నా పాలాభిషేకంతో కేసీఆర్‌కు క‌నువిప్పు క‌ల‌గాలి

by  |
Komati Reddy KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : హామీలు ఇస్తూ క‌ల్వకుంట్ల కుటుంబం ప్రజ‌ల‌ను మోసం చేస్తుంద‌ని… అందుకు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ‌త్తాసు ప‌లుకుతున్నార‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు. హ‌య‌త్ న‌గ‌ర్ మండ‌లంలో జాతీయ ర‌హ‌దారి-65 నుంచి బ‌లిజ‌గూడ వ‌రకు ఆరేళ్ల క్రితం శంఖుస్థాప‌న చేసి నిధులు విడుద‌ల చేయ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ శిలాఫ‌లాకానికి పాలాభిషేకం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ స‌ర్కార్ వివ‌క్షపై తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు. 2015 ఆగస్టు 10న అప్పటీ మంత్రులు కేటీఆర్, హారీష్ రావు, మ‌హేంద‌ర్ రెడ్డిలు రూ. 11కోట్లతో జాతీయ‌ర‌హ‌దారి-9 నుంచి దేశ్‌ముఖ్ వ‌యా బ‌లిజ‌గూడ, క‌వాడిప‌ల్లి మీదుగా బీటీ రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాప‌న చేసిన‌ట్లు తెలిపారు. ఇప్పటికీ ఆరేళ్లు గ‌డుస్తున్న నిధులు ఎందుకు విడుద‌ల చేయాలేదని.. టెండ‌ర్లు ఎందుకు పిలువ‌లేద‌ని ప్రశ్నించారు.

సీఎం కుటుంబ స‌భ్యులు, మంత్రులు చేసిన శంఖుస్థాప‌న‌ల‌కే దిక్కులేకుంటే ఓ ఎమ్మెల్యే ప‌రిస్థితి ఏంట‌నీ దుయ్యబ‌ట్టారు. ఉద్యోగులు వారి హ‌క్కులు వారు సాధించుకుంటే పాలాభిషేకాలు చేయించుకునే టీఆర్ఎస్ స‌ర్కార్‌కు.. ఈ ప‌నులు చేయ‌క‌పోవ‌డం.. ప్రజ‌ల‌ను మోసం చేస్తున్నందుకు నిర‌స‌న‌గా శంఖుస్థాప‌న శిలాఫ‌ల‌కానికి పాలాభిషేకం చేస్తున్నట్లు తెలిపారు. ఈ పాలాభిషేకంతోనైనా కేసీఆర్ స‌ర్కార్‌కు క‌నువిప్పు క‌ల‌గాల‌ని అన్నారు.

ఈ ప‌నుల‌ను త్వర‌గా ప్రారంభించ‌కుంటే.. మీరు శంఖుస్ధాప‌న చేసి మోసం చేసిన గ్రామ‌స్థుల‌తో క‌లిసి జాతీయ‌ర‌హ‌దారిని దిగ్భందిస్తామ‌ని హెచ్చరించారు. త‌న స్వంత జిల్లాకు వంద‌ల కోట్లు ఇస్తున్న కేసీఆర్.. ఇబ్రహీప‌ట్నం నియోజ‌క వ‌ర్గంలో ఆరేళ్లుగా బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 11కోట్లు విడుద‌ల చేయ‌క‌పోవ‌డం సిగ్గుచేట‌ని మండిపడ్డారు.



Next Story

Most Viewed