గుడ్‌న్యూస్.. విక్రాంత్ మొదటి సీ ట్రయల్స్ విజయవంతం

by  |
ins-vikranth
X

కొచ్చి: భారత్ ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన మొదటి విమాన వాహక నౌక ఐఏసీ విక్రాంత్ తన తొలి సముద్ర ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసినట్లు నేవీ తెలిపింది. ఈ నెల ఆగస్ట్ 4 న విక్రాంత్ సముద్రంలోకి వివిధ పరీక్షల నిమిత్తం బయల్దేరి వెళ్లింది. ప్రస్తుతం పూర్తి చేసిన అన్నీ పరీక్షల్లో అనుకున్న ఫలితాలు వచ్చాయి. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు పూర్తి చేసి విక్రాంత్‌ను నేవీకి అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు. కాగా విక్రాంత్‌కు వచ్చే ఏడాది ఆగస్టు వరకు వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తామని నేవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. విక్రాంత్ తయారీ పనులను 2013 లో కొచ్చి షిప్ యార్డ్ లో ప్రారంభించారు. దీనికి డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ ( డీఎన్డీ) అవసరమైన డిజైన్‌ను అందించింది. ఆత్మనిర్భర భారత్‌‌కు విక్రాంత్ ఒక ఉదాహరణగా ప్రభుత్వం చెబుతోంది. ఇందులో 76 శాతం సాంకేతికతను మేకిన్ ఇండియా స్ఫూర్తితో తీసుకుని అభివృద్ది చేసినట్లు రక్షణ శాఖ తెలిపింది.

కాగా విక్రాంత్ 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఎత్తు 59 మీటర్లు. ఇందులో 14 డెక్‌లున్నాయి. ఇందులో 2,300 కంపార్ట్మెంట్లు 1,700 మంది సిబ్బందికి అనుకూలంగా నిర్మించారు. పైగా మహిళలకు ప్రత్యేకంగా క్యాబిన్ లను రూపొందించారు. ఈ నౌకలో ఉన్నత ప్రమాణాలు కలిగిన ఆటోమేషన్ మెషినరీ, ప్రత్యేక నావిగేషన్ , సర్వేబిలిటివంటి సాంకేతికతను వాడారు. మొదటి సముద్ర ప్రయాణం‌లో ప్రోపల్షన్, పవర్ జనరేషన్ డిస్ట్రిబ్యూషన్, అగ్జిలరీ ఎక్విప్‌మెంట్‌ను పరీక్షించారు. పరీక్షలలో వైస్ అడ్మిరల్ ఎకే చావ్లా, ప్లాగ్ కమాండింగ్ ఆఫీసర్ ఇన్ చీఫ్ సదరన్ నేవల్ అధికారి పాల్గొని పరీక్షల పట్ల సంత‌‌‌‌‌‌‌ృప్తి వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed