అప్పుడు అమ్మో కరీంనగరా.. అనేవారు!

by  |
అప్పుడు అమ్మో కరీంనగరా.. అనేవారు!
X

దిశ, కరీంనగర్: కరోనా ఎంత పనిచేసిందో తెలుసా… దగ్గరివారు ఎదురుపడినా భయపడి దూరం జరిగే స్థితి తీసుకువచ్చింది. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. కంటైన్మెంట్తో కరోనా కేసులు జీరోకు రావడంతో వారికి ఊరట లభించినట్లు అయింది. అయితే లాక్‌డౌన్ కు ముందు ఓ కుటుంబానికి ఎదురైన అనుభవం వారిని ఏ విధంగా నివ్వెరపర్చిందో చూద్దాం.. వేరే పట్టణంలో ఓ వేడుకకు హాజరైన ఆ కుటుంబాన్ని… బంధువులు, మిత్రులు దూరం నుంచే నవ్వుతూ పలకరించి అటు నుంచి అటే వెళ్లిపోయారు. ఏమైనా పొరపాటు చేశామా.. అన్న అంతర్మథనం ఆ ఫ్యామిలీలో మొదలైంది. ఎప్పుడు కనిపించినా ఆత్మీయ ఆలింగనం చేసుకునే వారు, కనీసం కరచాలనం ఇవ్వకుండా ఇలా వ్యవహరిస్తున్నారేంటి అని బాధపడ్డారు. ఇక చేసేదేమీ లేక వేడుక నుండి అర్థాంతరంగా తిరుగు ప్రయాణమై ఇంటికి వచ్చేశారు.

చివరకు అసలు విషయం తెలిసి హతాశులయ్యారు. కరీంనగర్‌లో తొలుత కరోనా కేసులు వెలుగులోకి రావడంతో ఆ వేడుక వద్ద అలాంటి స్పందన వచ్చి ఉంటుందని చెప్పడంతో షాక్‌కు గురయ్యారు. దీంతో ఇతర జిల్లాల్లో జరిగిన ఏ ఫంక్షన్‌కు వెళ్లినా కరీంనగర్ వాసులు దూరంగానే ఉండాల్సి వచ్చింది. అమ్మో కరీంనగర్ నుండి వచ్చారా.. అన్న భయంతో కూడిన పలకరింపులే కరీంనగర్ సిటీ వాసులకు ఎదురయ్యాయి. కొంతమంది ఫోన్లలో పలకరించినప్పుడు సైతం కరీంనగర్‌లో కరోనా విజృంభించిందంట కదా అనే మాటలే వినిపించేవి. ఇప్పుడు జీరో కరోనా దిశగా…ఇండోనేషియన్లు పర్యటించిన ఓ ప్రాంతాన్ని అధికారులు కార్డన్ ఆఫ్ చేస్తే ఇరుగు పొరుగు జిల్లాల వారు కరీంనగర్ వాసులను చూస్తేనే భయంతో వెనకడుగు వేశారు. అయితే అందరికన్నా ముందు కరోనా వైరస్ కరీంనగర్ తలుపు తట్టడంతో వెలివేసినట్టుగా చూసినా.. ఇప్పుడు జీరో కరోనా దిశగా కరీంనగర్ చేరుకోవడం నగర వాసులకు సంతోషాన్ని ఇస్తోంది. ఇప్పుడు వెల్‌డన్ కరీంనగర్ అంటూ కితాబు అందుకుంటుండడం ఆనందంలో ముంచెత్తుతోంది.

జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న చొరవతో అందరికన్నా ముందే కరీంనగర్ కరోనా ఫ్రీగా అయింది. అధికారులు కంటైన్ మెంట్ జోన్‌గా ప్రకటించడం వల్లే వ్యాధి ఇతర కాలనీలకు ప్రబలలేదని విజయ్ కుమార్ అనే స్థానికుడు అభిప్రాయపడ్డారు.

కరీంనగర్ జిల్లా అధికార యంత్రాంగం కరోనాను పారదోలేందుకు చేసిన ప్రయత్నాలు ఫాస్ట్ రిజల్ట్స్‌ను అందించాయని, ఇప్పుడు కరీంనగర్ సేఫ్ సిటీగా మారిందని కరీంనగర్‌కు చెందిన సుదగోని వేణుగోపాల్ ఆనందం వ్యక్తం చేశారు.

tags: Coronavirus, Positive, Karimnagar, Function, Indonesia, Containment Zone, Officers, Police

Next Story