కోటలు దాటిన కేసీఆర్ మాటలు.. కలగానే మిగిలిన ఇంటింటికీ ఇంటర్నెట్

by  |
internet
X

దిశ, తెలంగాణ బ్యూరో : “ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తాం. హైదరాబాద్‌లో ఉండే అన్ని సౌకర్యాలు ఇకపైన గ్రామాల్లోనూ కల్పిస్తాం. ఆ లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నాం’’. – 2016 జూన్ 10 మెదక్ జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల ప్రజలతో జరిగిన ముఖాముఖి సభలో సీఎం కేసీఆర్.

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ హైస్పీడ్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్షన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ప్రతీ గ్రామ పంచాయతీకి ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఇప్పటికీ చాలా గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా నీటి పైపులైన్‌తో పాటే ఫైబర్ కేబుల్‌ను కూడా వేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో గొప్పగా ప్రకటించారు. కానీ ఆ లక్ష్యం పూర్తికాకపోవడంతో కరోనా సమయంలో ఇంటర్నెట్ సదుపాయం లేక విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకాలేకపోతున్నారు. చౌకధరల దుకాణాల్లో బయోమెట్రిక్ వ్యవస్థకు సిగ్నల్స్ దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ‘టీ ఫైబర్‌ గ్రిడ్‌‘ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్‌ అందించాలని నిర్ణయించింది. రాష్ట్ర హెడ్‌క్వార్టర్‌ నుంచి మొదలుపెట్టి జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు, గ్రామాలు, వ్యక్తిగత గృహాలు, ఇతర వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఫైబర్‌ కేబుల్‌ వేయనున్నట్లు తెలిపింది. కేబుల్‌ వేసే బాధ్యతలను ఎల్‌అండ్‌టీ, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌లకు టెండర్ల ద్వారా అప్పగించింది. ఈ పనులను 2022 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. మిషన్‌ భగీరథ పైపులైన్ల ద్వారా వేసిన హై డెన్సిటీ పాలీ ఇథిలీన్‌ పైపుల ద్వారా ఇంటర్నెట్ కేబుళ్ళను కూడా వేయాలన్నది ప్లాన్.

ఆ పనులు పూర్తయితే ప్రతీ ఇంటికీ హై స్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ సౌకర్యం లభిస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదని ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌కు ప్రభుత్వం ‘రైట్‌ ఆఫ్‌ వే‘ ఆదేశాలు జారీచేసింది. కానీ ఇప్పటికీ చాలా గ్రామాలకు ఫైబర్ కేబుల్ వేయలేదు. కొన్ని గ్రామాలకు మాత్రమే కేబుల్స్ పడ్డాయి. అన్ని గ్రామ పంచాయతీలకు తొలి ప్రాధాన్యతగా ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని కల్పించేలా ప్లాన్‌లో మార్పులు చేసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఆ ప్రకారం వచ్చే సంవత్సరం ఆగస్టు నాటికి అన్ని గ్రామాలకూ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.

ఈ ఏడాది జూన్ నుంచే 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఇస్తామని మంత్రి కేటీఆర్ ఏప్రిల్ 8న ఫైబర్ గ్రిడ్ బోర్డు సమావేశంలో ప్రకటించారు. కానీ అది పట్టాలెక్కలేదు. ఫలితంగా గ్రామాల్లో అనేక రకాల ఆన్‌లైన్ సేవలకు మోక్షం కలగలేదు. ఈ కారణంగా పంచాయతీ కార్యదర్శులు ఉన్నతాధికారులతో చివాట్లు తినాల్సి వస్తున్నది. నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామాల్లోని వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు, హరితవనం తదితర అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికలను పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా పొందుపర్చాల్సి ఉంది. గ్రామాల్లో జనన, మరణ వివరాలు, ఇతర ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను కూడా ఆన్‌లైన్‌ విధానంలోకి మార్చింది. వీటన్నింటికీ ఇంటర్నెట్ అవసరం. ఈ సౌకర్యం ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో వ్యక్తిగత స్మార్ట్‌ ఫోన్ల ద్వారానే సమాచారాన్ని మండల పరిషత్‌ కార్యాలయాలకు పంపిస్తున్నారు. అక్కడి కంప్యూటర్‌ ఆపరేటర్లు ఆన్‌లైన్‌లో రికార్డు చేస్తున్నారు.

విద్య, వైద్య, వాణిజ్యం, బ్యాంకింగ్‌, పౌరసేవలు లాంటివి చాలా ఆన్‌లైన్‌లోకి మారిపోయాయి. కొవిడ్‌ కారణంగా ఆన్‌లైన్‌ సేవలకు డిమాండ్ మరింత పెరిగింది. ఫైబర్ కేబుల్ ద్వారా మెరుగైన సేవలందించాలని ప్రభుత్వం భావించినప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో గ్రామాల్లోని విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు హాజరుకాలేకపోతున్నారు. చదువుకు దూరమవుతున్నారు. దీన్ని గమనంలోకి తీసుకున్న విద్యాశాఖ ‘టీ-శాట్‘ ద్వారా పాఠాలను రికార్డు పద్ధతిలో విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్నది.

ఇక చౌకధరల దుకాణాల దగ్గర ప్రజలు సరుకుల కోసం తిప్పలు పడుతున్నారు. ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం, మొబైల్ సిగ్నల్స్ లేకపోవడంతో బయోమెట్రిక్ విధానం సక్రమంగా పనిచేయడంలేదు. కొన్ని చోట్ల రేషన్ డీలర్లు సరుకుల పంపిణీని నిలివేస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న పౌరసరఫరాల శాఖ స్థానికంగా ఉండే విద్యాశాఖకు చెందిన టీచర్లు, బోధనేతర సిబ్బందిని థర్డ్ పార్టీ అథారిటీగా గుర్తించి రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాల ఆధారంగా నిత్యావసర వస్తువుల పంపిణీ సక్రమంగా జరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నది.

పనులు పురోగతిలో ఉన్నాయి : నరేశ్, డిప్యూటీ ఇంజనీర్, టీ-ఫైబర్, నల్లగొండ

“జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు పనులు ముమ్మరం చేశాం. ఇప్పటివరకు 200 గ్రామాలకు కనెక్షన్ ఇచ్చాం. కానీ సేవలను మాత్రం ఇంకా ప్రారంభించలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ప్రారంభిస్తాం. మిగిలిన గ్రామాల్లో వచ్చే ఏడాది చివరి వరకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా పనులు ముమ్మరం చేస్తాం’’.


Next Story

Most Viewed