రుణాల రేట్లను తగ్గించిన కోటక్ బ్యాంక్

by  |
రుణాల రేట్లను తగ్గించిన కోటక్ బ్యాంక్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోని గృహ రుణాల రేట్లు 15 ఏళ్ల కనిష్ట స్థాయిలో కొనసాగుతున్నాయి. బ్యాంకులు, రుణ సంస్థలు కొవిడ్-19 సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో గృహాల కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణ రేట్లను నెల రోజుల వ్యవధిలో రెండో సారి తగ్గించింది. ఇది చారిత్రాత్మక కనిష్ట స్థాయిలో 6.75 శాతానికి తగ్గిస్తూ, ఇవి నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది.

‘గృహ రుణాలు 6.75 శాతంతో లభిస్తాయి. కొవిడ్-19 కారణంగా సొంత ఇంటికి ప్రాధాన్యత పెరిగింది. తక్కువ ధరలు, తక్కువ స్టాంప్ డ్యూటీ, తక్కువ వడ్డీ రేట్లు పాత కాలం స్థాయిలో ఉన్నాయి’ అని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ చెప్పారు. ‘ఎవరైన ఇల్లు కొనేందుకు ఇదే మంచి సమయం. వడ్డీ రేట్లు, స్టాంప్ డ్యూటీ రేట్లు తక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా డెవలపర్లు ఆస్తి ధరలపై తగ్గింపులను ఇస్తున్నారు. కాబట్టి సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి ఇది సరైన సమయం’ అని హెచ్‌డీఎఫ్‌సీ సీఈవో కేకి మిస్త్రీ అన్నారు. గత ఏడాది కాలంలో దేశీయంగా భారతీయ బ్యాంకులు గృహ రుణాల రేట్లను 150 నుంచి 200 బేసిస్ పాయింట్లకు తగ్గించాయి. ఒక బేసిస్ పాయింట్ శాతంలో వందో వంతు. రిజర్వ్ బ్యాంక్ సైతం రెపో రేటును 115 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది.

Next Story

Most Viewed