రెవెన్యూ రికార్డుల్లో లేరు..!

by  |
రెవెన్యూ రికార్డుల్లో లేరు..!
X

దిశ, కరీంనగర్: ఒకే డిపార్ట్ మెంట్‌కు అనుసంధానం అయిన ఆ రెండు విభాగాల తీరు తలోదారి అన్నట్లుగా ఉంది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పైపులైన్ కోసం గతంలో భూ సేకరణ చేశారు. అయితే ఇందులో కొందరికి భూమి ఉన్నట్లు మా రికార్డుల్లో లేదని రెవెన్యూ అధికారులు చెప్తుంటే.. మేం మాత్రం డబ్బులు ఇచ్చేశామని భూ సేకరణ విభాగం అధికారులు చెప్తున్నారు. అసలు భూ సేకరణ అధికారులు సేకరించిన రికార్డులు ఎవరివి..? రెవెన్యూ అధికారుల తమ దస్త్రాల్లో రాసుకుంటున్న వారి వివరాలు ఎవరివీ అన్నదే ఇప్పడు అంతుచిక్కకుండా తయారైంది. దీనిపై వివరాల్లోకి వెళితే..

మహదేవపూర్ మండల కేంద్రంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పైపులైన్ కోసం వెన్నపురెడ్డి బాపురెడ్డి అనే వ్యక్తి వద్ద నుంచి 473 సర్వే నెంబరులోని 14 గుంటల భూమికి రూ.4.37 లక్షలు చెల్లించామని భూ సేకరణ విభాగం అధికారులు చెబుతున్నారు. అయితే బాపురెడ్డికి 473 సర్వే నెంబర్‌లో భూమి కేటాయించినట్లు అసలు తమ రికార్డుల్లోనే లేదని మహదేవపూర్ రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. రికార్డుల్లో లేని వ్యక్తికి పరిహారం ఎలా అందించారన్నది ప్రశ్నార్థకంగా మారింది. కానీ, 473/1 అనే సర్వే నెంబరులో తనకు భూమిని కేటాయించినట్లు ఫైనల్ పట్టాలో బాపురెడ్డి తన వద్ద ఉన్న రికార్డులను చూపిస్తున్నారు.

పరిహారం ఎలా ఇచ్చారు..?

రెవెన్యూ విభాగం అధికారులు వారికి ప్రభుత్వ భూమిని ఇచ్చినట్లు రికార్డుల్లో ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోకుండానే ఎలా పరిహారం ఇచ్చారన్నది అర్థం కాకుండా పోయింది. ప్రభుత్వం భూమిని కేటాయించినట్లయితే వారి వివరాలు సంబంధిత రెవెన్యూ కార్యాలయాల్లో కూడా ఉండాలి. అలాగే లబ్ధిదారుల వివరాలు కేవలం పహాణీ నఖల్లో మాత్రమే ఉంటే సరిపోదని, ప్రొసీడింగ్స్ కూడా తీయాల్సి ఉంటుంది. అంతేకాకుండా డివిజనల్ అసైన్ మెంట్ కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించే ఆర్డీఓ ఏర్పాటు చేసే సమావేశాల్లో కూడా నిరుపేదల కోటాలో భూమి ఇచ్చినట్టు తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన రికార్డులు కూడా రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో కూడా ఉండాలి.

రికార్డుల్లో లేని వారికి పరిహారం ఇస్తారా..? : మేరుగు లక్ష్మణ్, మహదేవపూర్

473 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో వెన్నపురెడ్డి బాపురెడ్డి అనే వ్యక్తికి భూమి ఇచ్చినట్టు తమ రికార్డుల్లో లేదని సమాచార హక్కు చట్టం ద్వారా తెలిపారు. అయితే బాపురెడ్డి కూడా తన వద్ద రికార్డులు ఉన్నాయని, ఫైనల్ పట్టా కూడా ఇచ్చారని అంటున్నారు. భూసేకరణ సమయంలో చాలా మంది రికార్డులు సృష్టించుకుని పరిహారం పొందారు. సర్కారు ఇచ్చిన భూమిని సేకరించాల్సి వస్తే వేరే చోట బంచరాయ భూమిని కేటాయించకుండా పరిహారం అందించడం అనుమానాలకు తావిస్తోంది. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూ సేకరణపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.

భూమి కేటాయించింది వాస్తవమే : వెన్నపు రెడ్డి బాపురెడ్డి, మహదేవపూర్

నాకు భూమి కేటాయించింది వాస్తవమే. నక్సల్స్‌లో చేరి తిరిగి లొంగిపోయిన తరువాత ప్రభుత్వం నాకు భూమి కేటాయించింది. 2 ఎకరాలకు సంబంధించిన రికార్డులు నాపేరిట రెవెన్యూ అధికారులే ఇచ్చారు. వాటి ఆధారంగానే నేను భూ సేకరణ విభాగం నుంచి డబ్బులు తీసుకున్నాను.



Next Story

Most Viewed