100వ టెస్టు ఆడనున్న ఇషాంత్ శర్మ

by  |
100వ టెస్టు ఆడనున్న ఇషాంత్ శర్మ
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్- ఇండియా మధ్య బుధవారం నుంచి ప్రారంభం కానున్న పింక్ బాల్ టెస్టు ఇషాంత్ శర్మకు చాలా ప్రత్యేకమైనది. టీమ్ ఇండియా పేసర్ ఇషాంత్‌కు ఇది 100వ టెస్టు. 2008లో టెస్టు కెరీర్ ప్రారంభించిన ఇషాంత్ శర్మ 13 ఏళ్ల తర్వాత 100 టెస్టు ఆడుతున్నాడు. తన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు చూసిన ఇషాంత్ జట్టుకు దూరమైనా సరే మొక్కవోని దీక్షతో తిరిగి జట్టులో స్థానం సంపాదించాడు. గాయల నుంచి కోలుకొని అద్భుత ప్రదర్శన చేశాడు. ఇటీవలే 300 వికెట్ల క్లబ్‌లో చేరిన ఇషాంత్.. పింక్ బాల్ టెస్టుతో మరో మైలు రాయిని చేరబోతున్నాడు. కపిల్ దేవ్ తర్వాత 100 టెస్టులు ఆడుతున్న టీమ్ ఇండియా పేస్ బౌలర్‌గా రికార్డులకు ఎక్కనున్నాడు.

2014లో లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 7/74 తో అద్భుత ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 30 పరుగులు ఇవ్వడంతో అతడి కెరీర్ ముగిసినట్లే అని అందరూ భావించారు. కానీ మరుసటి ఏడాదే లార్డ్స్‌లో అద్బుత ప్రదర్శన చేశాడు. 2018 నుంచి 20 టెస్టులు ఆడిన ఇషాంత్ 19.34 సగటుతో 76 వికెట్లు తీశాడు. తాను ఎన్నో సార్లు జట్టు నుంచి వెళ్లిపోయాని తిరిగి రావడానికి రాహుల్ ద్రవిడ్ కారణమని చెబుతుంటాడు. 99 టెస్టుల్లో 302 వికెట్లు తీసిన ఇషాంత్.. 11 సార్లు ఐదు వికెట్లు, ఒకసారి 10 వికెట్ల ప్రదర్శన చేశాడు.



Next Story

Most Viewed