అక్రమ మైనింగ్ పై లోకాయుక్తకు ఫిర్యాదు

by  |
అక్రమ మైనింగ్ పై లోకాయుక్తకు ఫిర్యాదు
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలో అక్రమంగా కొనసాగిస్తున్న మట్టి తవ్వకాలపై లోకాయుక్త‌కు ప్రముఖ సామాజిక వేత్త, బహుజన జేఏసీ ఖమ్మం జిల్లా కన్వీనర్‌ బానోత్ భద్రూనాయక్, రఘునాథ‌పాలెం గ్రామానికి చెందిన మందా బుచ్చిబాబులు ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా మైనింగ్ నిర్వహిస్తున్నారని పలుమార్లు ఫిర్యాదు చేసినా పూర్తిస్థాయిలో పట్టించుకోని జిల్లా అధికారులు, కలెక్టర్, మైనింగ్ ఏడీ సంజయ్ కుమార్, రఘునాధపాలెం మండల తహశీల్దారు జీ.నరసింహారావు పైనా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. నాలుగున్నర సంవత్సరాలుగా తవ్విన మట్టికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారించి, తగు చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు.

వాస్తవానికి రఘునాధపాలెం మండలంలోని కోయచెలక రెవెన్యూలో నాలుగు హెక్టార్లకు అనుమతులు తీసుకున్నారని వారు తెలిపారు. దాన్ని అడ్డు పెట్టుకొని రఘునాధపాలెం గ్రామంలోని 118 సర్వే నెంబర్, చింతగుర్తిలోని సర్వే నెంబర్ 266లో ఉన్న గుట్టను తవ్వి అక్రమంగా మట్టిని అమ్ముకున్నారని తెలిపారు. ఇదే అక్రమంపై ఉన్నతాధికారులకు తాము ఫిర్యాదు చేసినందుకు గాను ఇటీవల మీడియా ప్రతినిధుల ఎదుటనే తమపై వారు దాడి చేశారని లోకాయుక్తకు తెలిపారు.



Next Story