భారత్‌లో రికార్డు స్థాయిలో ఆర్థిక లోటు

by  |
భారత్‌లో రికార్డు స్థాయిలో ఆర్థిక లోటు
X

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. లాక్‌డౌన్, వ్యాపారాలు పుంజుకోకపోవడంతో ట్యాక్స్ వసూళ్ల తగ్గిపోయాయి. మరోవైపు ప్రజల ప్రాణాలను కాపాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్ కోసం ప్రభుత్వ వ్యయం పెరిగిపోయింది. ఈ పరిణామాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఆర్థిక లోటు రికార్డు స్థాయిలో రూ.6.62లక్షల కోట్లకు చేరుకున్నది. కరోనా మహమ్మారి కారణంగా తొలి త్రైమాసికంలో ఆర్థిక లోటు స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 7.5శాతం వరకు ఉంటుందని పలువురు ఆర్థికవేత్తలు 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో అంచనా వేశారు.

అయితే, 3.5శాతం వరకు ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేయగా అంతుకుమించి ఆర్థికలోటు నెలకొనడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో -5.1శాతం వృద్ధిరేటు ఉంటుందని అంచనా. ఒకవేళ పరిస్థితులు మరింత దుర్లభంగా ఉంటే అది -9.1శాతానికి దిగజారి 1979లో ఏర్పడిన పరిస్థితికి రావచ్చని పలువురు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. ఏప్రిల్, జూన్ మధ్యకాలంలో నికర పన్నుల వసూళ్లు 46శాతం పడిపోయి రూ.1.35లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇంధన ఉత్పత్తులపై భారీగా పన్నులు పెంచినా పన్నుల వసూళ్లు పెరగకపోవడం గమనార్హం.

2019-20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నికర పన్ను వసూళ్లు రూ.2.51లక్షల కోట్లుగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో ప్రభుత్వ వ్యయం 13శాతం పెరిగి రూ.8.16లక్షల కోట్లకు చేరుకున్నది. ఈ వ్యయం అంతకుముందు ఏడాది తొలి త్రైమాసికంలో 7.22లక్షల కోట్లుగా ఉన్నది. కరోనా వ్యాప్తి కారణంగా ప్రభుత్వం ఉచితంగా బియ్యం లేదా గోధుమలు పంపిణీ చేయడం, లక్షల మంది వలస కార్మికుల కోసం ఉపాధి కార్యక్రమాలు చేపట్టడంతో ప్రభుత్వ వ్యయం పెద్ద ఎత్తున పెరిగినట్లు తెలుస్తున్నది.

రెండు నెలలకుపైగా సుదీర్ఘ లాక్‌డౌన్ విధించడం ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీసిందని, ఈ ప్రభావం పన్ను వసూళ్లపై పడిందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ లోటును పూడ్చుకోవడం కోసం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేకరించి పూడ్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తున్నది. బడ్జెట్‌ లోటును పూడ్చడం కోసం మార్కెట్ నుంచి రూ.7.8లక్షల కోట్ల రుణాలను సేకరించాలని మొదట లక్ష్యం పెట్టుకుంది. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా దీనిని రూ.12లక్షల కోట్లకు పెంచింది.


Next Story

Most Viewed