ఆగష్టులో 46 శాతం పెరిగిన భారత ఎగుమతులు.. కానీ !

43
exports

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది ఆగష్టులో భారత ఎగుమతులు మెరుగైన వృద్ధిని సాధించాయి. పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువులు, పత్తి నూలు మద్దతుతో ఆగష్టులో మొత్తం ఎగుమతులు 45.8 శాతం పెరిగి సుమారు రూ. 2.45 లక్షల కోట్లుగా నమోదైనట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. అయితే, అంతకుముందు జూలైలో నమోదైన 50 శాతం ఎగుమతుల వృద్ధి కంటే ఈసారి మందగించింది. బంగారం దిగుమతుల విలువ అత్యధికంగా రూ. 3.47 లక్షల కోట్లుగా నమోదవడంతో, వాణిజ్య లోటు రూ. 1.02 లక్షల కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే నెలలో వాణిజ్య లోటు రూ. 60 వేల కోట్లుగా మాత్రమే నమోదైంది.

ఇక, సమీక్షించిన నెలలో దిగుమతుల వృద్ధి 51.72 శాతంగా నమోదైంది. బంగారం దిగుమతులు గత నెలలో 82.48 శాతం పెరిగి ఐదు నెలల గరిష్ఠానికి దాదాపు రూ. 50 వేల కోట్లకు చేరుకున్నాయి. చమురు దిగుమతులు గతేడాదితో పోలిస్తే 80.64 శాతం వృద్ధితో రూ. 86 వేల కోట్లుగా ఉన్నాయి. ‘భారత్‌లోని ప్రధాన ఎగుమతుల మార్కెట్లలో స్థిరమైన డిమాండ్ ఉండటంతో ఆగష్టులో ఇది మరింత వృద్ధి నమోదు చేసినట్టు’ ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ రీసెర్చ్, అనాలసిస్ చీఫ్ జనరల్ మేనేజర్ ప్రహలతన్ అయ్యర్ చెప్పారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..