వ్యూహం మార్చిన కేసీఆర్.. ఒక్క సంవత్సరంలో రాజకీయ సంచలనం..

by  |

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి రోజురోజుకూ వేడెక్కుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ తన వ్యూహానికి పదును పెడుతున్నది. ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నది. ఇందుకోసం హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక నుంచే యాక్షన్‌ను షురూ చేస్తున్నది. దళితబంధును ఆగమేఘాల మీద తీసుకొచ్చిన సర్కారు ఉధృతంగా అమలు చేయాలనుకుంటున్నది. దీంతో పాటు అనేక సంక్షేమ పథకాలపైనా దృష్టి సారించింది. నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు వీలైనంత తొందరగా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలని కసరత్తు చేస్తున్నది. మరోవైపు అమలుకు నోచకుండా ఉన్న నిరుద్యోగ భృతి విషయంలోనూ రానున్న బడ్జెట్ నుంచే కేటాయింపులు చేయాలనే యోచనలో ఉంది.

లక్ష్యాల పూర్తికి దిశా నిర్దేశం

అటు పార్టీపరంగానే కాక ఇటు పరిపాలనాపరంగా కూడా అధికారులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేస్తున్నది. రానున్న ఏడాది కాలంలో అన్ని లక్ష్యాలనూ పూర్తి చేయాలని అనుకుంటున్నది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న పనులను ఏడాది కాలంలో పూర్తిచేసి ఫలాలను అందుబాటులోకి తేవాలనుకుంటున్నది. వివిధ అంశాలను జాబితా రూపంలో రెడీ చేస్తున్నది. ఇకపైన ప్రవేశపెట్టాలనుకుంటున్న పథకాలపైనా దృష్టి సారించింది. ఆ వ్యూహంలో భాగంగా ప్రస్తుతం వివిధ స్థాయిల్లో ఉన్న పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలనుకుంటున్నది.

పనుల్లో వేగవంతం

కొత్త సచివాలయ భవనం, వివిధ జిల్లాల్లోని సమీకృత కలెక్టరేట్ భవనాలు, ట్యాంక్ బండ్ సమీపంలో నెలకొల్పనున్న ఎత్తయిన అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట, తెలంగాణ అమరవీరుల స్థూపం, ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, గ్రామాల్లో మిగిలిన డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు తదితర పనులన్నింటినీ ఏడాది కాలంలో పూర్తి చేసేందుకు వేగం పెంచాలంటుంది. అందుకోసం ఇప్పుడు ఆ పనులు ఏ దశలో ఉన్నాయో, ఇంకా ఎంత కాలం పడుతుందో కూడా వివరాలను టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తూ ఉన్నది. మధ్యంతర ఎన్నికలే వచ్చినా, ముందస్తు ఎన్నికలకు పోయినా ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నది. ప్రభుత్వపరంగా కూడా పెండింగ్ పనులను శరవేగంగా పూర్తి చేయాలనుకుంటున్నది.

వచ్చే దసరా నాటికల్లా పూర్తి

వచ్చే సంవత్సరం దసరా కల్లా ఏ ఒక్క పనీ పెండింగ్‌లో లేకుండా పూర్తి చేయడంతో పాటు వాటిని వినియోగంలోకి వచ్చేలా చూడాలన్నది ఆ పార్టీ అభిప్రాయం. ఇందుకోసం ఇకపైన క్రమం తప్పకుండా రివ్యూ చేస్తూ అధికారులను ఉరుకులు పెట్టించాలనుకుంటున్నది. కొత్త సచివాలయం పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పలుమార్లు సమీక్షంచి, అటు కాంట్రాక్టు సంస్థకు, ఇటు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి అంతా రెడీ కావాలని స్పష్టం చేశారు. కొత్త సచివాలయం పనుల్లో రెండు అంతస్తుల వరకూ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. మరో నాలుగు అంతస్తుల శ్లాబ్ పనులు మూడు నెలల వ్యవధిలో పూర్తిచేయనున్నట్లు రోడ్లు భవనాల శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేశారు.

పదవుల పందేరం

పార్టీపరంగా గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు కమిటీల నిర్మాణంతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికలనాటికి పార్టీని బలోపేతం చేయడం, సభ్యత్వాన్ని ఉధృతం చేయడం, బూత్ స్థాయి నుంచే పార్టీ గెలుపుకోసం చేయాల్సిన పనులను రూపొందించుకోవడం తదితర అంశాలు టీఆర్ఎస్ నాయకత్వం మదిలో ఉన్నాయి. ఇంతకాలం ఉన్న అసంతృప్తులను చల్లార్చడానికి రానున్న రెండున్నరేండ్ల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా పార్టీలోనూ, కార్పొరేషన్లలోనూ తగిన పదవులు కల్పించి పరిస్థితులను అనుకూలంగా మల్చుకోవాలనుకుంటున్నది.

పథకాల అమలులో దూకుడు

సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ ఇదే దూకుడును ప్రదర్శించాలనుకుంటున్నది. ప్రతిష్ఠాత్మకంగా భావించిన ‘దళితబంధు’ పథకాన్ని ఇప్పటికే హుజూరాబాద్, వాసాలమర్రి గ్రామాల్లో అమల్లోకి తెచ్చింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. ఇప్పటికే పీఆర్సీ ఇచ్చినందున కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం ఉద్యోగులకు పదోన్నతులు, పోస్టింగులు, ఖాళీ పోస్టుల గణన, వాటిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ల జారీ తదితరాలపై దృష్టి పెట్టింది. నియామకాలను కూడా వేగవంతం చేయాలనుకుంటున్నది. రైతుల రుణమాఫీని ఈ ఏడాది రూ. 50 వేల పరిమితి వరకు పూర్తిచేసినందున వచ్చే ఏడాది రూ. 75 వేలు లేదా లక్ష రూపాయల వరకు రుణం ఉన్న రైతులకు అందించాలనుకుంటున్నది.

నిరుద్యోగ భృతి విషయంలోనూ రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో నిధులను కేటాయించే ఆలోచన ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల సమాచారం. కొత్త పథకాలపైనా ఆలోచన చేస్తున్నది. పెండింగ్‌లో ఉన్న అంశాలను కూడా దశలవారీగా ఆచరణలోకి తేవాలనుకుంటున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆయా లక్ష్యాలను పూర్తిచేసి, ఎన్నికల సమయంలో వాటిని విస్తృతంగా ప్రచారం చేసుకొని మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే కార్యాచరణను ఉధృతం చేయాలనుకుంటున్నది.

దిశ.. దమ్మున్న వార్తలుఎప్పటికప్పుడు..MORNING EDITION…
1హీరో సాయిధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్
2కేసీఆర్ ముందస్తు యాక్షన్ ప్లాన్
3సో.. స్లోగా టక్ జగదీశ్
4 బీజేపీ డ్యామేజ్ కంట్రోల్

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed