కరోనా టెస్టుల కన్ఫ్యూజన్!

by  |
కరోనా టెస్టుల కన్ఫ్యూజన్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఇప్పుడు కరోనా వైరస్ గురించిన చర్చలో ‘టెస్టింగ్’ ప్రధానాంశంగా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో ఈ చర్చ మరోసారి ముందుకు వచ్చింది. కరోనా మహమ్మారికి లాక్‌డౌన్‌తో చెక్ పెట్టలేమని.. టెస్టింగే ప్రధాన ఆయుధమని, అయితే, దురదృష్టవశాత్తు భారత్ స్వల్పంగానే టెస్టులు నిర్వహిస్తున్నదని అన్నారు. ఇలా.. ప్రభుత్వం మన జనాభాకు తగిన స్థాయిలో టెస్టులు నిర్వహింట్లేదని కొందరి ఆరోపణలు, కాదు.. కాదు.. విదేశాల కంటే మనదేశంలో ఎక్కువ పరీక్షలు జరుగుతున్నాయని మరికొందరి సమర్థింపులు వస్తున్నాయి. ఇంతకు నిజంగానే మన దేశంలో టెస్టులు సరిపడా జరుగుతున్నాయా? ప్రభుత్వం ఏ వ్యూహాన్ని అనుసరిస్తున్నది. అంతర్జాతీయ సంస్థలు ఏ సూచనలు చేశాయి? అనే విషయాన్ని పరిశీలిద్దాం..

మన దేశంలో ఎన్ని టెస్టులు జరుగుతున్నాయి?

ప్రస్తుతం మన దేశంలో రోజు(24 గంటల్లో)కు 30వేల టెస్టులు జరుపుతున్నట్టు ఐసీఎంఆర్ లెక్కలు చెబుతున్నది. త్వరలో ఈ సంఖ్యను లక్షకు తీసుకుపోబోతున్నట్టు తెలిపింది. గురువారం నాటికి మన దేశంలో మొత్తంగా 3.02 టెస్టులు నిర్వహించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ ఒక రోజులో అంటే తొమ్మిది గంటల షిఫ్టులో 42,418 టెస్టులను నిర్వహించే సామర్థ్యాన్ని భారత్ కలిగి ఉన్నదని గురువారం ఐసీఎంఆర్ ప్రతినిధి డాక్టర్ ఆర్ఆర్ గంగాఖేద్కర్ తెలిపారు. మరో శుభవార్త ఏంటంటే.. చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ఐదు లక్షల టెస్టింగ్ కిట్లు దేశంలోకి వచ్చేశాయి. వాస్తవానికి ఈ కిట్లు ఒక పదిరోజుల ముందే భారత్‌లోకి రావలసింది. మరో 6.5 లక్షల టెస్టింగ్ కిట్లు త్వరలో వస్తున్నాయి. ఈ కారణాల వల్లే అందరూ ఊహించినదానికన్నా కొన్ని టెస్టులు తక్కువగా జరిగి ఉండొచ్చు. అయితే, ఈ టెస్టింగ్ కిట్లే మనకు సరిపోతాయా? అంటే కాదు.. ఇంకా సమకూర్చుకోవాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మిగతా దేశాల్లో కంటే మెరుగేనా?

మన దేశంలో సరిపడా కరోనా టెస్టులు జరుగుతున్నాయా? అనే ప్రశ్నకు.. ముందుగా ఇతర దేశాలతో పోల్చుతూ వచ్చే సమాధానాలు వినిపిస్తాయి. మరి నిజంగానే విదేశాల కంటే మన ప్రభుత్వమే అధికంగా టెస్టులు జరుపుతున్నదా? సుమారు 130 కోట్ల జానాభా గల భారత్‌లో గురువారం నాటికి 3.02 లక్షల టెస్టులు జరిగాయి. కాగా, దాదాపు 33 కోట్ల జనాభా గల అమెరికా మాత్రం 32.5లక్షల టెస్టులు నిర్వహించింది. అంతర్జాతీయంగా పది లక్షల జనాభాకు ఎన్ని టెస్టులు నిర్వహిస్తున్నారన్న ప్రాతిపదికన టెస్టింగులను లెక్కిస్తున్నారు. ఈ ప్రాతిపదికన జర్మనీ, ఇటలీ, దక్షిణ కొరియా, అమెరికాలు అధికంగా టెస్టులు జరుపుతున్నాయి. జర్మనీలో పది లక్షలకు 15,700 మందిని పరీక్షించారు. ఇటలీలో పది లక్షల జనాభాకు 14వేలు, దక్షిణ కొరియాలో 10,500, యూఎస్‌లో పదివేల మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ లెక్కన చూస్తే భారత్ కేవలం 211 మందికి టెస్టులు నిర్వహిస్తున్నది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) మాత్రం మరో పద్ధతిలో లెక్కలు చెప్పింది. ఆ పద్ధతిలో ఇతర దేశాల కంటే మనదేశమెంతో మెరుగ్గా ఉన్నది. 24 పరీక్షల్లో ఒకరికి పాజిటివ్ వస్తున్నదని, అంటే ఒక పాజిటివ్ కేసుకు 24 మందికి నిష్పత్తిలో టెస్టులు జరుపుతున్నదని వివరించింది. ఈ లెక్క ప్రకారం.. జపాన్ (11.7), ఇటలీ (6.7), యూఎస్ (5.3)లో టెస్టులు జరిగాయి. జర్మనీలో ఈ రేటు 13 టెస్టులు(17 లక్షల టెస్టులు.. 1.33 లక్షల పాజిటివ్ కేసులు)గా ఉన్నది.

టెస్టింగ్.. టెస్టింగ్.. టెస్టింగ్..!

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ).. కరోనాను జయించే ఏకైక మార్గం టెస్ట్.. టెస్ట్.. టెస్ట్.. అని తెలిపింది. ట్రేస్ చేయాలి.. టెస్ట్ చేయాలి.. తర్వత ట్రీట్ చేయాలన్న సూత్రాన్ని ప్రతిపాదించింది. కానీ, మన సర్కారు ఈ సూత్రాన్ని అనుసరించట్లేదని తెలుస్తున్నది. ట్రేస్.. టెస్ట్.. ట్రీట్ అనే ధోరణిలో ఇక్కడ పరీక్షలు జరుగుతున్నాయి. ముందుగా విదేశాల నుంచి వచ్చినవారిని, వారి కుటుంబీకులు, వారి కాంటాక్టులోకి వచ్చినవారిని, జలుబు.. దగ్గు.. శ్వాసకోస సంబంధ సమస్యలున్నవారిని గుర్తించి(ట్రేస్).. టెస్టు చేసి ట్రీట్ చేయాలన్న సూత్రాన్ని పాటిస్తున్నట్టు అర్థమవుతున్నది. కానీ, దక్షిణ కొరియా దాదాపుగా అందరికీ టెస్టులు నిర్వహించింది. మనదేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న ఢిల్లీ, ముంబయి నగరాలు విస్తృత టెస్టుల వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఈ నగరాల్లో చాలా ఏరియాల్లో ర్యాండమ్ టెస్టుల నిర్వహణ ఇప్పటికే మొదలైంది. కానీ, భారీ జనాభా గల మనదేశంలో అందరికీ టెస్టులు నిర్వహించడం కష్టసాధ్యమైన విషయం. అందుకే కేసులు ఎక్కువ నమోదయ్యే ఏరియాల్లో నిబంధనలు కఠినం చేయడం.. శ్వాసకోశ సంబంధిత సమస్యలున్నవారికే కరోనా టెస్టులను పరిమితం చేయడాన్ని అనుసరిస్తున్నది. సరిపడా టెస్టింగ్ కిట్లను సమకూర్చుకుని విస్తృత టెస్టులకు భారత్ సమాయత్తం కావాల్సి ఉన్నది. ఎందుకంటే మే మొదటి వారంలో భారత్‌లో కరోనా పీక్‌కు చేరవచ్చునని ఓ కేంద్ర ప్రభుత్వోద్యోగి చెప్పారు. ఇటువంటి అంచనాలు వెల్లడవుతున్నప్పుడు టెస్టులను ముమ్మరం చేసి కరోనాకు కట్టడి చేయాల్సిన అవసరమున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags: coronavirus, tests, india, contain, icmr, rahul gandhi, confusion, pandemic, centre

Next Story