కాంగ్రెస్‌కు ఉత్తమ్ బంధువు తలనొప్పి.. అయినా అధిష్టానం మౌనమే!

319

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్​ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారడం ఓ వైపు ఉంటే… మరోవైపు ఈ వ్యవహారం కాంగ్రెస్​లో చిచ్చు పెట్టింది. ఒకవైపు కాంగ్రెస్​ఎంపీ, టీపీసీసీ చీఫ్​ఉత్తమ్, వర్కింగ్​ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డితో పాటు చాలా మంది సీనియర్లు ఈటలకు సమర్థింపుగా ఉంటున్నట్లుగా ఉంటూనే భూ కబ్జాలపై ఇతర మంత్రులను టార్గెట్​ చేస్తున్నారు. ఈ భూ వ్యవహారంలో ఈటలకు కాంగ్రెస్, బీజేపీ నేతల నుంచి మద్దతు ఉంటోంది. కానీ హుజురాబాద్​ కాంగ్రెస్​ నేత పాడి కౌశిక్​రెడ్డి మాత్రం వ్యతిరేక విమర్శలు సంధిస్తున్నారు. పార్టీతో సంబంధం లేకుండా… పార్టీ వద్దన్నట్లుగా సంకేతాలిచ్చినా ఈటల టార్గెట్​గా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్​లో కౌశిక్​రెడ్డి వ్యవహారం తలనొప్పిగా మారింది. అంతేకాకుండా ఆయన టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్ రెడ్డికి సమీప బంధువు కూడా కావడం మరో విశేషం.

ఎందుకు ఇలా..?

హుజురాబాద్‌ కాంగ్రెస్‌ నేత, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీప బంధువు పాడి కౌశిక్‌రెడ్డి రాజకీయం ఏంటో కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు అంతుచిక్కడం లేదు. పార్టీల నాయకుల అభిప్రాయానికి భిన్నంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను భూకబ్జాదారుడిగా చూపిస్తూ ఆరోపణలకు దిగుతున్నారు. ఈటల అంశంలో రోజుకో అంశాన్ని ఎత్తిచూపుతూ వివాదంగా మారుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో కౌశిక్​రెడ్డిపై సొంతపార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఆయన వ్యవహారం సరికాదంటూ మాజీ ఎంపీ, పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్​ టీపీసీసీకి లేఖ రాశారు. దాన్ని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ ఠాగూర్​కు కూడా పంపించారు. మరోవైపు ఇటీవల ఈటల రాజేందర్​ పలువురు నేతలు, ఉద్యకారులతో భేటీ అవుతున్నారు. రాజ్యసభ ఎంపీ డీఎస్, సీఎల్పీ నేత భట్టి, మాజీ మంత్రి, బీజేపీ నేత చంద్రశేఖర్​తో సమావేశమైన విషయం తెలిసిందే. అటు కాంగ్రెస్​ సీనియర్​ నేతలు ఉత్తమ్, రేవంత్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, వీహెచ్, దాసోజు శ్రవణ్, జీవన్​రెడ్డి, బీజేపీ నుంచి కూడా విజయశాంతి, అరవింద్​ తదితరులు ఈటలకు మద్దతుగా నిలిచారు. కానీ కాంగ్రెస్​ నేతలంతా ఈటల రాజేందర్​కు మద్దతు తెలుపుతుంటే.. హుజురాబాద్​ నియోజకవర్గ కాంగ్రెస్​ నేత పాడి కౌశిక్​రెడ్డి మాత్రం ఈటలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్​ ముఖ్యనేతలంతా ఓ స్టాండ్​ తీసుకుంటే కౌశిక్​ రెడ్డి మరో స్టాండ్​ తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్​ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Eatala Rajender Kaushik Reddy

టీఆర్ఎస్ ​వాళ్లే సైలెంట్..!

మరోవైపు టీఆర్ఎస్​నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఈటల రాజేందర్​పై బహిరంగ ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్​తో పాటు కొంతమంది మాత్రం ఈటలపై విమర్శలు చేశారు. ఆ తర్వాత వాళ్లు కూడా సైలెంట్​ అయిపోయారు. కానీ హుజురాబాద్​ కాంగ్రెస్​ఇంఛార్జి పాడి కౌశిక్​రెడ్డి ఈటలపై ఆరోపణలు ఆపడం లేదు. ప్రెస్​మీట్లతో పాటుగా సోషల్​ మీడియాలో ఈటలపై విరుచుకుపడుతున్నారు.

టీఆర్ఎస్‌లోకి వెళ్లను..

ఒంటరిగానే ఈటలను టార్గెట్​ చేస్తున్న కౌశిక్​… తాను టీఆర్ఎస్​లోకి వెళ్లనంటూ వెల్లడించారు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కౌశిక్​రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీచేసే అవకాశం ఉందని, టీఆర్ఎస్​ఆయనకు వెనకుండి సపోర్టు చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. కానీ తన చర్యలకు కట్టుబడి ఉంటానని, తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటూ గురువారం ఓ వీడియో విడుదల చేశారు. హుజురాబాద్​ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని, అదే సమయంలో ఈటల భూదందాలను వెలుగులోకి తెస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నాయకులను, కార్యకర్తలను వేధింపులకు గురిచేసిన ఆయన్ను వదిలే సమస్య లేదంటూ వెల్లడించారు.

ఏం చేస్తున్నారు..?

ఈ వ్యవహారంలో కాంగ్రెస్​ అధిష్ఠానం ఎందుకో మౌనంగానే వ్యవహరిస్తోంది. కరీంనగర్​ జిల్లా నుంచి కౌశిక్​ అంశంలో ఏం చేయడం లేదనే విమర్శలున్నాయి. తాజాగా పొన్నం ప్రభాకర్​ కూడా అధిష్టానానికి లేఖ పంపారు. ఉత్తమ్​తో పాటుగా ఠాగూర్​కు కూడా ఇదే అంశాన్ని సూచించారు. కానీ ఇంకా ఎలాంటి రిప్లై లేదు. కౌశిక్​రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కు దగ్గరి బంధువు కావడం కూడా చర్చకు దారి తీస్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..