వీవీఎస్‌ లక్ష్మణ్‌ను మెప్పించిన ‘కర్నాటక రైతు’

by  |
వీవీఎస్‌ లక్ష్మణ్‌ను మెప్పించిన ‘కర్నాటక రైతు’
X

దిశ, వెబ్‌డెస్క్ : అవసరాలే నూతన ఆవిష్కరణలకు బీజం వేస్తాయని కర్నాటకకు చెందిన ఓ రైతు నిరూపించాడు. ప్రభుత్వ సాయం అందడం లేదని బాధపడుతూ కూర్చోకుండా, మన అందుబాటులో ఉన్న వనరులతోనే ఎలాంటి అద్భుతాలో చేయొచ్చో చేసి చూపించాడు. కాగా, అతడి నూతన ఆవిష్కరణకు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఫిదా అయ్యాడు. అంతేకాదు ట్విట్టర్ వేదికగా ఆ రైతు స్టోరీని షేర్ చేయడం విశేషం. ఇంతకీ ఏంటా ఆవిష్కరణ?

రూరల్ కర్నాటకలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన రైతు సిద్దప్ప. తన గృహ అవసరాలరీత్యా విద్యుత్ సరఫరా చేయాలని హుబ్లీ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్(HESCOM)ను కోరాడు. అయితే ఆ మారుమూల ప్రాంతానికి విద్యుత్ సప్లై చేసేందుకు ఆఫీసర్లు నిరాకరించారు. కానీ సిద్దప్ప మాత్రం ఎలాగైనా తన గృహానికి విద్యుత్ తీసుకురావాలని భావించాడు. అందుకోసం పర్యావరణానికి హానికలగని విధంగా ఏదైనా నూతన ఆవిష్కరణ చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే తన గ్రామానికి సమీపంలోని నారగండ్ కొండల పక్కనగల కెనాల్‌ను గమనించిన సిద్దప్ప.. ఆ కెనాల్ నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ నిరంతరం నీటి ప్రవాహం ఉండే అవకాశముండటంతో విద్యుత్ ఉత్పత్తి సాధ్యమేనని అనుకున్నాడు. రూ.5 వేల ఖర్చు చేసి తన దగ్గర ఉన్న ప్లాస్టిక్ టబ్బులు, చక్రాలు ఇతర సామగ్రితో ఓ డిజైన్ రూపొందించి, దానికి ‘వాటర్ మిల్’గా నామకరణం చేశాడు. ప్రస్తుతం అది సక్సెస్‌ఫుల్‌గా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. దీంతో 150 వాట్ల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చు. ఇది ప్రస్తుతం 10 బల్బులు, రెండు టీవీ సెట్‌లకు సరిపోయే 60 వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని సిద్దప్ప తెలిపాడు. అయితే నీటి ప్రవాహం ఆగిపోతే విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం ఒక్కటే ఈ ‘వాటర్ మిల్‌’కు గల మైనస్.

కాగా సిద్దప్ప.. అతి తక్కువ ఖర్చుతో, ఎవరి సహాయం లేకుండానే సస్టెయినెబుల్ ప్రొడక్ట్ రూపొందించడం నమ్మశక్యంగా లేదని, ఎలాంటి వనరులు లేకుండానే గొప్ప మార్పును ఎలా తీసుకురావచ్చో చేసి చూపించాడని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. కాగా, సిద్దప్ప ఇన్‌స్పైరింగ్ స్టోరీని షేర్ చేసినందుకు గాను నెటిజన్లు లక్ష్మణ్‌కు థాంక్స్ చెబుతున్నారు. ఈ విషయం వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చేరుకోవాలని కోరుకుంటున్నారు.


Next Story

Most Viewed