మరో పుల్వామాకు కుట్ర..

by  |
మరో పుల్వామాకు కుట్ర..
X

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రవాద కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. పుల్వామా తరహా ఆత్మాహుతి దాడి యత్నాన్ని చాకచక్యంగా నిరోధించాయి. భద్రతా బలగాలను లేదా క్యాంపులను పేల్చేసే లక్ష్యంగా సాగిన ఉగ్రవాదుల ఎత్తుగడను ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, పుల్వామా పోలీసులు సంయుక్తంగా అడ్డుకున్నాయి. దాదాపు 40 నుంచి 45 కిలోల పేలుడు పదార్థాలను ఓ కారులో తీసుకెళ్తున్న ఉగ్రవాదిని బుధవారం రాత్రి కాపుకాసి భారీ విధ్వంసాన్ని ఆపగలిగారు. డీజీపీ దిల్బాగ్ సింగ్, ఐజీ విజయ్ కుమార్, ఇతర అధికారుల వివరాల ప్రకారం జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన టెర్రరిస్టులు భారీ పేలుడుకు కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందుకున్నాయి. పేలుడు పదార్థాలతో ఓ కారు తిరుగుతున్నదని, ఏ క్షణంలోనైనా పుల్వామాలో ఆత్మాహుతి దాడి జరిగే ప్రమాదం ఉందని పసిగట్టాయి. ఈ సమాచారంతో భద్రతా బలగాలను నిఘావర్గాలు అప్రమత్తం చేశాయి. వెంటనే రంగంలోకి దిగిన బలగాలు బుధవారం రాత్రి నుంచి తనిఖీలు ముమ్మరం చేశాయి. ఫేక్ నెంబర్ ప్లేట్‌తో తిరుగుతున్న హ్యుందాయ్ సాంత్రో కారును భద్రతా బలగాలు పసిగట్టాయి. ముందస్తు సమాచారం మేరకు పుల్వామాలోని రాజ్‌పొరాలో నిన్న(బుధవారం) రాత్రి ఆ ఫేక్ నెంబర్ ప్లేట్ కారు కనిపించగానే ఆపాల్సిందిగా పోలీసులు సంజ్ఞ చేశారు. కానీ, ముజాహిద్దీన్ ఉగ్రవాది కారును ఆపకుండా బారికేడ్లను ఢీకొంటూ దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో ఇరువైపులా కాల్పులు మొదలయ్యాయి. ఫైరింగ్ మొదలు కాగానే కారు దిగిన ఉగ్రవాది చీకటి కారణంగా భద్రతా బలగాల కండ్లుగప్పి పరారయ్యాడు. కాల్పులు ఆపగానే కారును పరిశీలించిన పోలీసులు, వెనుక సీటులో నీలిరంగు డ్రమ్ములో పేలుడు పదార్థాలు(ఐఈడీ) ఉన్నట్టు గుర్తించారు. మరోచోటికి దాన్ని తరలిస్తే పేలిపోయే ప్రమాదం ఉందని భావించి రాత్రంతా అబ్జర్వేషన్‌లోనే ఉంచారు. ఈ సమయంలోనే ఆ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలను మరోచోటికి తరలించి, బాంబు నిర్వీర్య బృందాలకు స్పాట్‌ దగ్గరకు పిలిపించారు. గురువారం ఉదయం ఆ బాంబును కారులోనే ధ్వంసం చేశారు. పేలుడు ధాటికి సమీపంలోని కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి.

హిజ్బుల్, జైషేల పాత్ర : ఐజీ కుమార్

రాజ్‌పొరాలోని అయాన్‌గుండ్ ఏరియాలో జరిగిన ఈ ఘటన గురించి ఐజీ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. జైషే మహమ్మద్ దాడికి ప్రయత్నిస్తున్నట్టు వారం క్రితమే సమాచారం అందిందని, అప్పటి నుంచే అప్రమత్తంగా ఉన్నామని వివరించారు. పేలుడు పదార్థాలతో కారులో ఓ ఉగ్రవాది వెళ్తున్నాడని బుధవారం రాత్రే పక్కా సమాచారం అందిందని, తనిఖీలు ముమ్మరం చేశామని తెలిపారు. కారు నడుపుతున్న ఉగ్రవాదిని హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఆదిల్‌గా గుర్తించామని, ఈ కుట్రలో జైషే మహమ్మద్ కీలక పాత్ర పోషించిందని అన్నారు.

2019 పుల్వామా తరహాలోనే గతేడాది ఫిబ్రవరి 14న జమ్ము‌కశ్మీర్‌ పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దర్ ఓ కారులో పేలుడు పదార్థాలను తీసుకెళ్తూ సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌ను ఢీకొని ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 40 మంది జవాన్లు మృతిచెందారు. ఇదే తరహాలో పుల్వామాలోనే జైషే సూచనలతో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది ఆదిల్ కారులో పేలుడు పదార్థాలతో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడే కుట్ర పన్నినట్టు తెలుస్తున్నది. గతేడాది జరిగిన దాడికి సంబంధించి నిఘా వర్గాలపై పలు ఆరోపణలు వచ్చాయి. కానీ, ఈసారి సరైన సమయంలో తగిన సమాచారాన్ని ఇంటెలిజెన్స్ అందించడంతో భద్రతా బలగాలు కుట్రను భగ్నం చేయగలిగాయి.

కశ్మీర్‌లో ఆగని ఉగ్ర కార్యకలాపాలు

కరోనా వైరస్ ప్రబలుతున్నా, లాక్‌డౌన్ అమల్లో ఉన్నా కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలు మాత్రం ఆగడం లేదు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత పటిష్ట భద్రతతో ఉగ్ర దాడులు తగ్గుముఖం పట్టినా రెండు నెలలుగా ఎన్‌కౌంటర్లు మళ్లీ పెరుగుతున్నాయి. రెండు నెలల్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్లలో 30 మంది భద్రతా అధికారులు సహా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, 38 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మే తొలినాళ్లలో మోస్ట్ వాంటెడ్, హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ రియాజ్ నాయికూను పుల్వామాలోనే పోలీసులు మట్టుబెట్టడం గమనార్హం.


Next Story

Most Viewed