భారత ఔషధ కంపెనీలపై అమెరికాలో దావా!

by  |
భారత ఔషధ కంపెనీలపై అమెరికాలో దావా!
X

ముంబయి: దేశీయ ప్రముఖ ఔషధ కంపెనీలు అరబిందో ఫార్మా, సన్‌ఫార్మా, లూపిన్లు అమెరికాలో న్యాయ వివాదంలో చిక్కుకున్నాయి. మార్కెట్లలో పోటీని తగ్గించడం కోసం కృత్రిమ కొరత సృష్టించి ధరల పెరుగుదలకు కారణమయ్యాయని, తద్వారా అమెరికాలో అనేక చోట్ల ఔషధాలను విక్రయించినట్టు మేరీలాండ్ అటార్నీ జనరల్ బ్రియాన్ ప్రోష్ కనెక్టికట్ కోర్టులో దావా వేశారు. ఇందులో పలు దేశాలకు చెందిన 26 కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ న్యాయ వివాదంలో ఇతర రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కూడా జతకలిశారు. అమెరికాలో ఔషధాల అమ్మకాల్లో అక్రమమైన విధానాలకు పాల్పడినట్టు దావాలో ప్రస్తావించారు. అందులో అరబిందో, సన్‌ఫార్మా, లూపిన్ ఔషధ కంపెనీల పేర్లు ప్రస్తావించారు. మొత్తం 26 ఔషధ కంపెనీలు కలిసి 80 రకాల జనరిక్ ఔషధాలను మార్కెటింగ్‌ చేశాయని, ఇందులో 10మంది వ్యక్తులు అవకతవకలకు పాల్పడినట్టు బ్రయాన్ పేర్కొన్నారు. ఈ అవకతవకల వల్ల అమెరికా బిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోయిందన్నారు. ఆయా కంపెనీలకు భారీ పెనాల్టీ విధించాలని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా చర్యలు తీసుకొనేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. ఈ వివాదంలో ఉన్న కంపెనీల ప్రతినిధులు పలు సందర్భాల్లో పరస్పరం కలుసుకుని చట్ట వ్యతిరేక ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, ఔషధ మార్కెట్‌ను తమ గుప్పిట్లో ఉంచుకొనే చర్యలపై చర్చించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిణామాలతో అమెరికాలోని వ్యాధిగ్రస్తులకు, మేరీలాండ్ రాష్ట్రానికి, ఆరోగ్య బీమా కంపెనీలకు భారీ నష్టం వాటిల్లినట్టు బ్రయాన్ పేర్కొన్నారు. అమెరికా చరిత్రలో కంపెనీలు ఏకమై ధరలు పెంచిన కేసుల్లో ఇదే పెద్దదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



Next Story