ఏటా ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి 26 శాతం..

by  |
business news
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలతో పాటు, ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) డిమాండ్ భారీగా పెరిగే అవకాశాలున్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ సొల్యూషన్స్ అభిప్రాయపడింది. 2020-2023 మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వార్షిక వృద్ధి సగటున 26 శాతం ఉంటుందని ఫిచ్ సొల్యూషన్స్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, కొవిడ్ అవాంతరాలు, ఇంకా ఇతర సవాళ్లు ఉన్న కారణంగా 2032 నాటికి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించాలనే లక్ష్యం నెరవేరకపోవచ్చని ఫిచ్ పేర్కొంది.

ప్రస్తుతం కొవిడ్ సంబంధిత సమస్యల వల్ల ఈవీ ఉత్పత్తి తగ్గిందని, దీనివల్ల పూర్తి ఈవీల విక్రయం అంత త్వరగా సాధ్యం కాకపోవచ్చని వివరించింది. యూనియన్ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రత్యేకమైన దృష్టి సారించడం వంటి పరిణామాల వల్ల అమ్మకాలు మరింత వృద్ధి సాధించవచ్చని భావిస్తున్నాం. దీనివల్ల 2032 కంటే కొంత ఆలస్యంగానైనా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించే అవకాశ ఉంటుందని ఫిచ్ తెలిపింది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌లపై అదనంగా రూ. 1 సుంకం పెంపు, ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహనాలను కొనే వారికి ఆదాయ పన్ను ప్రోత్సాహకాల వంటి అంశాలు ఈవీల అమ్మకాల వృద్ధికి దోహదపడతాయని ఫిచ్ సొల్యూషన్స్ వెల్లడించింది.

ఆసియాలో ఈవీలకు డిమాండ్..

భారత్ వెలుపల ఆసియా మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా వృద్ధి సాధిస్తోందని ఫిచ్ తెలిపింది. ప్రధానంగా ఈ ప్రాంతంలోని చాలా దేశాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే విధానాలను పాటించడం, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు, ఈవీల తయారీ పెట్టుబడులను ఆకర్షించడం లాంటి కీలక అంశాలు ఈ వృద్ధికి తోడ్పడుతున్నాయని ఫిచ్ పేర్కొంది. ప్రస్తుత ఏడాది ఆసియా ప్రాంతంలో ఈవీ అమ్మకాలు 78.1 శాతం పెరుగుతాయని ఫిచ్ అంచనా వేసింది. గతేడాది ఇది 4.8 శాతం మాత్రమే ఉంది. అలాగే, 2030 నాటికి ఆసియాలో మొత్తం 1.09 కోట్ల యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయని ఫిచ్ సొల్యూషన్స్ వెల్లడించింది. 2021-2029 మధ్య ఈవీ డిమాండ్‌లో ఎక్కువ భాగం అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థలు చైనా, జపాన్, దక్షిణ కొరియా నుంచే ఉంటాయి. ఈ దేశాలు ఆర్థిక పటిష్ఠత, కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో ఈవీ విక్రయాలను ప్రోత్సహిస్తాయని ఫిచ్ సొల్యుషన్స్ పేర్కొంది.

Next Story

Most Viewed