కొత్త స్టార్స్.. ఐపీఎల్‌ 18వ సీజన్‌లో ఆకట్టుకున్న కొత్త కుర్రాళ్లు!

by Phanindra |

ఐపీఎల్‌ 18వ సీజన్‌లో కూడా ఎప్పట్లాగే కొత్త స్టార్స్ పుట్టుకొచ్చారు. ఈ సీజన్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన కొత్త కుర్రాళ్లు వీళ్లే!

కొత్త స్టార్స్.. ఐపీఎల్‌ 18వ సీజన్‌లో ఆకట్టుకున్న కొత్త కుర్రాళ్లు!
X

దిశ, స్పోర్ట్స్: ప్రతి ఏడాదీ ఐపీఎల్ నుంచి కొత్త కుర్రాళ్లు వెలుగులోకి వస్తూనే ఉంటారు. ఈ ఏడాది కూడా అదే జరిగింది. కొన్ని కొత్త మొఖాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిస్తే.. మనకు తెలిసిన కొందరు కుర్రాళ్లు తమ పూర్తి సత్తా ఏంటో చూపించారు. అలా ఈ సీజన్‌లో అదరగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించిన కుర్రాళ్లెవరో చూద్దామా..?

వైభవ్ సూర్యవంశీ

భారీ సిక్సర్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 14 ఏళ్ల సూర్యవంశీ.. ఎంత అద్భుతంగా రాణించాడో వేరే చెప్పక్కర్లేదు. ఆడిన ఏడు మ్యాచుల్లో 206 స్ట్రైక్ రేటు, 36 సగటుతో 252 పరుగులు చేశాడీ బిహార్ కుర్రాడు. ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ స్ట్రైక్ రేటులో నికోలస్ పూరన్ వంటి విధ్వంసకారుడిని కూడా వెనక్కు నెట్టేశాడు. ఇక గుజరాత్ టైటాన్స్‌పై సూర్యవంశీ విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే. జస్ట్ 38 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ హిస్టరీలోనే అతి తక్కువ వయసులో శతకం సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు.

ఆయుష్ మాత్రే

17 ఏళ్ల ఆయుష్ మాత్రే కూడా ఈ ఏడాది అరంగేట్రం నుంచే ఆకట్టుకున్నాడు. ఎక్కువగా సీనియర్లపై ఆధారపడే చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టులో మాత్రే అరంగేట్రం చేయడం విశేషం. ఆర్సీబీపై తను ఆడిన 94 పరుగుల ఇన్నింగ్స్.. ఈ సీజన్‌కే హైలైట్ అని చెప్పొచ్చు. మొత్తం ఏడు మ్యాచులాడిన మాత్రే.. 188.97 స్ట్రైక్ రేటు, 34.29 సగటుతో 240 పరుగులతో ఆకట్టుకున్నాడు.

అనికేత్ వర్మ

సన్‌రైజర్స్ తరఫున అరంగేట్రం చేసిన అనికేత్ వర్మ కూడా ఈ సీజన్‌లో ఆకట్టుకున్నాడు. 12 ఇన్నింగ్సుల్లో 166.19 స్ట్రైక్‌రేటు, 26.22 సగటుతో 236 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ కష్టా్ల్లో ఉన్నప్పుడు 23 ఏళ్ల అనికేత్ ఆడిన 74 రన్స్ ఇన్నింగ్స్ ఫ్యాన్స్‌ అంత త్వరగా మర్చిపోలేరు.

విప్రాజ్ నిగమ్

ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేంట్రం చేసిన 20 ఏళ్ల విప్రాజ్.. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండు విభాగాల్లో ఆకట్టుకున్నాడు. 8 ఇన్నింగ్సుల్లో 172.17 స్ట్రైక్ రేటు, 20.29 సగటుతో 142 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 13 ఇన్నింగ్సుల్లో 11 వికెట్లతో ఆకట్టుకున్నాడు.

అన్షుల్ కాంబోజ్

ఈ ఏడాది చెన్నయ్ సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అన్షుల్ కాంబోజ్ కూడా అందరి దృష్టి ఆకర్షించాడు. గతేడాది ముంబై తరఫున అరంగేట్రం చేసిన అన్షుల్ అంతగా రాణించలేదు. కానీ ఈ ఏడాది ఆడిన 8 మ్యాచుల్లో 8 వికెట్లు తీసుకొని ఆకట్టుకున్నాడు. ఖలీల్ అహ్మద్‌తో కలిసి కొత్త బంతిని పంచుకున్న అన్షుల్ 8 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేయడం కూడా గమనార్హం.

అశ్వని కుమార్

ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన అశ్వనీ కుమార్ కూడా అద్భుతమైన బౌలింగ్‌తో రాణించాడు. బుమ్రా, బౌల్ట్, హార్దిక్ వంటి సీనియర్లు ఉన్న జట్టులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించాడు. ఆడిన 7 ఇన్నింగ్సుల్లో 11 వికెట్లతో రాణించాడు.

దిగ్వేష్ రాఠీ

ఈ ఏడాది లక్నో సూపర్ జెయింట్స్ బెస్ట్ బౌలర్ దిగ్వేష్ రాఠీనే. తన ఐకానిక్ నోట్ బుక్ సెలబ్రేషన్‌తో వైరల్ అయిన రాఠీ.. 13 ఇన్నింగ్సుల్లో 8.25 ఎకానమీతో 14 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తన ఎగ్రెషన్‌ కూడా చాలామందికి నచ్చింది.

ప్రియాన్ష్ ఆర్య

పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య ఈ ఏడాది అందరి దృష్టినీ ఆకర్షించిన విధ్వంసకర ఓపెనర్. ఈ సీజన్‌లో మొత్తం 17 మ్యాచులాడిన తను 179.23 స్ట్రైక్ రేటు, 29.13 సగటుతో 466 పరుగులు చేశాడు. చెన్నయ్‌పై ఆర్య చేసిన సెంచరీ చాలాకాలం ఎవరూ మర్చిపోలేరు.

నేహాల్ వధీర

పంజాబ్ కింగ్స్ యంగ్‌స్టర్ నేహాల్ వధీర కూడా ఈ ఏడాది అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆడిన 16 మ్యాచుల్లో 147.01 స్ట్రైక్ రేటు, 33.55 సగటుతో 369 పరుగులు చేశాడు. రాజస్తాన్ రాయల్స్‌పై అతను కేవలం 37 బంతుల్లోనే 70 పరుగులు చేసిన ఇన్నింగ్స్ ఈ సీజన్ హైలైట్స్‌లో ఒకటని చెప్పొచ్చు.

సూయష్ శర్మ

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆశించినన్ని వికెట్లు తీయకపోయినా.. మిడిల్ ఓవర్లను శాసించిన స్పిన్నర్ సూయష్ శర్మ. ఆర్సీబీ విజయాల్లో తనదంటూ ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూ వచ్చిన సూయష్.. క్వాలిఫైయర్-1లో పంజాబ్‌పై చెలరేగాడు. మూడు వికెట్లతో అద్భుతమైన ప్రదర్శన చేశాడు.

Next Story