటివ్ వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. తామెన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల నుంచి పూర్తీ సహకారం అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు.

లాక్‌డౌన్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని సీపీ ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు. క్రిమినల్ కేసులు సైతం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని, కృష్ణలంక ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, నిరంతరం ప్రజల కదలికలపై నిఘా ఉంటుందని సీపీ వెల్లడించారు. ప్రజలు అత్యుత్సాహంతో స్థానిక మార్గాల్లో తిరిగినప్పటికీ డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఖచ్చితంగా అందరూ పాటించాలని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారు.

Tags: vijayawada, cp, dwaraka tirumalarao, collector, imtiaz

Next Story

Most Viewed