కాంట్రాక్ట్ లెక్చరర్ల రిన్యూవల్ లేనట్టేనా..?

by  |
contract lecturers
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంట్రాక్టర్ లెక్చరర్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జూన్‌లో చేపట్టాల్సిన రిన్యూవల్ ప్రక్రియను నేటికీ చేపట్టకపోవడంతో కాంట్రాక్టర్ లెక్చరర్లు అయోమయంలో పడ్డారు. మరోవైపు మూడు నెలల నుంచి వారికి జీతాలు అందటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 404 కళాశాలల్లో 3,700 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు విధులు నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2000 సంవత్సరం నుంచి కాంట్రాక్ట్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్న లెక్చరర్లను ప్రభుత్వం విస్మరించింది. ప్రతి ఏడాది జూన్ లో చేపట్టాల్సిన రిన్యూవల్ ప్రక్రియ ఈసారి ప్రభుత్వం ఆపేయడంతో మే నెలతో కలిపి 3 నెలల వరకు వేతనాలను పొందలేకపోయారు. పీఆర్సీ వేతనాలు పెంచినా వాటి ఫలాలను ఉద్యోగులు అందుకోలేకపోతున్నారు.

2014 నుంచి నిలిచిన బదిలీలు

రాష్ట్ర వ్యాప్తంగా 404 కాలేజీల్లో 3,700 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు 2000 సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు. అప్పటి జోనల్ వ్యవస్థ ప్రకారం ఒక్కో అధ్యాపకుడు 250 నుంచి 300 కిమీటర్ల దూరం వరకు వెళ్లి ఉద్యోగాల్లో చేరారు. ప్రస్తుతం నూతన జోనల్ విధానం అమలు చేయడంతో కాంట్రాక్టు లెక్చరర్లు తమకు బదిలీలు చేపట్టాలని కోరుతున్నారు. 2014 ఏడాది నుంచి ఇప్పటి వరకు బదిలీలు చేపట్టకపోవడంతో అధ్యాపకుల, వారి పిల్లల జోన్లు వేరయ్యే అవకాశాలున్నాయని ఆందోళన చెందుతున్నారు.

రెన్యూవల్ ప్రక్రియ చేపట్టాలి

ప్రతి ఏడాది చేపట్టే రెన్యూవల్ ప్రక్రియను ప్రభుత్వం వెంటనే చేపట్టాలి. రెన్యూవల్ చేయకపోవడంతో 3 నెలలుగా వేతనాలు అందుకోలేకపోతున్నాం. పీఆర్సీ అమలు చేసినప్పటికీ వాటి ఫలాలు అందడం లేదు. వీటితో పాటు 2014 నుంచి ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియను జోనల్ వ్యవస్థ ప్రకారం చేపట్టాలి. మహిళా అధ్యాపకులకు వేతనాలతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి.
-గాదే శ్రీను, రాష్ట్ర కాంట్రాక్ట్ లెక్ఛరర్ల అసోసియేషన్ అధ్యక్షుడు


Next Story

Most Viewed