పేదపిల్లల చదువుల కోసం ‘గాడ్జెట్ బ్యాంక్’..

by  |
పేదపిల్లల చదువుల కోసం ‘గాడ్జెట్ బ్యాంక్’..
X

దిశ, ఫీచర్స్ :కరోనా ఫస్ట్ వేవ్ నుంచి పాఠశాలలన్నీ ఆన్‌లైన్ వేదికగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎంతోకొంత ఆర్థికంగా ఉన్న ప్రైవేట్ స్కూల్ విద్యార్థులే ఈ ఆన్‌లైన్ విద్యా ప్రయోజనం పొందుతుండగా, ప్రభుత్వ బడులు, పిల్లలు ఇంకా పూర్తిస్థాయిలో ఆ దిశగా అడుగులు వేయలేదు. మరోవైపు చాలా గ్రామాల్లో ఇంటర్నెట్‌ సమస్య ఆన్‌లైన్‌ బోధనకు ఆటంకంగా మారింది. కొవిడ్ ఎప్పుడు అదుపులోకి వస్తుందో తెలియదు. స్కూళ్లు ఎప్పుడు మొదలవుతాయో చెప్పలేం. లక్షలాది విద్యార్థులకు కంప్యూటర్, ల్యాపీలు, స్మార్ట్‌ఫోన్లు కూడా లేవు. ఈ నేపథ్యంలోనే జార్ఖండ్ పోలీస్ విభాగం ‘గాడ్జె్ట్ బ్యాంక్’ ఐడియాతో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తోంది.

పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పీసీ, ల్యాపీ, స్మార్ట్ మొబైల్స్ కొనడం తలకుమించిన భారం. కాగా అన్ని రాష్ట్రాల్లో ‘డిజిటల్ డివైడ్’ అధికంగా ఉంది. ఈ అంతరాన్ని తగ్గించడానికి జార్ఖండ్ పోలీసులు ‘గాడ్జెట్ బ్యాంక్’తో ముందుకు వచ్చారు. చాలామంది ఇళ్లలో ‘డిస్కార్డెడ్ పీసీ, ల్యాపీ, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్’లు ఉంటాయి. ఆ పనికిరాని ఎలక్ట్రానిక్ పరికరాలను ఈ డిజిటల్ బ్యాంక్‌లో వేస్తే, పోలీసులు వాటిని బాగు చేయించి పేద, మధ్యతరగతి పిల్లలకు అందజేస్తారు. దాంతో డిజిటిల్ డివైడ్ తగ్గడంతో పాటు, ఆ విద్యార్థులు కూడా ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతారు. ఇక జార్ఖండ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన 65% మంది విద్యార్థులకు వారి ఇళ్లలో స్మార్ట్‌ఫోన్ లేనందున ఆన్‌లైన్ తరగతులకు ప్రవేశం లేదని రాష్ట్ర ప్రభుత్వ డేటా సూచిస్తుంది.

‘డిజిటల్ డివైడ్ కారణంగా చాలా మంది పిల్లలు ఆన్‌లైన్ పాఠాలను మిస్ అవుతున్నారు. ప్రాపంచిక జ్ఞానం పొందడానికి విద్యార్థులు చదువుకోవాలి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వాళ్లు చదువుకోలేకపోతే అవకాశాలు పొందలేరు. ఉపాధి దొరకడం కష్టమవుతుంది. అంతేకాదు నేరాల వైపు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అందువల్లే చిన్నారులను ప్రోత్సహించేందుకు, తిరిగి పాఠాల వైపు ప్రయాణించేదుకు డిజిటల్ బ్యాంక్ ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే పూర్తి బ్లూప్రింట్ సిద్ధం చేశాం. మొబైల్, కంప్యూటర్ పరికరాలు సాధారణంగా ఒకటి లేదా రెండు సంవత్సరాలు ఉపయోగించిన తర్వాత చాలామంది పక్కన పెట్టేస్తారు. ఇతరులు దుర్వినియోగం చేస్తారనే కారణంతో ఎవరికీ ఇవ్వకుండా ఇంట్లోనే పెట్టేస్తారు. అయితే దీనికి పరిష్కారంగా ఎవరైనా తమ పరికరాన్ని పోలీసులకు ఇవ్వగానే ఆ యజమాని గురించి స్టేషన్ డైరీలో ఎంట్రీ చేస్తాం. అక్కడితో ఆ గాడ్జెట్‌పై తన ఓనర్‌షిప్ ముగిసిపోతుంది. అతడు మాకు అందించిన వివరాలతో కూడిన కాపీని అతడికి అందజేస్తాం. పోలీసుస్టేషన్‌కు వచ్చే మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్‌ను జిల్లా ప్రధాన కార్యాలయానికి పంపిస్తాం. సంబంధిత ఎస్పీలు.. పాఠశాల ప్రిన్సిపాల్ సిఫార్సు మేరకు అవసరమైన విద్యార్థికి పరికరాన్ని అందజేస్తారు. పరికరాన్ని ఆన్‌లైన్ తరగతులకు మాత్రమే ఉపయోగించుకోవాలని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ తీసుకుంటాం.

– నీరజ్ సిన్హా , డీజీపీ

Next Story

Most Viewed