కేసులు ఆగే వరకు స్కూళ్లకు పంపేది లేదు

by  |
కేసులు ఆగే వరకు స్కూళ్లకు పంపేది లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం జూలైలో స్కూళ్లు రీ ఓపెన్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే కేంద్రం సూచించిన మార్గదర్శకాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే ఇచ్చింది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో జూలై లేదా ఆగస్ట్ నాటికి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా స్కూళ్లను దశలవారీగా తెరవాలని విద్యాశాఖ యోచిస్తోంది. జులై 5 వరకు టెన్త్ పరీక్షలు జరగనుండటంతో ఆ తర్వాతే రీ-ఓపెన్ చేయాలని భావిస్తోంది. కర్ణాటక సర్కారు కూడా జులైలోనే స్కూల్స్ ఓపెన్ చేయాలని భావిస్తుండగా.. అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ వేదికగా తల్లిదండ్రులంతా ఒక్కటై.. స్కూల్స్ రీఓపెన్ చేయకూడదని చిన్నపాటి ఉద్యమమే చేస్తున్నారు.

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చే వరకు లేదా కర్ణాటకలో ‘జీరో’ కేసులు నమోదయ్యే వరకు పిల్లల్ని స్కూల్‌కు పంపమంటూ తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో రెండు లక్షలకుపైగా పిటిషన్లు దాఖలు చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాకుండా స్కూల్స్ రీ ఓపెన్ చేయడమేంటని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సమర్ధించేది కాదని పేరేంట్స్ సదరు పిటిషిన్‌లో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లల్ని స్కూళ్లకు పంపితే కరోనాతో పోరాటం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్చువల్ ప్లాట్ ఫామ్‌పై తరగతులు కొనసాగించాలని, అవసరమైతే ఈ ఏడాదంతా ఆన్‌లైన్ క్లాసులే నిర్వహించాలని వ్యాఖ్యానిస్తున్నారు. ‘స్కూల్స్ రీ ఓపెన్‌ను తప్పుబడుతూ.. ఆన్‌లైన్ వేదికగా తల్లిదండ్రులందరూ కలిసి ‘పేరేంట్స్ అసోసియేషన్’ గ్రూపుగా ఏర్పడ్డారు. ఐదు లక్షల మంది పేరెంట్స్ నుంచి ఆన్‌లైన్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఆ గ్రూపు కృషి చేస్తోంది. అయితే ఈ పిటిషన్‌లపై ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేశ్ కుమార్ స్పందించారు. జూన్ 12 నాటికి తల్లిదండ్రుల్ని సంప్రదిస్తామని, వారి నిర్ణయం మేరకు స్కూల్స్ ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.


Next Story

Most Viewed