కాంగ్రెస్ లో ఆయన చేరికకు సడెన్ బ్రేక్!.. ఏమైందంటే ?

by  |
Shekar-Cherika-1
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరికకు బ్రేకులు పడినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో బలమైన బీసీ నేతగా ఉన్న ఎర్ర శేఖర్ జడ్చర్ల నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. బీజేపీలో సరైన ప్రాధాన్యత లేదని ఉద్దేశంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన ఈ మధ్యే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యాడు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని భావించినా పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ నెల 12న మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలో జరగనున్న విద్యార్థి, నిరుద్యోగ సైరన్ సభలో చేరాలని నిర్ణయించారు. ఈ మేరకు పీసీసీ నుంచి కూడా సంకేతాలు వచ్చాయి.

అయితే, ఈ క్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎర్ర శేఖర్ ను పార్టీలో చేర్చుకోవద్దని అధిష్టానానికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అయినప్పటికీ కాంగ్రెస్ లో ఆయన చేరిక ఖాయమని భావించారు. అందుకు అనుగుణంగా ఎర్ర శేఖర్ జడ్చర్ల నియోజకవర్గంలోని తన అనుచరుల వద్ద సమావేశం కూడా అయ్యారు. చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే సోమవారం సాయంత్రానికి సీన్ మారినట్లు సమాచారం. త్వరలోనే రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారని ఆయన సమక్షంలో చేరాలని సూచించారని తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా మరోవైపు కొంతమంది నేతలు ఎర్ర శేఖర్ రాకను వ్యతిరేకించడం వల్లే బ్రేకులు పడినట్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఎర్ర శేఖర్ సోమవారం సాయంత్రం నుండి ఫోన్ లోనూ అందుబాటులో లేకపోవడం, ఇతర పలు విషయాలు శేఖర్ చేరికకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయని భావిస్తున్నారు. ఇప్పటికే టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి చేరిక వాయిదా పడడం, ఇప్పుడు ఎర్ర శేఖర్ చేరిక కూడా దాదాపు వాయిదా పడడం చర్చనీయాంశమవుతోంది.



Next Story

Most Viewed