నేడు ఎంపీలతో కేసీఆర్ కీలక సమావేశం

by  |
నేడు ఎంపీలతో కేసీఆర్ కీలక సమావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: బియ్యం కొనుగోళ్ళ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీఆర్ఎస్ రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి పెంచాలనుకుంటున్నది. కేంద్రంతో ఇక యుద్ధమే అనే తీరులో ఇటీవల కామెంట్లు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఆదివారం ఉదయం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో టీఆర్ఎస్ పార్టీ పోషించాల్సిన పాత్ర, అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏయే అంశాలను పార్లమెంటు ఉభయ సభల్లో ప్రస్తావించాలో, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలో కేసీఆర్ క్లారిటీ ఇవ్వనున్నారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పార్టీ కార్యాలయం నుంచి ఇప్పటికే సమాచారం వెళ్ళింది.

వానాకాలం వరి కొనుగోళ్ళ అంశంతో పాటు యాసంగిలో ఎఫ్‌సీఐ ద్వారా బియ్యం సేకరణకు సంబంధించిన అంశాలపై కేంద్రాన్ని టీఆర్ఎస్ ఎంపీలు గట్టిగానే నిలదీయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ముందుచూపు లేని తీరు, స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంతో దేశవ్యాప్తంగా రైతాంగానికి ఎదురవుతున్న ఇబ్బందులను ఈ సమావేశాల్లో ప్రస్తావించాల్సిందిగా ఎంపీలకు సూచించే అవకాశం ఉన్నది. విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలు, కేంద్రం హామీ ఇచ్చినా అమలుకు నోచుకోకుండా ఉన్నవి, అపరిష్కృతంగా మిగిలినపోయిన అంశాలు, జల వివాదాలు, కేంద్రం నుంచి చట్టబద్ధంగా తెలంగాణకు రావాల్సిన నిధులు, విడుదలలో జరుగుతున్న జాప్యం తదితరాలన్నింటిపై టీఆర్ఎస్ ఈసారి పార్లమెంటులో గట్టిగానే ప్రస్తావించాలనుకుంటున్నది. ఈ అంశాలన్నింటిపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

రైతులకు దారి చూపుతున్న తెలంగాణ మంత్రులు


Next Story

Most Viewed