ఆ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం

by  |
ఆ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచేందుకు ప్రవేశ పెట్టిన బీమా సవరణ బిల్లు-2021ను లోక్‌సభ ఆమోదించింది. గతవారం 18న రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 2015లో 26 శాతం నుంచి 49 శాతానికి పెంచారు. ఈ అంశంపై మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 74 శాతానికి పెంచడం అవసరమని, ఎందుకంటే ఇది ఆర్థిక ఒత్తిడికి గురయ్యే బీమా సంస్థలకు సహాయంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇది ప్రైవేట్ రంగ బీమా సంస్థలకు వనరులను పెంచేందుకు దోహదపడుతుంది. వాటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ఈ పెంపు ఉపయోగపడుతుందన్నారు. వృద్ధి సాధిస్తున్న దేశంలో ప్రైవేట్ రంగ బీమా సంస్థలకు సరైన పరిమాణంలో వనరులను అందించకపోతే భవిష్యత్తు ఆకాంక్షలను తీర్చలేమని, ప్రభుత్వం ఒంటరిగా దీన్ని చేయలేదని పేర్కొన్నారు. దీనికోసం మూలధనాన్ని అందుబాటులో ఉంచాలని భావించామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.


Next Story